ఏపీలో మాత్రం 50 శాతం రిజర్వేషన్ అమలు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ విషయంలో పార్లమెంట్లో బిల్లు అమలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది, కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంపై చట్టం చేయడం జరిగింది అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
జాతీయ పోషకాహార మిషన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తొలుత కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను వాసిరెడ్డి పద్మ సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మహిళల భద్రత, హక్కుల విషయంలో మనసా వాచా కర్మణా పూర్తి నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మరియు పోషకాహార లోపాలను అధిగమించేందుకు అవగాహన కోసమే ఈ పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం యొక్క లక్ష్యం అన్నారు.
కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు మరియు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు రక్తహీనత, పోషకాహార లోపం నివారణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి గర్భిణీలకు పోషకాహారం అందించడం, అంగన్వాడి పిల్లలకు మంచి ఆహారం అందజేయడం, పోషకాహారం ఎలా తీసుకోవాలని అంశాలను మహిళలకు తెలియజేయడం జరుగుతుందన్నారు.
అందరికీ ఆరోగ్యం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అదే విధంగా ఈనెల 30వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు.
కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు రుక్యా బేగం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ క్రిస్టినా, రిసోర్స్ పర్సన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ కే.వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్ డాక్టర్ పద్మలత, నాగార్జున యూనివర్సిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ శాంతి శ్రీ తదితరులు ప్రసంగించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఒంగోల్ ఆర్జెడి వసంత బాల, మహిళా కమిషన్ సెక్రటరీ దాసరి శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ ఉద్యోగులు, గుంటూరు పిడి మనోరంజని, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.