కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు: ఉపరాష్ట్రపతి

– స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాకరణ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన సూచించారు. టీకా తీసుకోవడం ద్వారా ఒకవేళ కరోనా సోకినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తప్పుతుందన్న నిపుణుల సూచనలను, పలు అధ్యయనాల నివేదికలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత టీకాకరణ శిబిరాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ కేంద్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు) ఏక కాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు ప్రాంగణాల్లో కలుపుకుని దాదాపు 5వేల మందికి టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాతో సాగుతున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని చేపడుతోందని, దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ప్రజాప్రతినిధులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరూ టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహల్ని పోగొట్టేందుకు, టీకాకరణ ప్రక్రియ సక్రమంగా సాగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పత్రికలు కూడా ఈ విషయంలో తమ పాత్రను సమర్థవంతంగా పాటించాలన్నారు.
ఆగస్టు నెలలో 50శాతం మంది భారతీయులకు టీకాలు వేయడం పూర్తవడం సంపూర్ణ టీకాకరణ కార్యక్రమంలో భాగంగా భారతదేశం సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ భారతదేశం ఆత్మనిర్భరతను చాటుకుంటూ టీకాల తయారీ, ఉచితంగా ప్రజలకు టీకాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.
‘వసుధైవ కుటుంబకం’ విధానం స్ఫూర్తితో విదేశాలకు సైతం మన టీకాలు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే విధంగా వివిధ రంగాల్లో ఆత్మనిర్భరతను కనబరుస్తూ, దేశం మరింత ప్రగతి సాధించే ప్రయత్నంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
విశ్వమానవాళిపై కరోనా చూపించిన ప్రతికూల ప్రభావాన్ని, వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులను గుర్తుచేస్తూ, ఈ అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా స్ఫూర్తితో పనిచేస్తున్నాయన్న ఆయన, అందరూ కలిసి ముందుకు సాగితేనే సత్ఫలితాలను సాధించగలమన్నారు.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు పంచసూత్రాలను సూచించిన ఉపరాష్ట్రపతి, శారీరక శ్రమను, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఇందుకోసం యోగను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. భారతీయ ఆహారపు అలవాట్లను మళ్లీ వినియోగంలోకి తెస్తూ జంక్‌ఫుడ్ ను త్యజించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ప్రభుత్వాలు, నిపుణులు సూచించినట్లుగా మాస్కులు ధరించడం, సురక్షిత దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాలన్న ఉపరాష్ట్రపతి, వీటన్నింటితోపాటు ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఉచిత కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహకులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన భారత్ బయోటెక్, ముప్పవరపు ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ (హైదరాబాద్), సింహపురి వైద్య సేవాసమితి (జయభారత్ హాస్పిటల్స్–నెల్లూరు), పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్స్ (విజయవాడ) వారిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. గతంలో భారతదేశంలో టీకాలను దిగుమతి చేసుకోవడం ద్వారా ఎక్కువగా ఖర్చుచేయాల్సి వచ్చేదని, కానీ దేశీయంగా టీకాలను రూపొందించుకుని ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతోపాటు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో టీకాలు అందించేందుకు వీలుంటుందన్నారు. హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాలనుంచి కూడా కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీని ద్వారా మరింత వేగంగా దేశ ప్రజలకు టీకాలు అందించేందుకు వీలుపడుతుందన్నారు. జాతీయ టీకాకరణ కార్యక్రమంలో భాగంగా, తమతోపాటు మరో స్వదేశీ కంపెనీ టీకాలను ఉత్పత్తి చేయడం, తద్వారా దేశానికి పేరు తీసుకొచ్చే మహత్కార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్భ ద్రారెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ఎన్ ముకేశ్ కుమార్ పాల్గొనగా.. స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరు చాప్టర్ నుంచి సర్వేపల్లి శాసనసభ్యుడు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు (గ్రామీణం) శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్, సింహపురి వైద్య సేవా సమితి నిర్వాహకులు నాగారెడ్డి హరికుమార్ రెడ్డితోపాటు.. విజయవాడ చాప్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ మోహన్, స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ సెక్రటరీ చుక్కపల్లి ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ గ్రంధి విశ్వనాథ్ తదితరులతోపాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మెడిసిటీ ఆసుపత్రి (హైదరాబాద్), జయభారత్ ఆసుపత్రి (నెల్లూరు), పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల (విజయవాడ) ప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply