Suryaa.co.in

Features

వీరుడు నిజముగ.. రారాజు ఇజముగ

నిజాముల మెడలు వంచి
నిజముగ హైదరాబాదును
ఆదరాబాదరాగా కాకుండ
ఆరాముగ స్వాధీనం
చేసుకున్న ధీరుడతడు..
మా జోలికొస్తే వేలాది హిందువుల శవాలను
తొక్కి రావాలన్న సవాలును
హుందాగా స్వీకరించి..
మీరు గోతులు తీస్తే
సర్కారు చేతులు ముడుచుకు కూర్చుంటుందా అంటూ మెత్తగా
పదునైన కత్తులను
దింపిన రాజనీతిజ్ఞుడతడు..!

తమ చిత్తం వచ్చినట్టు నడిచే
సంస్థానాలను గుత్తంగా..
ఏక మొత్తంగా
సర్కారు పెత్తనంలోకి తెచ్చిన
మేరునగధీరుడతడు..
నెహ్రూ అంతటి ప్రధానినే
నిదానంగా ఎదిరించి
నవాబులకు జవాబులు
చెప్పిన ఘనాపాటి అతడు..
ఏళ్లుగా పరాయిపాలనలో మగ్గిన భరతభూమి
ప్రజాస్వామ్య
దేశమైనాక కూడా
ఇంకా సంస్థానాలు
తమ స్వస్థానాలే అని మీసాలు మెలేసిన ఎందరో
ప్రభువుల విభవములకు
కలం పోటుతో కాలం తీర్చి
ఇదిగో..ఇపుడిక్కడున్నది
మీ భృత్యుడు కాదని
తేల్చి చెప్పిన ఆమాత్యుడతడు!

దొరల పాలననే కాదు
మన ఏలుబడి
మొదలైనాక కూడా
అదే కాక..
తేడా చేస్తే పొలికేక..
గుండె గుభేల్ మనిపించే పటేల్
పోరాటాలే ఆయన టేల్..
స్వరాజ్య సంగ్రామంలో మంత్రాంగం..
స్వపరిపాలన వచ్చాక రాజ్యాంగం…
పటేల్ లేనిదెక్కడ…
సర్దారు గర్జన
వినిపించనిదెపుడు!?

నేటి రాజకీయాల్లో
మడమ తిప్పని వీరులెందరో..
కుహానా జమానా..
నిజాములనే కాదన్న
వీరుడు నిజముగ..
రాజులనే త్రోసిరాజన్న
రారాజు ఇజముగ..
అంతర్గత వ్యవహారాలు
ధైర్యంగా చక్కబెట్టిన అంతరంగం తనదైన
ఉత్తుంగ తరంగం..
స్వేచ్ఛా విహంగం..!
భరతదేశ తొలి ఉపప్రధాని..
తలవంచని విధాని..
నమ్మిన సిద్ధాంతం కోసం రాద్ధాంతానికైనా వెనకాడక..
ధీటుగా సమాధానం చెప్పి
ఎంతటివారైనా గాని
సమాధానపరచే అవధాని..!

విదేశీ వస్త్రాలు విసర్జించి
తెల్లని లాల్చీ..పంచె..
ఆపై రంగు కోటు..
దానిపై కండువా..
గుండె నిండా తెగువ..
నిండైన విగ్రహం..
నిగ్రహం కోల్పోని ఆగ్రహం..
అంతే హుందాగా నర్మద తీరంలో విగ్రహం..
ఐక్యతా ప్రతిమ..
ఆ మహనీయుడిని అక్కడలా చూస్తే
తెల్లదొరల గుండెల్లో
ఇప్పటికీ కలగదా దిగ్భ్రమ!!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE