– నర్సాపురం సీటుపై తల పట్టుకుంటున్న బీజేపీ-టీడీపీ నేతలు
– వైసీపీని ఎదుర్కొనే స్ధాయి వర్మకేదీ?
– రఘురామకృష్ణంరాజుతో వర్మకు పోలికేమిటి?
– వర్మను మేం మోయలేమంటున్న టీడీపీ అభ్యర్ధులు
– మార్చమంటున్న బీజేపీ-టీడీపీ నేతలు
– ఆయన ఇమేజ్, నిధులతో గెలవచ్చనుకున్న అభ్యర్ధులు
– సీనియర్ అయినప్పటికీ వర్మ పోటీలో తట్టుకుంటారా?
– గతంలో అసెంబ్లీ అభ్యర్ధులకంటే ఎక్కువ ఓట్లు సాధించిన రాజు
– రాజు సానుభూతితో డిపాజిట్లు కూడా కష్టమేనంటున్న కమలదళం
– వైసీపీకి సమర్పించేందుకే నర్సాపురం తీసుకుంటున్నారంటున్న బీజేపీ నేతలు
– బీజేపీకి నర్సాపురం నెత్తినొప్పి
(మార్తి సుబ్రహ్మణ్యం)
సుఖంగా-సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో గతుకులు వచ్చి, బతుకు గ ల్లంతయితే ఎలా ఉంటుంది? కరెంటు ప్లగ్గులో వేలుపెడితే ఉంటుంది? అచ్చం నర్సాపురంలో కూటమి పరిస్థితిలా ఉంటుంది. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూటమి నుంచి సీటు వస్తుందని, చాలామంది అంచనా వేశారు.
జగన్ సర్కారు కేసులు- నిర్బంధాలతో నియోజకవర్గానికి రాలేని పరిస్థితులున్నా… ప్రతిరోజూ ప్రజాసమస్యలు, జగన్ సర్కారు కుంభకోణాలపై రచ్చబండ పెట్టి చాకిరేవు పెడుతున్న రఘురామరాజుకు.. నర్సాపురం ఒక్కటే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లలో అధికశాతం మందిని ఆయన రచ్చబండ దగ్గరికి చేసిందన్నది నిష్ఠుర నిజం. విదేశాలకు వెళ్లినా ఆయనతోసెల్ఫీల పోటీలు. ఇది అందరూ చూస్తున్నదే.
సహజంగా ఒక వ్యక్తికి మితిమీరిన ఇమేజ్- చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంటే ఆ వ్యక్తి కొందరికి సహజంగానే శత్రువవుతారు. అలాంటి వ్యక్తులను అభిమానించి, ప్రోత్సహించేవారు సైతం.. వారిని తమ పక్కన ఉంచుకోవడానికి సిద్ధపడరు. కారణం తమ క ంటే ఎక్కువ ఇమేజ్ ఉండటమే. తమ కంటే ఎక్కువ తెలివి ఉన్న వారినెవరూ పక్కన పెట్టుకోరు. తమ మాట వినేవారినే కోరుకుంటారు. ఇది సైకాలజీ మాత్రమే కాదు ప్రముఖులకు వర్తించే సూత్రం. రఘురామకృష్ణంరాజు విషయంలో సరిగ్గా జరిగింది ఇదే.
