Suryaa.co.in

Andhra Pradesh

మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం కాదు

• గత ప్రభుత్వ సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం
• ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం
• వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ… బయట చేస్తున్న ప్రతి ఆగడంపైనా నిఘా ఉంది
• వైసీపీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు
• మహిళలు, ఆడబిడ్డలపై నోరు పారేసుకునే ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు తప్పవు
• వైసీపీ నాయకుడి నుంచి ఆయన సోదరి రక్షణ కోరితే భద్రత కల్పిస్తాం
• అధికారులు ప్రభుత్వానికి పేరు తెచ్చేలా పనిచేయాలి
• సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను
• సనాతన ధర్మ పరిరక్షణకు పార్టీలో ‘నారసింహ వారాహి గణం’ విభాగం ఏర్పాటు
• ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో దీపం – 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘వైసీపీ నాయకులకు, మద్దతుదారులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు. ప్రజలు వారికి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టినా వారి తీరులో మార్పులేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయిట్లు వైసీపీ నాయకులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా ఊరుకొనేది లేదని, అలాంటి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిఘా ఉంటుందని చెప్పారు. ఇక నుంచి మహిళలపై తప్పుగా మాట్లాడితే కాళ్లు, కీళ్లు విరిచేలా పని చేస్తామని హెచ్చరించారు.

ఏలూరు జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, ద్వారకా తిరుమల మడలం, ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం -2 పథకంలో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులైన మహిళలకు గ్యాస్ సిలిండర్లను పవన్ కళ్యాణ్  స్వయంగా అందజేశారు. ఉచిత సిలిండర్లు తీసుకెళ్తున్న ఆటోకు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆడపిల్లల భద్రతకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. ఇంట్లోకి వచ్చి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తాం.. దాడులు చేస్తాం.. కిడ్నాప్ చేస్తాం అంటూ మాట్లాడే వారు ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం. మహిళలపై ఇష్టానుసారం మాట్లాడే వారికి ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని శిక్షలు సరిపోవనేది నా అభిప్రాయం. అలాంటి వారికి మా స్టైయిల్లో తగిన శిక్షలు ఉంటాయి.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, గత ప్రభుత్వం కంటే సంక్షేమాన్ని అత్యుత్తమంగా అందిస్తామని హామీ ఇచ్చినట్లుగానే ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు దీపం-2 పథకం ఓ ముందడుగు. రాష్ట్రంలోని 1,08,39,286 మంది అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. దీనికోసం ఏడాదికి రూ.2,684 కోట్లు వ్యయం అవుతుంది. అయిదేళ్లకు రూ.13,425 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తున్నాం.

శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం సమగ్ర అభివృద్ధికి కృషి

తిరుమల తర్వాత అంతటి శక్తి ఉన్న క్షేత్రం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మినరసింహ క్షేత్రం. 2009లో ప్రజారాజ్యం ఓటమి తర్వాత ఒంటరిగా ఉండిపోయిన సమయంలో నేను ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాను. త్రేతాయుగంలో స్వయంభుగా శ్రీ లక్షినరసింహ స్వామి వెలిసిన క్షేత్రంగా దీనికి ప్రసిద్ధి.

స్వామిని నేను అప్పట్లో ఒకటే కోరుకున్నాను. స్వామి… ప్రజల కోసం బలంగా పనిచేసే శక్తినివ్వు అని కోరాను. ఆ కోరికను స్వామి 14 ఏళ్ల తర్వాత తీర్చారు. ఎంతో శక్తివంతమైన స్వామి కొలువుదీరిన ప్రాంతంగా ఉన్న ఈ క్షేత్రం సమగ్ర అభివృద్ధి కోసం దృష్టి పెడతాను. ఈ క్షేత్ర మహిమ, ప్రాధాన్యం గురించి ప్రచారం కల్పించడమే కాకుండా ఆలయానికి ఉన్న 50 ఎకరాల భూ వివాదాన్ని పరిష్కరించేలా అధికారులతో మాట్లాడుతాం. దేవాదాయశాఖకు ఆలయ భూమి తిరిగి వస్తే, ఇక్కడ భక్తులకు అవసరం అయ్యే కాటేజీలు, ఇతర హోటళ్ల నిర్మాణం జరుగుతుంది. దీంతో క్షేత్రానికి భక్తుల రాక పెరుగుతుంది. దానివల్ల స్థానికులకు ఉపాధి పెరుగుతుందన్నది నా ఆలోచన.

