ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం

ఎస్.ఈ.సి కి లేఖ రాసిన తెదేపా ఎం.ఎల్.సి అశోక్ బాబు
13 స్థానిక నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహణలో ఎస్.ఈ.సి పూర్తిగా వైఫల్యం చెందింది.అధికార పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యదేచ్చగా ఉల్లంఘించింది. ఎక్కడ చూసిన నగదు, మద్యం పంపిణీ, అక్రమ ప్రచారం, హింస, బయటి వ్యక్తుల ద్వారా బోగస్‌ ఓట్లు వేయడం లాంటివి కనిపించాయి.
ఇకనైనా కనీసం పోలింగ్ అనంతర అంశాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సక్రమంగా అమలు చేయడం చాలా అవసరం.17 నవంబర్ 2021న జరిగే కౌటింగ్ కైనా బ్యాలెట్ బాక్సులు భద్రపరిచి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరిగేలా చూడాలి. లెక్కింపు ప్రక్రియనైనా పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఈ క్రింది అంశాలను ఎన్నికల సంఘం ముందుంచుతోంది.
అన్ని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బ్యాలెట్ బాక్సులకు తగిన భద్రత ఉండేలా చూసుకోండి. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లకు అన్ని రాజకీయ పార్టీల సంతకాలు, సీలు వేయాలి. ఇంకా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24×7 సాయుధ నిఘా ఉంచండి.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకతతో జరిగేలా పోటీలో ఉన్న అభ్యర్థులు/రాజకీయ పార్టీలకు లింక్‌ను అందించాలి.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నియమితులైనవారు 24 గంటలూ భద్రతా విధులు సక్రమంగా చేసేలా చూసుకోవాలి.పారదర్శకమైన లెక్కింపు ప్రక్రియ కోసం, కౌంటింగ్ సిబ్బందిని ఒకే జిల్లాకు చెందిన వారిని కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి నియమించడం చాలా అవసరం.అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల నుండి సంతకాలు తీసుకున్న తర్వాత ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటించాలి.
తదుపరి రౌండ్ కౌంటింగ్ టాబులేషన్ చేసి మాత్రమే ప్రారంభించాలి. ఇదే సమాచారం కౌంటింగ్ ఏజెంట్ కు, పోటీ చేసిన అభ్యర్థికి రౌండ్ నుండి రౌండ్ కి అందించాలి.కౌంటింగ్ ఏజెంట్లు, పోటీలో అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే తుది ఫలితాలు ప్రకటించాలి.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పై అంశాలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయడం చాలా అవసరం. రాష్ట్ర ఎన్నికల సంఘం సత్వర చర్య మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిపేందుకు దోహదపడుతుంది.