టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న చింతమనేని పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారట. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… గత కొన్ని రోజులుగా పటాన్‌చెరులోనే మకాం వేసిన చింతమనేని జోరుగా కోడి పందేలను నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు 100 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రూ.10 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.