బీజేపీలో ‘విష్ణు’ చక్రం!

– వైసీపీ అక్రమార్కులపై కత్తిదూసిన రాజు
– ఏపీలో ఐటీ, ఈడీ దాడులేవని నిలదీసిన బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు
– ఏపీలో సీబీఐ, ఈడీ , ఐటీదాడులు ఎందుకు జరగడం లేదని నిలదీసిన వైనం
– మద్యం క్యాష్‌ అమ్మకాల అక్రమాలపై ఆగ్రహం
– ఎన్నికల్లో మద్యం సొమ్ముతోనే గెలిచేందుకు ప్రయత్నాలంటూ ఆరోపణ
– వైసీపీ నేతల వద్ద బ్లాక్‌మనీ పోగయిందన్న విష్ణుకుమార్‌రాజు
– అరాచకాలు అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టీకరణ
– పరోక్షంగా కేంద్ర మెతక వైఖరిని ప్రశ్నించిన విష్ణుకుమార్‌రాజు
– వైసీపీకి బీజేపీ మద్దతునిస్తుందని చెప్పకనే చెప్పిన బీజేపీ సీనియర్‌ నేత
– విష్ణు వ్యాఖ్యలపై ‘కమలం’లో కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ-వైసీపీ ఒకే తాను ముక్కలా? కేంద్రంతో రాష్ట్ర బంధం ఫెవికాల్‌ అంత బలంగా ఉందా? వైసీపీని కేంద్రం చూసీచూడనట్లు వదిలేస్తోందా? తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలపై ఐటి, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్న కేంద్రం.. ఏపీలో వైసీపీని ఎందుకు వదిలేసింది? బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై చేసే పోరాటం, గర్జింపులన్నీ ఉత్తుత్తిదేనా?.. ఇవన్నీ ఇప్పటివరకూ మీడియాలో వార్తలు ఫాలో అయ్యే వారికి, రాజకీయవర్గాలకు తెలిసిన వారి మదిలో మెదిలే ప్రశ్నలు, పార్టీపరంగా బీజేపీలోని ఒక వర్గంలో జరుగుతున్న చర్చ మాత్రమే. కానీ.. ఆ పార్టీ సీనియర్‌ నేత విష్ణుకుమార్‌రాజు సంధించిన అస్త్రం మాత్రం.. బీజేపీ-వైసీపీ హమ్‌సబ్‌ ఏక్‌హై నిజమేనన్న సంకేతం వెళ్లింది.

‘ఏపీలో అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే. వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్‌మనీ ఉంది. దేశంలో ఎక్కడా లేని నల్లధనం ఏపీలోనే ఉంది. క్యాష్‌ ద్వారా వైసీపీ నేతలు బ్లాక్‌మనీ సంపాదించారు. ఆ డబ్బుతో రేపటి ఎన్నికల్లో నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏపీ అరాచకాలపై కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందే’
– ఈ ప్రకటన ఏ టీడీపీ నాయకుడో, ఏ కాంగ్రెస్‌ నాయకుడిదో అనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఇది ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన సంచలన వ్యాఖ్య.

రాష్ట్రంలో వైసీపీ నేతల వద్ద వేల కోట్ల రూపాయల బ్లాక్‌ మనీ ఉందని వెల్లడించిన రాజు.. ఆదాయపను-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌, సీబీఐ విశ్వసనీయతకు కొత్త సవాల్‌ విసిరటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఈ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడిన దాఖలాలు లేవు. పలు రంగాల్లో ఎంత అవినీతి జరుగుతోందో ఆరోపిస్తున్న టీడీపీ.. ఇప్పటివరకూ వైసీపీ నేతల వద్ద ఉన్న బ్లాక్‌మనీ గురించి ఏనాడూ ఆరోపించిన దాఖలాలు లేవు. క్యాష్‌ ద్వారా చేస్తున్న లిక్కర్‌ అమ్మకాలతో వైసీపీ అగ్రనేతలు వేల కోట్లు సంపాదిస్తున్నారని.. గతంలో టీడీపీ నేతలు, ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. కానీ ఈ స్థాయిలో బ్లాక్‌మనీ పోగైన విషయాన్ని, ఆ డబ్బుతోనే నియోజకవర్గానికి 40 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విషయాన్ని బీజేపీ వెలుగులోకి తీసుకురావడం సంచలనం సృష్టించింది.

దానికిమించి.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఏపీలో వైసీపీ నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదంటూ విష్ణుకుమార్‌రాజు వేసిన ప్రశ్న.. అటు సొంత పార్టీ, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇది బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న తెరచాటు బంధాన్ని బట్టబయలు చేసేదేనన్న వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీ సర్కారుపై.. తమకు మించి ఆరోపణలు కురిపిస్తున్న విష్ణు తీరుపై, అటు టీడీపీ కూడా విస్తుపోతోంది. ప్రధానంగా వైసీపీ నేతలపై ఇప్పటివరకూ ఐటీ,ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదన్న విష్ణుకుమార్‌రాజు సంధించిన అస్త్రం.. అటు తిరిగి ఇటు తిరిగి. నేరుగా బీజేపీ నాయకత్వానికే తగిలినట్టయింది.

