పూర్తి సామర్ధ్యం దిశగా విశాఖ ఉక్కు

Spread the love

బొగ్గు, ఖనిజం లోటు లేకుండా చర్యలు…
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 13: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఎదుర్కొంటున్న కోకింగ్‌ కోల్‌, ఐరన్‌ ఓర్‌ కొరత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. భారీ పెట్టుబడులతో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్‌ టన్నుల నుంచి 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరిస్తే ప్రస్తుతం అందులో మూడింట ఒకటో వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయం వాస్తవమేనా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అది వాస్తవం కాదని చెప్పారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ను అధునీకరించి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినప్పటికీ సమగ్ర ఉక్కు ఉత్పాదన సామర్ధ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించలేదని మంత్రి తెలిపారు. అలాగే తీరప్రాంతంలో ఉన్నందున వాతావరణంలోని ఉప్పు సాంద్రత కారణంగా స్టీల్‌ ప్లాంట్‌లోని భారీ పరికరాలకు తుప్పు పట్టే అవకాశం లేదా అన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ను తీరప్రాంతంలో నెలకొల్పుతున్నందున ఎక్విప్‌మెంట్‌ సమకూర్చుకునే దశలోనే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి సామర్ధ్యం మేరకు స్టీల్‌ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పాదన జరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల గురించి మంత్రి ఈ విధంగా వివరించారు.

1). వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు నిరాటంకంగా కోకింగ్‌ కోల్‌ సరఫరా చేసే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం.
2). వైజాగ్‌ స్టీల్‌ కోసం ఒక ఇనుప ఖనిజం బ్లాక్‌ను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా ఒడిషా ప్రభుత్వాన్ని కోరడం జరగింది.
3). ఇనుప ఖనిజ నిక్షేపాలను తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్‌ చేయవలసిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయమంటూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఇప్పటికే ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను కోరింది.
4). స్టీల్‌ ప్లాంట్‌ వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాల కోసం సులభతరమైన వడ్డీతో రుణాల మంజూరు కోసం వైజాగ్‌ స్టీల్‌ యాజమాన్యం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుతోంది.
5). వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఎదుర్కొంటున్న పలు ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో 211 సీఎన్‌జి స్టేషన్లు
న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 2030 నాటికి 211 సీఎన్‌జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటకు అర్హత పొందిన అధీకృత సంస్థలు ఈ ఏడాది జనవరి 31 నాటికి ఉత్తరాంధ్రలో 13 సీఎన్‌జి స్టేషన్లను నెలకొల్పాయని తెలిపారు. పైప్‌ ద్వారా గ్యాస్ కనెక్షన్లు, సీఎన్‌జి స్టేషన్ల ఏర్పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ (సిజిడి) నెట్‌వర్క్‌ అభివృద్దిలో భాగం. ఈ పనులను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పర్యవేక్షణలో అది ఆమోదించిన అధీకృత సంస్థలు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. 11-ఏ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ పూర్తయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ అంతటా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కు అనుమతించనున్నట్లు మంత్రి తెలిపారు.

విశిష్ట పరిశోధనా కేంద్రంగా విశాఖ ఐఐపీఈ
న్యూఢిల్లీ: చమురు, సహజవాయవుల రంగానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై విశిష్ట పరిశోధనలు చేస్తూ, పెట్రోలియం, ఇంధన రంగాలలో సుశిక్షితులైన మానవ వనరులును అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా విశాఖపట్నంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ లక్ష్యంతోనే రాజీవ్ ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంస్థకు అనుబంధంగా రెండు కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో రెండు సెంటర్లను విస్తరించినట్లు తెలిపారు. చమురు, సహజవాయువు రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా చమురు, సహజవాయువు రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం ముంబైలో విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంధన పరిశ్రమను ఏకీకృత లక్ష్యం వైపు నడిపించడం, కాంప్లెక్స్ ఎనర్జీ, పర్యావరణ అంశాలకు సంబంధించి అనువైన పరిష్కారాల మార్గాలు అభివృద్ధి చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, టెక్నాలజీకి సంబంధించి కొత్త హద్దులు అన్వేషించడం లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply