వసంత ‘కమ్మ’టి విలాపం!

– కమ్మకులానికి మొండిచేయిపై వసంత నాగేశ్వరరావు కలత
– కమ్మవారికి జగన్ అన్యాయంపై ‘వసంత విలాపం’
– ‘అధికార వియోగం’పై వసంత నాగేశ్వరరావు ఆందోళన
– జగన్ సర్కారు నిరాదరణపై ఆవేదన
– వసంత ఆవేదన కొడుకు కృష్ణప్రసాద్ కోసమా? కమ్మ వారికోసమా?
– వసంత వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఆగ్రహం
– ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్వాగతించలేదా?
– తండ్రి ఒకదారి, కొడుకుది మరొక దారా?
– తండ్రి విమర్శలను కృష్ణప్రసాద్ ఖండించరా?
– జగ్గయ్యపేటలో గెలిచింది వైసీపీనే కదా?
– కాపు ఎమ్మెల్యే అయితే కమ్మవర్గం గుర్తించదా?
– కమ్మ వనభోజనాల్లో ఎందుకు? ప్రెస్‌మీట్‌లోనే చెప్పవచ్చు కదా?
– కృష్ణప్రసాద్ కమ్మ ఓట్లతోనే గెలవలేదు
– వసంత వ్యాఖ్యలపై కస్సుమంటున్న వైసీపీ నేతలు
– అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కమ్మ వారు ఎక్కడున్నా కమ్మవారే. ఏ పార్టీలో ఉన్నా వారి మానసిక పరిస్థితి, రాజకీయభావన ఒకటే. ఏ పార్టీ అయినా అధికారం తమదే ఉండాలన్న కాంక్ష. అది టీడీపీనా? కాంగ్రెసా? వైసీపీనా? జనసేనా అన్నది అనవసరం. కావలసింది అధికారం. కానీ ఆంధ్రాలో ఇప్పుడది రివర్సయింది. మూడేళ్ల క్రితం వరకూ సాగిన కమ్మ హవాకు జగన్ రాకతో బ్రేకులు పడ్డాయి. ఇప్పుడయితే అసలు వారి ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. వైసీపీ తమను అన్యాయం చేస్తోందన్న ఆక్రోశమే కమ్మవర్గంలో ప్రతిధ్వనిస్తోంది. ప్రస్తుత మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి, ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన ‘వసంత’ విలాపం వింటే ఆ భావన నిజమేననిపిస్తుంది.

వసంత నాగేశ్వరరావు.. ఈ పేరు కృష్ణా జిల్లా వారికి తప్ప, ఈతరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ హయాంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు. కమ్మ కులంలో పెద్దమనిషి లెక్క అన్నట్టు. బాబు జమానా రాగానే, వసంత తెరమరుగయ్యారు. ఆయన కొడుకు వసంత కృష్ణప్రసాద్ గతంలో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాతనే వైసీపీలో చేరి మైలవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి, దేవినేని ఉమపై గెలిచారు. అప్పటినుంచీ ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు రాజకీయాల్లో ఉండీ లేనట్లున్నారు.

అలాంటి వసంతకు హటాత్తుగా జగన్ సర్కారుపై కోపమొచ్చింది. కమ్మవారికి జరుగుతున్న అన్యాయంపై టన్నుల కొద్దీ ఆవేదన వెల్లువెత్తింది. ఏపీలో కమ్మవారికి అన్యాయం జరుగుతోందని, ఆయన దాదాపు విలపించినంత పనిచేశారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ కమ్మవారిని, పువ్వుల్లోపెట్టి చూసుకుంటున్నారని తెగ పొగిడేయటం వైసీపీ కార్యకర్తలకు రుచించడం లేదు.

అసలు ఇంతకూ వసంతకు ఎందుకు కోపం వచ్చిందంటే… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి, దానికి వైఎస్ పేరు తగిలించినందుకట. అన్నగారి పేరు మారిస్తే స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీలం, కాసు, వైఎస్ పేర్లతో అనేకం ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా వాటి పేర్లు మార్చలేదని వసంత గుర్తు చేశారు.

రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గంపై దాడి చేస్తున్నా, సాటి కులస్తులు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని వసంత వాపోయారు. కమ్మ ఓటర్లు అత్యధిక శాతం మంది ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో, ఇతర కులాల పల్లకీని ఎంతకాలం మోస్తారని వసంత వీరావేశంగా ప్రశ్నించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన కమ్మ కులస్తుల వనభోజనాల్లో, వసంత చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

vasantha-krishna-prasadమైలవరం నియోజకవర్గంలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీద, వసంత కొడుకు కృష్ణప్రసాద్ గెలిచారంటే, అది ఒక్క కమ్మ కులస్తుల వల్ల కాదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కమ్మ కులస్తుల కంటే బీసీ, ఎస్సీలు ఓటేయడం వల్లనే.. వసంత కృష్ణప్రసాద్ గెలిచారని గుర్తుపెట్టుకోవాలని, వైసీపీ లోని ఓ వర్గం స్పష్టం చే స్తోంది. గత ఎన్నికల్లో కమ్మ కులస్తులు దేవినేని ఉమకు ఓటు వేస్తే, మిగిలిన వారు వైసీపీ అభ్యర్ధి కృష్ణప్రసాద్‌ను గెలిపించారని వాదిస్తున్నారు.

వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు, టీడీపీ-వైసీపీని అభిమానించే కమ్మవారిని ఆనందపరుస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మవారి ఉనికి లేకుండా పోయిందని, తాము తృతీయ శ్రేణి పౌరులుగా జీవించాల్సి వస్తోందన్న ఆవేదన, వసంత తన వ్యాఖ్యలతో వ్యక్తీకరించారంటున్నారు. తాము వైసీపీలో పనిచేస్తున్నప్పటికీ.. రెడ్డి వర్గం నేతలు తమను నమ్మడం లేదని, అనుమానంతో చూస్తున్నారంటున్నారు.

వసంత వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని వైసీపీలోని కమ్మ వర్గం నేతలు అంగీకరిస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడే ఆయన స్పందించకుండా, కమ్మ కుల వనభోజనాల్లో ఎందుకు ప్రస్తావించారో తమకు అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ హామీలిచ్చి వైసీపీలోకి తీసుకువచ్చిన తమను, తర్వాత పట్టించుకోవడం మానేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో బిల్లులు ఇప్పిస్తామన్న హామీ ఇచ్చి.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను, వైసీపీలో చేర్పించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పుడు అసలు కమ్మవారంటే నే, వైసీపీ ఎమ్మెల్యేలు దూరం పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి.. వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై, కృష్ణా జిల్లా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ పాలన పోయి, కులాభిమానంతో టీడీపీ ప్రభుత్వం రావాలని ఆయన కోరుకుంటున్నట్లు, స్పష్టంగా కనిపిస్తోందని విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చినప్పుడు మౌనంగా ఉన్న వసంత, ఇప్పుడు దానిని విమర్శించడం, జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టడమేనంటున్నారు. అసలు వసంత ఆవేదన కొడుకు కృష్ణప్రసాద్‌కు మంత్రి పదవి ఇవ్వనందుకా? లేక ఎన్టీఆర్ పేరు మార్చినందుకా? అని మైలవరంలో వసంతను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

జగ్గయ్యపేటలో కాపు వర్గానికి చెందిన సామినేని ఉదయభాను వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఆ నియోజకవర్గంలో కమ్మ వారు ఎమ్మెల్యే కావడం లేదన్న వసంత వ్యాఖ్యలు, పార్టీ వర్గాలకుudayabhanu తప్పుడు సంకేతాలు పంపిస్తాయంటున్నారు. అవి కాపులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలో కాపులతో సహా, మిగిలిన ఏ కులాలూ ఎమ్మెల్యేగా పనికిరాన్నట్లు వసంత వ్యాఖ్యలున్నాయని విశ్లేషిస్తున్నారు.

తండ్రి వసంత వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించి ఖండించాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ కృష్ణప్రసాద్ తన తండ్రి వ్యాఖ్యలు ఖండించకపోతే, తండ్రి విమర్శలను సమర్థిస్తున్నట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వసంత వ్యాఖ్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళామని చెబుతున్నారు.

Leave a Reply