Suryaa.co.in

Telangana

విద్యార్థి కేంద్రంగా యూనివ‌ర్సిటీలు ప‌ని చేయాలి

* మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
* అవ‌స‌ర‌మైన నిధులు… భ‌వ‌నాలు… నియామ‌కాలపై నివేదిక అంద‌జేయండి
* వైస్ ఛాన్స‌ల‌ర్ల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లోని విశ్వ విద్యాల‌యాల‌న్నీ విద్యార్థుల కేంద్రంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాల‌ని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం సూచించారు. విశ్వ విద్యాల‌యాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ విశ్వ విద్యాల‌యాల‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమ‌త లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వ‌స్తున్నార‌ని.. వారికి స‌రైన భ‌విష్య‌త్ క‌ల్పించేలా మ‌న బోధ‌న ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక స్థోమ‌త ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన వారు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల‌ను ఎంచుకొని ప్రైవేటు విశ్వ విద్యాల‌యాల వైపు వెళ్లిపోతున్నార‌ని.. వారితో ఎదుర‌య్యే పోటీని ప్ర‌భుత్వ విశ్వ విద్యాల‌యాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సుల‌నే మ‌నం బోధించాల్సి ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తంలో నియ‌మించిన ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెస‌ర్లు ఉన్నార‌నే భావ‌న‌తో ప‌లు విశ్వ విద్యాల‌యాల్లో పెద్ద‌గా ప్రాధాన్యం లేని కోర్సుల‌ను బోధిస్తున్నార‌ని, వాటిని ర‌ద్దు చేసి నూత‌న కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని సూచించారు. ఆయా కోర్సుల‌కు సంబంధించి ఉన్న ప్రొఫెస‌ర్ల‌కు అడ్మినిస్ట్రేటివ్ బాధ్య‌తలు అప్ప‌గించాల‌ని సీఎం పేర్కొన్నారు. కొంద‌రు ప్రొఫెస‌ర్ల‌కు రిహాబిలిటేష‌న్ సెంట‌ర్లుగా యూనివ‌ర్సిటీల‌ను మార్చొద్ద‌ని సీఎం సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్స‌ల‌ర్లు త‌మ విశ్వ విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్ల కొర‌త‌, భ‌వ‌నాలు, ఇత‌ర వ‌స‌తుల స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చారు. యూనివ‌ర్సిటీల బాగుకు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం తెలిపారు. యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్స‌ల‌ర్లు అంతా స‌మావేశ‌మై త‌మ ఉమ్మ‌డి స‌మ‌స్య‌లు, అలాగే యూనివ‌ర్సిటీల వారీగా స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావుతో స‌మావేశం కావాల‌ని సీఎం సూచించారు.

అనంత‌రం యూనివ‌ర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై నివేదిక రూపొందించి ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని సీఎం సూచించారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కేశ‌వ‌రావు, శ్రీ‌నివాస‌రాజు, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ ఏ.శ్రీ‌దేవ‌సేన‌, ప్రాథ‌మిక విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌ర‌సింహారెడ్డి, విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి, స‌భ్యులు ప్రొఫెస‌ర్ పి.ఎల్‌.విశ్వేశ్వ‌ర‌రావు, చార‌కొండ వెంక‌టేష్‌, జ్యోత్స్న శివారెడ్డి, యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్స‌ల‌ర్లు ప్రొఫెస‌ర్ కుమార్ మొలుగారం, ప్రొఫెస‌ర్ కె.ప‌త్రాప్ రెడ్డి, డాక్ట‌ర్ టి.యాద‌గిరిరావు, ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌, ప్రొ.జి.ఎన్‌.శ్రీ‌నివాస్‌, ప్రొ.ఉమేష్ కుమార్‌, ప్రొ.సూర్య ధ‌నంజ‌య్‌, ప్రొ.కిష‌న్ కుమార్ రెడ్డి, ప్రొ.టి.గంగాధ‌ర్‌, ప్రొ. ఏ.గోవ‌ర్ధ‌న్‌, ప్రొ.వి.నిత్యానంద‌రావు, ప్రొ.ఘంటా చ‌క్ర‌పాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE