Suryaa.co.in

Telangana

విద్య, వైద్యను పక్కనపెట్టి మద్యంవైపు పరుగులు తీస్తున్న తెరాస సర్కార్

– బంగారు తెలంగాణ చేస్తానని మద్యం తెలంగాణగా మార్చిన కేసీఆర్
– మద్యం దుకాణాలు పెంచడంతో పాటు అక్రమ బెల్ట్ షాపులు నడుపుతున్న ప్రభుత్వం
– మద్యం ఆదాయం పై ఉన్న శ్రద్ధ ప్రజల మానప్రాణాల మీద లేకపోవడం బాధాకరం
– తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చుతున్న కేసీఆర్ సర్కార్
– అధికారికంగా స్పెషల్ డ్రైవ్ లు పెట్టి మద్యం విక్రయాలు పెంచాలనడం సిగ్గుచేటు
– బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఘాటు విమర్శలు
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల చిన్నచూపు చూస్తూ, వాటిని నిర్లక్ష్యం చేస్తూ మద్యం వైపు పరుగులు తీస్తున్నదని, దానికి నిదర్శనమే మళ్ళీ అదనంగా 350 మద్యం దుకాణాలు పెంచడమని, అలాగే దీనికి తోడుగా రాష్ట్రంలో విచ్చలవిడి బెల్ట్ షాపుల నిర్వహణ కారణమని, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని మద్యం తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో సుమారు కోటి డెబ్భై లక్షల కుటుంబాలు ఉండగా ప్రతి ఏడాది అయిదు కోట్ల మద్యం పెట్టెలు, అనగా (ఒక పెట్టెలో 12 మద్యం బాటిల్స్) అమ్ముడుపోతున్నాయని, దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న 2,216 మద్యం దుకాణాలే కాకుండా ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపులను కూడా నిర్వహిస్తూ అక్రమ పద్దతిలో ఆదాయం పెంచుకుంటున్నదని, దీనికి తోడు కేసీఆర్ సర్కార్ మళ్ళీ కొత్తగా 350 మద్యం దుకాణాలు పెంచాలని నిర్ణయించడం చూస్తుంటే తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చి వారి ఆలోచన శక్తిని నాశనం చేస్తూ, కుటుంబాలు సైతం రోడ్డున పడే విధంగా తెరాస సర్కార్ వ్యవహరిస్తోందని మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభత్వం వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తూ పేద ప్రజలను విస్మరిస్తూ ప్రతి మండలానికో 100 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు పెట్టాలనే ఆలోచన చేయకుండా మద్యం దుకాణాలు పెంచాలని ఆలోచన చేయడం సిగ్గుచేటని, అలాగే ప్రతి మండలానికి ఇంటర్మీడియట్ కాలేజీలు, వృత్తివిద్య కోర్సులతో కూడిన ఐ.టి.ఐ లాంటి కొత్త కోర్సుల కాలేజీలు పెట్టకుండా, అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని విస్మరిస్తూ ఉన్న పాఠశాలలను మూసివేస్తూ, మద్యం దుకాణాలను మాత్రం పెంచి పోషిస్తూ ప్రజలను మద్యం మత్తులో ముంచి వారిలో నేరప్రవృత్తి పెంచే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు.
మద్యం మత్తులో తెలంగాణలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరుగుతున్నాయని, ముఖ్యంగా మద్యానికి బానిసలుగా మారినవారు వావివరసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారని, అలాగే మద్యం మత్తులో పసిపాపల నుండి పండు ముసలి వరకు అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారని బేతి మహేందర్ రెడ్డి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. విపరీత మద్యం ఏరులై పారడంతో యువత చెడిపోతున్నారని, అలాగే మద్యం మత్తులో సంఘవిద్రోహా శక్తులకు పాల్పడుతూ చెడు మార్గాలను ఎంచుకోవడమే కాకుండా అనేక హింసాత్మక ఘటనలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, దీనికి నిదర్శనమే దిశ లాంటి సంఘటనలని, తెరాస ప్రభుత్వం మద్యం నియంత్రణకు తిలోదకాలు ఇచ్చి మధ్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుందని మహేందర్ రెడ్డి విమర్శించారు.
విపరీత మద్యం అమ్మకాలతో సకల రుగ్మతలకు కారణమని, మద్యం ఆదాయం పై శ్రద్ధ తెలంగాణ ప్రజల మానప్రాణాల మీద లేకపోవడం సిగ్గుచేటని, ఇదే కాకుండా ఇంకా మద్యం అమ్మకాలు పెంచేందుకు కేసీఆర్ స్పెషల్ డ్రైవ్ లు పెట్టాలని ఆదేశించడం సిగ్గుమాలిన చర్యని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో మద్యం పై యుద్ధం చేసేందుకు, మద్యం నిషేధమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, కార్యక్రమాలు చేపడుతుందని తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ప్రజలకు మద్యంతో ఎదురయ్యే సమస్యల పై, నేరాల పై, ఘోరాల పై అవగాహన కల్పిస్తూ వారి మానప్రాణాలను కాపాడుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE