ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని (పీడీఎఫ్)ను మల్లిఖార్జునరావు గారు ఈ రోజే పంపారు. చదవడం మొదలు పెట్టి, రెండు పేజీలు చదవగానే స్పందించాలనిపించింది. ఒక జాతీయ పార్టీ, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంత నిర్లజ్జగా అక్షర రూపంలో అబద్ధాలు చెప్పడం అత్యంత గర్హనీయం.
1. ఉపోద్ఘాతానికి శీర్షిక: “మోసపూరిత ప్రచారాన్ని తిప్పికొడదాం”
నా స్పందన: నిజమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపి మోసపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
2. “రాష్ట్ర విభజనానంతరం అయిదేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు రాజధానిని కూడా పూర్తి చేయలేని స్థితిలో నిలిచారు. తర్వాత ఏలుబడిలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ సారథి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మళ్ళీ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టారు”.
నా ప్రశ్న: కాసేపు నిజమనే అంగీకరిద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అమరావతికి శంకుస్థాపన చేసింది భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే కదా? కేంద్ర ప్రభుత్వ ఖజానా నుండి రు.1500 కోట్లు ఇచ్చారు కదా? అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా గుర్తించారు కదా? కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తోనే కదా హైకోర్టు అమరావతిలో నెలకొల్పబడింది? రాజ్ భవన్ ఎక్కడుంది? రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుండి జరుగుతున్నది? శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇవన్నీ మిథ్యా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అంశంపై అనుసరించిన అప్రజాస్వామిక విధానంపై మోడీ గారి ప్రభుత్వం ఎందుకు గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించింది?
3. “పోలవరం వంటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సహాయం అందించింది”.
నా ప్రశ్న: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో కదా! పొందు పరచింది. కేంద్ర జలశక్తి, సాంకేతిక సలహా మండలి ఆమోదించిన డిపిఆర్ -2 అంచనా వ్యయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎందుకు ఆమోదించలేదో చెప్పండి?
4. “పోలవరం సాగునీటి ప్రాజెక్టును నాటి ఏలికలు, నేటి పాలకులు కూడా ఒక ఏటీఎంలా చూస్తున్నారు”.
నా ప్రశ్న: పోలవరం జాతీయ ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాల పర్యవేక్షణ, నియంత్రణ చేసే బాధ్యతను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. మరి, ఒక ఏజెన్సీగా నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు ప్రాజెక్టును ఏటీఎంగా చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు?
5. శీర్షిక(2): “కేంద్రం తెచ్చిన విభజన చట్టం.. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తోంది”.
నా స్పందన: ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారాయా! లేదా! భవిష్యత్తు ప్రశ్నార్థమయ్యిందో ప్రజలే చెప్పాలి!
6. “యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. పార్లమెంటు తలుపులు మూసేసి, సెషన్స్ లైవ్ కవరేజీని నిలుపుదల చేసి మరీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును కేంద్రం పాస్ చేయించుకుంది”.
నా స్పందన: నిజమే. అయితే, అప్పుడు బిజెపి ఏం చేసింది? లోక్ సభలో ఆ పార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్ మరియు ఇతర నాయకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారా?
7. “ప్రత్యేక హోదా అంశాన్ని నాటి ప్రభుత్వం దాన్ని నోటిమాటగా అంగీకరించినట్టు చెప్పింది తప్ప చట్టంలో పొందుపర్చలేదు”.
నా ప్రశ్న: అది “ప్రత్యేక హోదా” కాదు, ప్రత్యేక తరగతి హోదా. వాటి రెండింటి మధ్య “నక్కకు నాగలోకానికి” ఉన్నంత తేడా ఉన్నది. ప్రత్యేక హోదాను జమ్మూ & కాశ్మీర్ కు రాజ్యాంగబద్ధంగా కల్పించబడింది. దాన్ని మోడీ ప్రభుత్వం తొలగించిందన్న విషయం అందరికీ విధితమే. ప్రత్యేక తరగతి హోదాను ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని నాటి ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా వ్రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. మేం అడిగాం, ఆయన ఇచ్చారని, రాజ్యసభలో నాటి బిజెపి నాయకులు చెప్పుకొన్నారు కదా! మరి, చట్టంలో పెట్టమని అప్పుడు ఎందుకు అడగలేదో!
వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకం, కడప ఉక్కు కర్మాగారం, దుర్గరాజపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు మరియు రాయితీలు, వగైరా చట్టంలోనే పొందుపరిచారు కదా! వాటిని ఎందుకు అమలు చేయలేదు? చట్టంలోని షెడ్యూల్ 9 & 10 ప్రకారం ఉమ్మడి ఆస్తుల పంపకం ఎంత వరకు వచ్చింది?
8. “విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసింది”.
నా స్పందన: వామ్మో! ఇంత అబద్దమా! విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎక్కడుందో కాస్త ఫోటోలు తీసి పెట్టండి.
9. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా రూపుదిద్దింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే.
నా స్పందన: శభాష్! ఎన్ని దేశాల నుండి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలకు విమానాల రాకపోకలు సాగుతున్నాయో సెలవివ్వండి. సంతోషిస్తాం!