Suryaa.co.in

Telangana

ఆమరణ నిరాహార దీక్షకు పన్నేండేళ్లు

Deeksha Divas : కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా 2021, నవంబర్ 29వ తేదీ సోమవారంతో పన్నేండేళ్లు పూర్తయ్యాయి. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించి ఈ దీక్షను ప్రారంభించారు కేసీఆర్‌. ఆయన వేసిన తొలి అడుగే మలి దశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను నిలిపివేస్తున్నట్లు డిసెంబర్ 23న ప్రకటించింది. దాంతో తెలంగాణ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. అన్ని వర్గాల ప్రజలంతా ఏక తాటిమీదకొచ్చి కేసీఆర్‌కు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనకు జై కొట్టారు.
సిద్దిపేటను కార్యక్షేత్రంగా ఎన్నుకుని పోరాటాన్ని ప్రారంభించారు కేసీఆర్‌. 2009 నవంబర్ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాదివాస్ కోసం కరీంనగర్‌ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో ఆయన ఖమ్మం జైలులోనే తన దీక్షను ప్రారంభించారు. నిరహార దీక్ష ప్రారంభించిన తర్వాత..ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. నేను లేకున్నా..సరే ఉద్యమం నడవాలని డిసెంబర్ 01వ తేదీన కేసీఆర్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 02వ తేదీన పార్లమెంట్ లో కేసీఆర్ చేపట్టిన దీక్షను ప్రస్తావించారు బీజేపీ సీనియర్ నేత అద్వానీ.
ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 04వ తేదీన తెలంగాణ వస్తే జైత్ర యాత్ర .. లేకుంటే తన శవ యాత్ర అన్న కేసీఆర్.. పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ సాధన కోసం దీక్ష చేశారు. ఎంతమంది దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినా ససేమిరా అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్‌ 9న రాష్ట్ర ప్రకటన చేసింది. దీంతో ఆమరణ నిరాహార దీక్షను విరమించారు కేసీఆర్‌ గారు.చావు అంచుల వద్దకు వెళ్లి వచ్చి 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేశారు.

LEAVE A RESPONSE