Suryaa.co.in

Telangana

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామన్న కేంద్రమంత్రి

🔸విద్యార్థుల సమస్యను మంత్రి మాన్సుఖ్ మాండవీయ దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్
🔸తమను ప్రమోట్ చేయాలంటూ ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు వేడుకోలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ కు లేఖ రాశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఆదుకోవాలంటూ సెప్టెంబర్ 9న బండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు కేంద్రమంత్రి స్పందించారు.
కరోనా వేళ పాఠ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో ఫస్ట్ ఇయర్ లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యామని, తమను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయకపోతే తమ విద్యా సంవత్సరం వృథా అవుతుందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులు, వారి తల్లితండ్రులు బండి సంజయ్ కుమార్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ వల్ల ప్రత్యక్ష బోధన కాకుండా ఆన్ లైన్ లో నిర్వహించిన క్లాసుల వల్ల ఆయా అంశాలను పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోలేకపోయామని, అదేవిధంగా ల్యాబ్ లు మూతబడడం వల్ల ప్రయోగాలు నిర్వహించలేకపోయామని, దీనికి మానసిక ఒత్తిడి కూడా తోడవడంతో సబ్జెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయామని విద్యార్థులు తెలిపారు. ఈ కారణంగానే తాము ఫెయిలయ్యామని గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అవకాశం కల్పిస్తే ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు కొనసాగనుండడంతో ఫెయిలయిన మొదటి సంవత్సరం సబ్జెక్టులను 2వ సంవత్సరంలో క్లియర్ చేసుకుంటామని అన్నారు.
విద్యార్థుల గోడును సహృదయంతో అర్థం చేసుకున్న బండి సంజయ్ కుమార్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో చదువుతూ ఫెయిలయిన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయకు సెప్టెంబర్ 9న లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE