Suryaa.co.in

Devotional

ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు…

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది…నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం..అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది….

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు…దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.
ప్రకృతి పరంగా చూసినట్లైతే…ఈ సమయంలో వర్షం కురుస్తుంది…రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు…దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది…
అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి…హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు…
-పంచమి
-దండనాథా
-సంకేతా
-సమయేశ్వరి
-సమయ సంకేతా
-వారాహి
-పోత్రిణి
-వార్తాళి
-శివా
-ఆజ్ఞా చక్రేశ్వరి
-అరిఘ్ని
దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం

ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ…..
సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు…!
నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై8th తారీకు తో ముగుస్తున్నాయి..
శ్రీ మాత్రే నమః…

తంజావూరు ఆలయంలోని వారాహి అమ్మవారు….వారాహి దేవి ఎవరు ?
మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది.

వరాహుని స్త్రీతత్వం
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

సైన్యాధ్యక్షురాలు
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ… తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..
సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది.

వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.

LEAVE A RESPONSE