Suryaa.co.in

Features

మనకు తెలిసిన వైజాగ్.. ఇప్పుడెక్కడ..!

ఎక్కడికి పోతోంది విశాఖ..
ఉదయం లేస్తే ఉలికిపాటే..
హత్యల ఊసే ఎరగని ఉత్తరాంధ్ర కేంద్రం
ఇప్పుడు వారానికో మర్డర్..
ఏడ్రోజులకో హత్య..
148 గంటలకో ఖూనీ
అన్నట్టు హింసా రాజధాని గా తయారైంది..ఇది జనం దృక్పథంలో వచ్చిన మార్పా..ప్రభుత్వాలు కల్పించిన రియల్ ఎస్టేట్ ఏమార్పా..!

ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మనం ఉన్న రోజుల్లో ఎప్పుడైనా నాటి రాజధాని భాగ్యనగరంలో
ఎక్కడో ఒక దగ్గర మతకల్లోలాల వల్లనో..ఇతర ఏ కారణాల చేతనో హత్యలు..కొట్లాటలు జరిగితే
ఇక్కడ విశాఖలో ప్రజలు భీతిల్లిపోయేవారు..
ఆ సమయంలో ఎంత పని ఉన్నా గాని హైదరాబాద్ ప్రయాణం ఉంటే రద్దు చేసుకునేవారు.

అలాగే విజయవాడ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ వంటి బెజవాడ కొన్ని సంవత్సరాలకు మునుపు రెండు వర్గాల మధ్య గొడవలతో అట్టుడికిపోయేది..ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందోనని
టెన్షనే..అటో ఊపిరి ఆగితే
ఇటో ఒక తల తెగాల్సిందే…
సరే..బెజవాడ జనాలకి ఎటూ కంటి మీద కునుకు లేకుండా ఉండేది..
ఆ వార్తలు విని విశాఖ ప్రజలు భయపడిపోయే వారు.బెజవాడ పేరు చెబితేనే అల్లాడిపోయే పరిస్థితి..!

ఇక వంగవీటి మోహన రంగా హత్యానంతరం బెజవాడలో జరిగిన అల్లర్లు..దమనకాండ గురించి పేపర్లలో చదివి ఇక్కడ విశాఖలో కూడా ప్రజలు కునుకు పట్టని రాత్రులు ఎన్నో గడిపారు.

ఇకపోతే రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలు..
కొట్లాటలు..వీటి గురించి వింటేనే విశాఖవాసులు బెంబేలెత్తిపోయేవారు.
విశాఖ అనే కాదు..ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కూడా ప్రశాంతంగా ఉండేవి..
ఈ ప్రాంతాల్లో ఎప్పుడైనా
ఒక హత్య జరిగితే జనం కొన్ని రోజుల పాటు కథలుగా చెప్పుకునేవారు.
కిడ్నాపులు..రౌడీయిజం..
తప్పుడు దందాలు
ఇక్కడ అరుదు..
రౌడీషీటర్లు..బైండోవర్ వంటి పదాలు ఎప్పుడో కాని వినిపించేవి కాదు..!

అలాంటి విశాఖ పరిస్థితి ఇప్పుడు ఎలా పరిణమించింది..
హత్యలు.. అకృత్యాలు నిత్యకృత్యాలైపోయాయి.
విశాఖ ఇప్పుడు మునుపటి ప్రశాంత..ఆహ్లాదకర నగరం కాదు…!

విశాఖ రాజధాని అయ్యేనో లేదో..
అది తర్వాతి మాట..
కాని ఉమ్మడి ఆంధ్ర రాజధాని హైదరాబాద్…ప్రస్తుత ప్రధాన కేంద్రం విజయవాడకి ఎంతమాత్రం తీసిపోని రీతిలో విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు తరచూ నెలకొంటున్నాయి.
కొన్ని వర్గాల మధ్య కక్షలు..వ్యాపార లావాదేవీల్లో తేడాలు నగరంలో తరచుగా అవాంఛనీయ సంఘటనలకు కారణం అవుతున్నాయి.
హత్యలు సాధారణం అయిపోతున్నాయి.
కిడ్నాపులు..ఘర్షణలు నిత్యకృత్యంగా మారిపోయాయి..సుపారీలు ఇచ్చి హత్యలు..కిడ్నాపులు చేయించడం కూడా పరిపాటైపోయిందని వింటున్నాం..
పోలీసు రికార్డుల్లో పరిష్కారం కాని కేసుల జాబితాలు..
అకృత్యాలకు పాల్పడే వ్యక్తుల చిట్టాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.కోర్టుల్లో కూడా క్రిమినల్ కేసుల సంఖ్య పెరిగిందని సమాచారం.

దీనికంతటికీ కారణం ఏంటి..
చెప్పుకుంటే రకరకాల వ్యవహారాలు ఉన్నా ప్రధానంగా రియల్ ఎస్టేట్ దందాలు..ప్రైవేట్ పంచాయతీలు పెరిగిపోవడం వల్లనే సుందర నగరంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం..రాజధాని ఇక్కడికే వచ్చేస్తుందనే
మాట విశాఖ..
పరసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడానికి
కారణమైంది..
అసలు ఇప్పుడు
విశాఖ వాసుల
పరిస్థితి ఎలా ఉందంటే
తమ పేర
ఖాళీస్థలం ఉంటే
అది తమకు
దక్కుతుందో లేదో
అని ఆందోళన చెందే దుస్థితి..ఖాళీ స్థలం అనేమిటి
తరతరాలుగా తమ కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు కూడా మిగిలుతుందో..లేదో తెలియని అయోమయం.
ఎప్పుడు ఎవరు ఇంటి మీద పడి ఎలాంటి దౌర్జన్యం చేస్తారో అని బిక్కుబిక్కుమనే
జీవితాలు కొందరికి అలవాటైపోయాయి.
పోలీసులు,కోర్టులు,
పెద్దమనుషులు.. ఎవరిని ఆశ్రయించినా ఫలితం పెద్దగా ఉండని దుస్థితి..ఇవే పరిస్థితులు కొనసాగితే ఇక విశాఖ ప్రజలు శాంతియుత జీవనానికి నోచుకోని రోజులు
ఎంతో దూరంలో లేవు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

LEAVE A RESPONSE