-మాస్టర్ ప్లాన్ పేరిట విజయ సాయి ముఠా వేల కోట్ల దోపిడీ
– వీఎంఆర్డీఏ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్ పూర్తిగా లోపభూయిష్టం
– ప్రతిపాదిత మార్పులను వెంటనే రద్దు చేయాలి
– జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖ: గత వైసీపీ ప్రభుత్వం విశాఖలో చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో విఎమ్ఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఒకటి. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదు…విజయసాయి మాస్టర్ స్కాం. విజయసాయి కనుసన్నలలో తయారైన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలి. విజయసాయి బృందం అవినీతి, అక్రమాలు, కబ్జాలు, బెదిరింపులు కోసమే మాస్టర్ ప్లాన్.
ఆచరణ సాధ్యం కానిదిగా…అవినీతికి చిరునామాగా మాస్టర్ ప్లాన్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్టర్ ప్లాన్ పట్ల 9,300 అభ్యంతరాలు వచ్చాయి. బీచ్ రోడ్ లో ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత, ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు అష్టవంకరలు తిరగటం వెనుక విజయసాయి రెడ్డి బృందం భూ వ్యవహారాలు ఉన్నాయి.
మాస్టర్ ప్లాన్ అమలు జరిగితే విశాఖ రీజియన్ పరిధిలోని లక్షల మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. సింగపూర్ ,మలేషియా వంటి దేశాలే రద్దీగా ఉండే పాత టౌన్ లలో రహదార్ల విస్తరణ కు వెళ్ళటం లేదు. అందుకు విరుద్ధంగా ప్రజల కంటే వారి జీవనం కంటే, 200 అడుగుల వెడల్పైన రోడ్ లే ముఖ్యమైనట్లు ప్లాన్ రూపొందించడం ప్రజలను అవమానించడమే.
లక్షలు,కోట్ల రూపాయల విలువైన భూముల ను, మాస్టర్ ప్లాన్ కారణంగా అభివృద్ధి చేసుకోలేని నిస్సహాయ స్థితిలోకి జనం వెళ్లే ప్రమాదం ఉంది. గతంలో వి ఎం ఆర్ డి ఏ అనుమతించిన 300 లకు పైగా లే అవుట్ లలో ప్లాట్ లు,వందల ఏళ్లుగా వున్న కొన్ని గ్రామలు ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా అంతర్ధానం కానున్నాయి. మాస్టర్ ప్లాన్ పేరిట విజయ సాయి ముఠా వేల కోట్ల దోపిడీ కి పాల్పడింది.
మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా వైసిపి నేతల ఆస్తులు కూడగట్టుకునే ప్లాన్ గా తయారు చేశారు. వైసీపీ నేతలకు భూములు ఇవ్వడానికి అంగీకరించిన వారు, డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారి దగ్గర ఒక రకంగా, ప్లాన్ రోడ్డు లను మార్చి నిరాకరించిన వారిని ఇబ్బందులకు గురి చేశారు.
మాజీ ఎంపీ ఎంవీవీ కి టిడిఆర్ ఇచ్చేందుకు సిరిపురం రోడ్డు 45 మీటర్లు… దశపల్లా భూములు టీడిఆర్ లు కోసం 100 అడుగుల రోడ్డు… సన్ రే రిసార్ట్స్ అనుకూలంగా మాస్టర్ ప్లాన్. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదిత మార్పులను వెంటనే రద్దు చేయాలి. విశాఖ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం సరికొత్త మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ ను తెలుగు లో కూడా ప్రచురించి, పంచాయతీ లతోపాటు వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచాలి.
పార్లమెంట్ సభ్యుల నుంచి గ్రామ వార్డు సభ్యుని వరకు అందరినీ భాగస్వాములను చేస్తూ, మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలి. విశాఖ నగర అభివృద్ధికి విఘాతం అవుతున్న వి ఎం ఆర్ డి ఏ మాస్టర్ ప్లాన్ 2041 రద్దు చేయాలి. విశాఖ ప్రజల ఆమోదం…అభిప్రాయ సరళికి అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి.