ఎంపీ విజయసాయిరెడ్డి
అక్టోబర్ 2: రానున్న రోజుల్లో విశాఖపట్నం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుందని, వచ్చే ఐదేళ్లలో విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ప్రముఖ ఐటీ సంస్థ పల్సస్ గ్రూపు సర్వే నివేదికలో వెల్లడయ్యిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు. విశాఖలో ఒక్క ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే 50 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పించే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించిందని అన్నారు.
రెండెకరాల ఆసామికి హెరిటేజ్ ఎలా వచ్చిందో ప్రజలకు తెలుసు
రెండెకరాల ఆసామి చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ ఎలా స్థాపించారో ప్రజలందరికీ తెలుసని విజయసాయి రెడ్డి అన్నారు. మా కంపెనీలో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి. అవినీతికి పాల్పడే కర్మ మాకేమిటి’ అని చంద్రబాబు ఇప్పుడు చెబితే నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరని అన్నారు. మ్యానిపులేట్ స్కిల్స్ కు పెట్టింది పేరైన చంద్రబాబు తన మనుషులను వ్యవస్థల్లోకి జొరబెట్టింది ప్రజా సేవ కోసమే అని చెప్పుకుంటారని అన్నారు.
ఎల్లో మీడియా ఫోటో షూట్ల కోసం కంచాలు పగలగొట్టడం, పుష్టిగా భోంచేసి దీక్షలు చేయడం వెగటుగా ఉందని అన్నారు. ‘బల్లి శాస్త్రం’ ప్రకారం ముందుగా చంద్రబాబుకు దోష పరిహారం చేయించండం ఉత్తమమని సూచించారు. రౌడీయిజం చూపిస్తా, ఉరికిస్తా అంటూ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడటం’ కర్మఫలమేనని అన్నారు.
ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ గా ‘హృదయాలయం’కు గుర్తింపు
చిన్నారులకు పునర్జన్మనిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నిరుపేదల పాలిట దేవాలయమని అటువంటి దేవాలయం ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ గా తమిళనాడు గవర్నర్ చేతులు మీదుగా అవార్డు అందుకోవడం మిక్కిలి సంతోషకరమని అన్నారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అని అన్నారు.