కూటమి ఏర్పాటు, జగన్ సర్కారుపై ప్రాణాలకు తెగించి పోరాడిన ఆయన వెన్ను దట్టిన కూటమి..ఇప్పుడు ఆయనను సొంతం చేసుకునేందుకు, మొహమాటపడటమే విషాదం. బహుశా ఎంపి రాజు ఇమేజ్ పెరిగిపోవటం కూడా ఆయనకు టికెట్ దక్కకపోవడానికి మరో కారణం కావచ్చంటున్నారు. అయితే ఆ ఇమేజీతో కూటమిని గెలిపించుకోవచ్చన్న ఆలోచన కంటే.. తమ కంటే ఎక్కువ పెరుగుతారన్న ఆందోళన కూడా రఘురామరాజుకు కూటమిలో టికెట్ దక్కకపోవడానికి ఒక కారణమయి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్ధి అవుతారనుకున్న రఘురామకృష్ణంరాజు స్ధానంలో.. ఎవరూ అంచనా వేయని శ్రీనివాసవర్మ తెరపైకి రావటం, టీడీపీ-బీజేపీ వర్గాలకు షాక్ ఇచ్చింది. సొంత పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం షాక్ నుంచి, బీజేపీ-టీడీపీ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. టికెట్ ప్రకటించే ముందు, కనీసం తమ అభిప్రాయాలను కూడా తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అభ్యర్ధి శ్రీనివాసవర్మ వివాదరహితుడు, తొలి నుంచీ పార్టీలో ఉన్న నాయకుడైనప్పటికీ… వైసీపీని అంగ-అర్ధబలాల్లో ఏమాత్రం ఎదుర్కోలేని అభ్యర్ధి అని, బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పైగా వర్మకు స్థానికంగా పెద్దగా బలంలేదని, ఈ విషయంలో రఘురామరాజుకు- శ్రీనివాసవర్మకు ఏమాత్రం పోలికలేదంటున్నారు. మాజీ అధ్యక్షుడు, ఇద్దరు సంఘ్ నేతల సిఫార్సు, జగన్ తెరవెనుక కృషి ఫలితంగా సీటు వచ్చిందన్న ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లింది. ప్రధానంగా రఘురామకృష్ణంరాజుకు సీటు రాకుండా జగన్ అడ్డుపడి, తమ పార్టీలోని కొందరు సీనియర్లను మేనేజ్ చేశారన్న అపనింద.. కూటమికి అప్రతిష్ఠ అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రధానంగా.. రఘురామకృష్ణంరాజుకు కాకుండా శ్రీనివాసవర్మకు సీటివ్వడాన్ని, టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులు జీర్ణించుకోలేపోతున్నారు. సహజంగా ఎంపీ అభ్యర్ధి ఎమ్మెల్యే అభ్యర్ధులను చూసుకుంటారని, కానీ తాము మాత్రం అందుకు భిన్నంగా ఎంపీ అభ్యర్ధిని మోయాల్సిన, దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడిందని అసెంబ్లీ అభ్యర్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. వర్మ పేరుకు పార్లమెంటు నియోజకవర్గ పరిథిలో తమ కార్యకర్తలకు తప్ప, సాధారణ ప్రజలకు తెలియకపోవడం వల్ల, ఎక్కువ సమస్యలు తాము ఎదుర్కోక తప్పదంటున్నారు.
నిజానికి రఘురామరాజుకు ఎంపీ సీటు ఇస్తే.. ఆయన ఇమేజ్ తమకు కలసివస్తుందని ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆశపడ్డారు. ఆయనకు ఉన్న ఇమేజ్‌తో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని అంచనా వేశారు. గత ఎన్నికల్లో ఎంపీ రాజుకు, అసెంబ్లీ అభ్యర్ధుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా రాజు ఎంపి అభ్యర్ధి అయితే ఆర్ధికంగా నిధుల సమస్య కూడా ఉండదని భావించారు.
ఇప్పుడు ఎంపీ అభ్యర్ధి వర్మ ఖర్చు కూడా, అసెంబ్లీల వారీగా తామే భరించడం కష్టమని తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని వారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్ధిగా వర్మ కొనసాగితే, ఆ ప్రభావం తమపైన పడుతున్నందువల్ల.. ఆయనను మార్చాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అటు బీజేపీ శ్రేణులు సైతం వర్మను మార్చాలని, పైనుంచి టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఆయనకు తాము పనిచే యలేమని వారు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. టికెట్ ఇవ్వని రాజుకు పోగైన సానుభూతితో తమకు ధరావతు దక్కడం కూడా కష్టమేనంటున్నారు. వైసీపీకి కట్టబెట్టడానికే నర్పాపురం సీటు బీజేపీ తీసుకుందన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది.