-రాయలసీమ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం లో జరిగిన అడ్డగోలు నియామకాలు
-రీసెర్చు స్కాలర్ల వైవాకు మోక్షంలేదు
-గత సంవత్సరం జరిపిన పరీక్షల ఫలితాలు ఇంతవరకు విడుదల కాలేదు
-విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు
-అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు
అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారాలనుండి తప్పుకోవడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు రెక్టార్లు చివరికి ఉప కులపతులు, అధికార యంత్రాంగం యూనివర్సిటీలను వదిలి వెళ్లడం జరిగింది. గతంలో వీరు రిజిస్ట్రార్, రెక్టార్, విసి , డైరెక్టర్లు కావాలంటే స్థానికంగా ఉన్న మంత్రుల కాళ్ళు పట్టుకుని అంతో ఇంతో సమర్పించుకుని వచ్చి, అడ్డగోలు నియామకాలు చేపట్టి అనతికాలంలో లక్షలు గడించి కోట్లకు కోట్లు బిల్లులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు.
ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో, ఎదో సంక్షోభం / ఉపద్రవం ముంచుకొచ్చినట్లు రిజిస్ట్రార్లు, రెక్టార్లు, విసిలు విధులకు దూరంగా ఉండడం లేకపోతే ఆరోగ్య కారణాలవల్ల విధులకు రాజీనామా చేయడం , కేసులనుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాదాపు 6 గురు రిజిస్ట్రార్లు మరియు 4 రెక్టార్లు ఉన్నారు. వీరు నిర్వహించిన ఇంటర్వ్యూలు అన్ని, అడ్డగోలు నియామకాలు వాటిపై చర్యలు అన్ని ప్రశ్నర్థకంగా మారాయి.
2017, 2018 లలో జరిగిన రాయలసీమ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం లో జరిగిన అడ్డగోలు నియామకాల్లో పోస్టులు పొందిన వారిని తొలగించమని హై కోర్టు తెలిపింది. వీరినందరిని ఈ వారం విధుల నుండి తొలగించారు. ఈ నియామకాలు చేసిన ఉపకులపతులు రిజిస్ట్రార్ల పై చర్యలకు ఉపక్రమించాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి.
ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం రీసెర్చు స్కాలర్లు సమర్పించిన థీసిస్ గ్రంథాలకు చెదలు పట్టింది కానీ వారి వైవాకు మోక్షంలేదు. గత సంవత్సరం జరిపిన పరీక్షల ఫలితాలు ఇంతవరకు విడుదల కాలేదు. రౌతు మెత్తగుంటే గుఱ్ఱం మూడు కాళ్లతో పరుగెత్తిందంట అన్న చందంగా మారింది
విశ్వవిద్యాలయాల పరిస్థితి. కొత్త కోర్సులకు , కొత్త కళాశాలలకు అఫిలియేషన్ కు మోక్షం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. ఈ విద్యాసంవత్సరంలో చాల విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాలు మూసివేయక తప్పదు. ఉన్న సీనియర్ అధ్యాపకులు రిటైర్ కావడం, గత దశాబ్ద కాలం నుండి నియామకాలు లేకపోవడం, దశాబ్ద కాలం కిందట చేరినవారిని ఇంతవరకు రెగ్యూలరైజ్ చేయకపోవడం సమస్యగా మారింది.
కొత్త నియామకాలు చేపట్టక ,రీసెర్చు ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంగ్లీషు, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ , ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సెరికల్చర్, తెలుగు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ మూతపడ్డాయి. ఇక సీనియర్ ప్రొఫెసర్లు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ లేదు, సెమినార్ గ్రాంటు లేదు, నూతన ఆవిష్కరణలు పేటంట్ల అంతకంటే లేవు. వీరు రిటైర్ అయిన రోజు ఏదో మొక్కుబడిగా ఒక కార్యక్రమం జరిపి భోజనాలు చేసి వెళుతుంటారు.
విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు లేవు అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీ లు మూతపడి దశాబ్దం అవుతుంది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవెలప్మెంట్ కోర్సులు అన్నీ అనీత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడించరు, పిహెచ్డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వితంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది.
ఉర్దూ, కేంద్ర విశ్వవిద్యాలయాలు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలైన నిధుల లేమితో ఎప్పుడూ స్మశాన ప్రశాంతత నెలకొంటున్నాయి. విద్యలో నాణ్యత ఉండాలని క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీలు ద్వారా కో ఆర్డినేటర్ల ను నియమించి ఉన్న కొద్ది మంది అధ్యాపకులతో కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఏర్పాటు చేసి అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు.
కొత్త కోర్సులు బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు, బోధనా నైపుణ్యాలు మెరుగుపడాలంటే బోధకులకు కొత్త అంశాల పట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్ దొరకడం లేదు.
అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలలో బోధన చప్పగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయకపోతే రెండు మూడు సంవత్సరాలలో శాశ్వితంగా కనుమరుగవుతాయి.