– సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన విశ్వహిందూ పరిషత్
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి, సీతారాముల వారిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ఎందుకు అంత వివక్ష అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. తరతరాలుగా వస్తున్న శతాబ్దాల సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి పాటించకపోవడం హిందువులను అవమానించడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 16 లో రాములవారికి అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్.. ఇప్పటివరకు మళ్లీ భద్రాచలం వైపు ముఖం చెప్పకపోవడం దారుణం అన్నారు.
ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి, అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ సీతారామ చంద్రుల వారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతోందని.. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011లో నిర్వహించిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం.. మళ్లీ 2023లో ఈసారి నిర్వహించారని గుర్తు చేశారు. ఇంతటి ప్రాశస్తం గల కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
17వ శతాబ్దంలో తానిషా గారు ప్రవేశపెట్టిన సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాములవారికి సమర్పించకుండా హిందూ సమాజాన్ని కెసిఆర్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. శతాబ్దాల పరంపరలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న, ఎవరు రాజుగా ఉన్న వాళ్లు అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ సంప్రదాయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు.
మరి ముఖ్యంగా ఈ పుష్కర సామ్రాజ్య మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం రాములవారిని అవమానించడమేనన్నారు. విశ్వహిందూ పరిషత్ మరియు రాముల వారి భక్తుల ఆగ్రహానికి గురికాకుండా తూతూ మంత్రంగా మార్చి 29వ తేదీన కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు. 30వ తేదీన కళ్యాణం ఉంటే 29వ తేదీన డబ్బులు వెచ్చించడం అనేది ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. కళ్యాణ మహోత్సవానికి రెండు కోట్ల 25 లక్షలు ఖర్చు అవుతాయని ఆలయ అధికారులు ఫిబ్రవరిలోనే సీఎంఓ కు విన్నవించుకున్నా పట్టించుకోలేదని.. కానీ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ మేరకు 29వ తేదీ నా కోటి రూపాయలు ప్రకటిస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.
అసలు ఆ కోటి రూపాయలు కూడా కేటాయించారా లేదా అని అనుమానం ఉందని పేర్కొన్నారు. మన ఇంట్లో రేపు పెళ్లి ఉంటే ఈరోజు వస్త్రాలు కుట్టించుకుంటామా..? అసలు కళ్యాణానికి ఒకరోజు ముందు కోటి రూపాయల ప్రకటన అనేది అవివేకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ముత్యాల తలంబ్రాలకు కూడా లక్ష రూపాయలు ఖజానా నుంచి ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి, సీతారాముల బ్రహ్మోత్సవాలకు “డబ్బులు కేటాయించారు.. దర్శనానికి రారు” అసలు రాముడంటే, హిందువులంటే ఈ ప్రభుత్వానికి లెక్కే లేదని దుయ్యబట్టారు. రంజాన్ తోఫా.. క్రిస్మస్ తోఫా అంటూ ఇతర మతస్తులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా లక్ష రూపాయలు కేటాయించలేని దౌర్భాగ్యస్థితి రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లోక కళ్యాణం కోరుకునే రాములవారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి 2017 నుంచి హాజరు కాకపోవడం సరికాదని.. కనీసం ఈసారైనా వెళ్తారేమోనని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసినా కూడా పట్టించుకోకపోవడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగమేనని వారు ఆరోపించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు భద్రాద్రి రామయ్యకు వందకోట్ల కేటాయింపు ఎప్పుడు చేస్తారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాములవారి మందిరంలో నిత్యం అయ్యే ఖర్చుల వివరాల కోసం కూడా హుండీ పై ఆధారపడే దుస్థితి ఏర్పడిందని.. ఈ సమస్యను అధిగమించి రాములవారి ఆలయ అభివృద్ధికి, సీతారాముల వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పనిగట్టుకొని హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తే విశ్వహిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని.. వచ్చే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమికి నిధులు కేటాయించకపోవడంతో దేవాలయం వాళ్లు టికెట్ల రూపంలో భక్తులపై భారం మోపి డబ్బులు పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దౌర్భాగ్యస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం హిందువులు చేసుకున్న పాపమని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు కళ్యాణానికి ఎందుకు వెళ్లలేదో చెప్పాలని.. లేదంటే హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రిని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.