వైసీపీతో సత్సంబంధాలు ఉన్నందుకే, వైసీపీని కేంద్రం పట్టించుకోవడం లేదన్న ప్రచారం, ఇప్పటిదాకా బీజేపీ వర్గాల్లో వినిపించేది. ఆ కోణంలోనే వైసీపీ సర్కారుపై పిడుగులు కురిపిస్తున్న కన్నా లక్ష్మీనారాయణను, అధ్యక్ష పదవి నుంచి వ్యూహాత్మకంగా తొలగించారన్న వ్యాఖ్యలు, ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

వైసీపీ సర్కారుకు ఇబ్బంది కలిగించకూడదన్న లక్ష్యంతోనే, వీర్రాజును అధ్యక్షుడిగా తీసుకువచ్చారన్న వ్యాఖ్యలు కూడా తరచూ వినిపించేవే. రాష్ట్రంలో టీడీపీని నిర్వీర్యం చేసిన తర్వాత, ఆ స్థానం తాను ఆక్రమించాలన్నదే బీజేపీ అసలు లక్ష్యం. ఆ వ్యూహంలో భాగంగానే.. తమ పార్టీ వైసీపీని ప్రోత్సహిస్తోందన్నది బహిరంగ రహస్యమేనని. బీజేపీ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తుంటారు.

ఈ క్రమంలో.. కేవలం తమ పార్టీ వర్గాల్లోనే చర్చగా ఉన్న అంశాన్ని, విష్ణుకుమార్‌రాజు బహిరంగం చేయడం, బీజేపీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. ప్రధానంగా తెలంగాణలో ఈడీ, సీబీఐ, ఐటి వరస పెట్టి చేస్తున్న దాడుల సమయంలో… విష్ణుకుమార్‌ రాజు సంధించిన ప్రశ్న, నేరుగా బీజేపీ నాయకత్వానికే తగిలినట్టయింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులపై దాడులు చేస్తున్న సీబీఐ-ఈడీ-ఐటీ అధికారులు, ఏపీలో వైసీపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదన్న విష్ణు ప్రశ్న.. జనంలో చర్చనీయాంశమయింది.

అయితే ఏపీలో ఆ మూడు శాఖలు, దాడుల చేయకపోవడానికి కారణం.. ఆ రెండు పార్టీల మధ్య అవగాహనేనన్న వ్యాఖ్యలు మొన్నటివరకూ వినిపించేవి. కానీ వాటిని ప్రశ్నల రూపంలో , స్వయంగా విష్ణుకుమార్‌రాజు వంటి అగ్రనాయకుడే సంధించిన నేపథ్యంలో.. ఇక తమ రెండు పార్టీల బంధం ఎంత దాచినా దాగనిదని ఓ బీజేపీ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేసే సోము వీర్రాజు.. ఇప్పటిదాకా సీబీఐ, ఈడీ,ఐటీ విచారణకు డిమాండ్‌ చేయకపోవడాన్ని బీజేపీ వర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ‘తెలంగాణలో కంటే ఇక్కడే అవినీతి దారుణంగా ఉంది. లిక్కర్‌, ఇసుక, భూ కంభకోణాల్లో కేవలం కొందరే కోట్లు సంపాదిస్తున్నారు. క్యాష్‌ ద్వారా లిక్కర్‌ అమ్మకాల అవినీతి గురించి మా నేతలు ప్రధాని, అమిత్‌షాకు ఎప్పుడో చెప్పారు. వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అయినా వాళ్లపై ఇప్పటివరకూ ఎలాంటి దాడులు జరగలేదు. కారణం మాకూ, మీడియాను ఫాలో అయ్యేవారికందరికీ తెలుసు. మా పార్టీ వైసీపీతో అంటకాగుతోంది. కాబట్టే వైసీపీ నేతలపై దాడులు జరగడం లేదన్న సంకేతాలు విష్ణు వ్యాఖ్యలతో జనంలోకి వెళ్లాయి’’ అని తూర్పు గోదావరికి చెందిన ఓ సీనియర్‌ నేత విశ్లేషించారు.

చాలాకాలం నుంచి విష్ణుకుమార్‌రాజు వైసీపీ సర్కారుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ నాయకత్వానికి మింగుడుపడకుండా ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీపై సొంత పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరిని కూడా పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా విష్ణుకుమార్‌రాజు అందరినీ తనవైపు మళ్లించుకున్నారు.