ఆలయం ఓ వైపు కొండ తవ్వేశారు

ఆలయ ప్రాకారం, గోపురం, ముఖ మండపం నిర్మాణం నిమిత్తం రూ.2.50 కోట్లు ఖర్చు అవుతుందని ఆలయ అధికారులు చెప్పారు. ఈ నిధులను అందించే ఏర్పాటు చేస్తాను. దీంతోపాటు ఆలయానికి ఓ వైపు కొండను పూర్తిగా తవ్వేశారు. దాని కోసం రక్షణ గోడను నిర్మించాలని కోరుతున్నారు. దీనికోసం మరో రూ.2 కోట్ల నిధులు అందించేలా ఏర్పాటు చేస్తాను. అయితే ఆ కొండను గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారం తవ్వేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించాను.

తవ్వింది ఎవరు..? ఎంత మేర తవ్వారు..? తవ్విన వారి వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలను పూర్తి వివరాలతో ఇవ్వాలని కోరారు. నివేదిక పరిశీలించిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తాను. ఆలయానికి వచ్చే రోడ్డును కూడా పూర్తి స్థాయిలో నిర్మించాలనేది నా కోరిక. దీనికి తగిన ప్రతిపాదనలు ఎంతైనా పంపాలని అధికారులకు చెప్పాను. అయితే ముందుగా భారీగా పడిన గోతులకు కనీసం మట్టితో పూడ్చి, రోలరు చేస్తే కాస్త అయినా ప్రయోజనం ఉంటుందని సూచించాను.

స్వామి వారి మీద ఆన

వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారి నోళ్లు ఆగడం లేదు. వారికి అవి కూడా రాకుండా భవిష్యత్తులో చేస్తే తప్ప వారు మళ్లీ మారరు. నన్ను విమర్శించే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. నేను త్రికరణ శుద్ధిగా ప్రజల కోసం పని చేస్తున్నాను. నన్ను ఏ కారణం లేకుండా తిట్టేవారికి, నన్ను అకారణంగా నోటికొచ్చినట్లు విమర్శించే వారికి చెప్పేదొక్కటే.

స్వామి వారి మీద ఆన… నేను మిమ్మల్ని చూసుకుంటాను. నాకు సద్విమర్శలు అంటే ఇష్టం. ఓ వ్యక్తి మీద చేసే విమర్శ – హుందాగా స్వీకరించేంత గొప్పగా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు మాత్రం నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నారు. వాళ్లకు నోళ్లు బాగా ఎక్కువయ్యాయి.
మాది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు.. ఎక్కువతక్కువ మాట్లాడితే తొక్కి పట్టి నార తీస్తాం జాగ్రత్త. నేను ముందుగా చెప్పినట్లుగా మీకు యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం.. గొడవ కావాలంటే గొడవే ఇస్తాం. అయితే ఆ గొడవ అభివృద్ధికి ముందడుగు కావాలి.. ఆ యుద్ధం రాష్ట్ర క్షేమం కోసం కావాలన్నదే నా అభిమతం.

ఆడబిడ్డల రక్షణే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. నేను అధికారులతో మాట్లాడినపుడు కూడా ఇదే చెప్పాను. ముఖ్యంగా విద్యార్థినుల సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని, అక్కడ వారి భద్రత ముఖ్యమని చెప్పాను. హాస్టళ్లలోని పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోరాను. అలాగే హాస్టళ్లలో ఉండే విద్యార్థినుల భద్రత చాలా ముఖ్యం. ఏదో ఉద్యోగం చేస్తున్నాం… అలా వారికి తిండి పడేశాం… మన బాధ్యత అయిపోయిందని అధికారులు భావిస్తే ఊరుకునేది లేదు. ఆడబిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేను ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని బాలికల వసతిగృహాలకు వసతులు కల్పించాను. ఆడబిడ్డల మాన, ప్రాణ విషయంలో తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

వాళ్ళది ఖర్మ పోరాటం

ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆడబిడ్డల మీద దారుణాలపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సాంకేతికత పెరుగుతోంది కానీ… దానికి తగినట్లుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని తప్పులు చేస్తున్న వారికి తగిన శిక్షలు పెరగాలి.

త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాబోతోంది. అయితే దానికంటే ముందే తగిన కఠిన శిక్షలు పడాలన్నది నా ఆకాంక్ష. ఎవరు తప్పు చేసినా ఊరుకోవద్దు. ప్రతి నేరం రికార్డు అవ్వాలి. అలాంటి వారికి తగిన శిక్ష పడాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం. అలాకాదు.. తప్పు చేసినా మా వాళ్లను ఏ అనకూడదు అని వైసీపీ వాళ్లు పోరాటాలు చేస్తాం.. రాస్తారోకోలు చేస్తాం అంటే ఊరుకోబోం.

మేం గతంలో మీ రౌడీ రాజ్యం మీద మేం చేసింది ధర్మపోరాటం.. ఇప్పుడు మీది ఖర్మపోరాటం. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. మేం ఆడబిడ్డల రక్షణ కోసం బలంగా నిలబడతాం. గత ప్రభుత్వ పాలకుడి సొంత చెల్లెలు ఆయన నుంచి రక్షణ కోరుతున్నారు. ఓ మహిళగా, ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆమె తన భద్రతపై ప్రభుత్వానికి తగిన అర్జి పెట్టుకుంటే, దానికి అనుగుణంగా ఆమె రక్షణను కల్పించే బాధ్యతను మేం తీసుకుంటాం.

దేశ సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నేవారిపై జాగ్రత్త

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో దేశంలో అస్థిరత్వం నెలకొల్పేందుకు కొన్ని శక్తులు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు. కేవలం సరిహద్దు ప్రాంతంలోనే కాకుండా అలాంటి తీవ్రవాద ఆలోచనలతో జాతి సమగ్రతను దెబ్బ తీసేందుకు మనలోనే కొందరు జాతి, మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై ప్రతి భారతీయుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులు మనలో మనకే గొడవలు పెట్టి వాటిని పెద్దవి చేసి దేశాన్ని ప్రపంచ దేశాల ముందు చులకన చేయడానికి కుట్ర పన్నుతున్నారు.

దేశ సమగ్రత దెబ్బ తీయడానికి చూసే కుట్రలను ప్రజలు గమనించాలి. ప్రజలు చైతన్యవంతం కావాలి. దేశ భద్రత కోసం, సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లం. రాష్ట్రంలోనూ వైసీపీ- మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని పన్నాగం పన్నుతోంది. ఇలాంటి చర్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాను. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టేవాళ్లం. ఒళ్లు దగ్గర పెట్టుకోండి. వైసీపీ రాష్ట్రంలో కల్చరల్ వార్ (ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి సాంస్కృతిక యుద్ధాలు) తీసుకురావాలని చూస్తోంది. మేం మీ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉంటాం. మా రెప్పపాటులో మీరు తప్పు చేయొచ్చు. కానీ తర్వాత చాలా వేగంగా దాన్ని సరిదిద్దుతాం. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

 మీరూ ఈవీఎంలతోనే గెలిచారనేది గుర్తుంచుకోండి

ఈవీఎంలు మోసం చేశాయని ఇప్పుడు వైసీపీ మద్దతుదారులు ఓదార్పులు చేసుకుంటున్నారు. 151 సీట్లు వచ్చినపుడు ఇదే ఈవీఎంలు పని చేశానయనేది గుర్తుంచుకోండి. ఒకవేళ ఈవీఎంలే తప్పు అయితే ప్రధాని మోదీ 372 సీట్లు పైబడి గెలవాలి కదా..? మీకు మంచి జరిగితే అంతా బాగున్నట్లు… చెడు జరిగితే అంతా మోసం అనే భావన నుంచి వైసీపీ బయటకు రావాలి. 2019లో ఓడిపోయినపుడు కూడా చాలామంది మా పార్టీ నాయకులు ఈవీఎంలలో ఏదో జరిగిందని చెబితే నేను కొట్టి పారేశాను. ప్రజలు మనల్ని నమ్మలేదు అని చెప్పాను. వైసీపీ విషయంలోనూ అదే జరిగింది. ప్రజలను హింసించిన పాపానికి వారు ఇచ్చిన తీర్పును మీరు నమ్మని పరిస్థితి మీ నైజాన్ని బయటపెడుతుంది. పద్యాలు, పాటలు రాసినా ప్రయోజనం ఉండదు.

అధికారులు తీరు మార్చుకోవాలి

రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు కూడా తీరు మార్చుకోవాలి. మీకు వైసీపీ హయాంలో హనీమూన్ కాలం అయిపోయింది. ప్రజల కోసం నీతిగా, నిజాయతీగా పనిచేయాలనే కూటమి ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు మీరు పనిచేయండి. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఇప్పుడు ధర్మబద్ధంగా పనిచేయాలని కోరుతున్నాం. ఇది కొందరికి నచ్చడం లేదు.

పోలీసు వ్యవస్థలో పై అధికారుల నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు ఇంకా పాత ప్రభుత్వ విధానంలోనే కొనసాగుతున్నామనే భ్రమ నుంచి బయటకు రండి. చాలామంది అధికారులు వైసీపీ నాయకులు పెద్ద తప్పులు చేసినా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం ఎంతటి అధికారిపైన అయినా కఠిన చర్యలు తప్పవు. అధికారులు తీరు మార్చుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది.

పార్టీలో నూతనంగా ‘నారసింహా వారాహి గణం’ ప్రత్యేక విభాగం

నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నా మతాన్ని ఆరాధిస్తాను. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడితే దాని గురించి కొందరు విమర్శిస్తారు. నేను సచ్చీలంగా నమ్మే ధర్మానికి తప్పు జరిగితే మాట్లాడటం కూడా తప్పు అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆలయాలకు వెళ్లే సమయంలో, దర్శన సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. దీనిపై రాష్ట్రంలోని అన్ని ఆలయ అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఆలయాలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలి. అలాగే చెప్పులు వేసుకొని ఆలయాల్లో తిరగడం మానుకోవాలి. నేను నమ్మే ధర్మం పట్ల నిర్భయంగా మాట్లాడతాను. దానికి విఘాతం కలిగితే స్పందించడం కనీస ధర్మం. దీనికి కొందరు నన్ము హిందూవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రతి మతాన్ని ప్రేమిస్తాను. నా దగ్గర ఉన్న సిబ్బంది కూడా అన్ని మతాలకు సంబంధించిన వారే.

బంగ్లాదేశ్ లో హిందువులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఉండలేం. అక్కడి హిందువుల ఊచకోతకు గురవుతున్నా స్పందించవద్దు అంటే ఎలా..? దీనిపై సగటు హిందువులకు చైతన్యం రావాలి.. ప్రతి హిందువూ సనాతన ధర్మానికి విఘాతం కలిగితే స్పందించాల్సిన బాధ్యత ఉంది. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఇష్టానుసారం సోషల్ మీడియాలో మాట్లాడే వారిపైనా తగిన చర్యలు ఉంటాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక విభాగంగా సనాతన ధర్మ పరిరక్షణ విభాగం ఏర్పుటు చేస్తున్నాను. ఈ విభాగానికి ‘నారసింహ వారాహి గణం’గా నామకరణం చేస్తున్నాను. ఈ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాలని శ్రీ లక్ష్మినరసింహుడి పాదల చెంత నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు.

సభలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, చిర్రి బాలరాజు, బొమ్మిడి నాయకర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, పౌర సరఫరా సంస్థ ఎండీ మంజీర్ జిలానీ సమన్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జడ్పీ ఛైర్మన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జేసీ ధాత్రిరెడ్డి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE