కడపలో టిడిపిలోకి మళ్లీ రానున్న పలువురు కీలక నేతలు

-మాజీ ఎమ్మెల్సీ సతీష్ కోసం బీటెక్ రవి రాయబారం

కడప జిల్లాలో పలువురు మాజీ నేతలు టిడిపి లోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎం.వి.మైసూరా రెడ్డి వీరశివారెడ్డి, వరదరాజులరెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డిలు ఉన్నట్లు సమాచారం.

మాజీ శాసన మండలి వైస్ చైర్మన్, టిడిపి మాజీ నేత సతీష్ రెడ్డినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ అధిష్టానం సూచన మేరకు పులివెందుల పార్టీ ఇంచార్జి బీటెక్ రవి బుధవారం పులివెందుల కు చెందిన టిడిపి నేతలను రాయబారులుగా పంపి చర్చించినట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బీటెక్ రవి సూచన మేరకు పులివెందులకు చెందిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి రెడ్డి, సీనియర్ నాయకులు తొండూరు శివ మోహన్ రెడ్డి, బాలస్వామి రెడ్డి , టూ గుట్ల సిద్ధారెడ్డి తదితరులతో కూడిన బృందం వేంపల్లి లోని సతీష్ రెడ్డి స్వగృహంలో బుధవారం సుదీర్ఘంగా చర్చించారు.

అలాగే నియోజకవర్గంలోని సతీష్ రెడ్డి అనుచరులు అభిమానులు కూడా వేంపల్లె కు తరలి వచ్చి మీరు పార్టీలోకి రావాలంటూ ఆయనను గట్టిగా కోరారు. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత సతీష్ రెడ్డి ఏ నిర్ణయం ప్రకటించ లేదు . ఇక మీడియాలో అయితే సతీష్ వర్సెస్ బీటెక్ రవి అంటూ పెద్ద ఎత్తున సంచలన వార్తలు వెలువడ్డాయి. టిడిపిని సతీష్ రెడ్డివీడిన తరువాత తన పనులు తాను చేసుకుపోతున్నారు. తన అనుచరులు, అభిమానులతో మాత్రం నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి పార్టీలోకి వస్తారని వార్తలు సంచలనం సృష్టించాయి. బుధవారం పులివెందుల టిడిపి నాయకులు పార్థసారధి రెడ్డి , శివ మోహన్ రెడ్డి, బాలస్వామి రెడ్డి , షబ్బీర్ లు తదితరులు ప్రయత్నం చేశారు.కానీ పార్టీలోకి వచ్చేందుకు సతీష్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

విలేకరులు అడిగిన కూడా ఆయన సమాధానాన్ని దాటవేశారు. మరోవైపు సతీష్ రెడ్డితో చర్చించిన పులివెందల నేతలు మాత్రం ఆయన సానుకూలతను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కడప లో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులను తప్పకుండా ఆహ్వానిస్తామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కూడా పార్టీ లోకి వస్తారా అని చర్చ కూడా సాగుతోంది. మరోవైపు జిల్లాలోని డి ఎల్ రవీంద్రనాథ్రెడ్డి, వీరశివారెడ్డి, మైసూరారెడ్డి, వరదరాజులరెడ్డి,కడప దుర్గా ప్రసాద్ ఇతర నేతలు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.