భారతీయ సినిమా మరో ధ్రువతారను కోల్పోయింది..
తెలుగు చలనచిత్రసీమ నుంచి ఒక మహావ్యక్తి తిరిగిరాని తీరాలకు తరలి వెళ్ళిపోయారు. నటనే ప్రాణంగా..మంచితనమే ఆభరణంగా..సాహసాలే ఊపిరిగా..ప్రయోగాలే నైజంగా సినిమా రంగంతో యాభై ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని పెన వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ
ఇక లేరు..తెలుగు ప్రజలు తమ ఇంట్లో మనిషి వెళ్లిపోయినంతగా శోకసముద్రంలోమునిగిపోయారు..
సూపర్ స్టార్ కృష్ణ..
పేరుకు ముందు హీరో అనే పదాన్ని అలంకారంగా పొదుగుకున్న ఏకైక నాయకుడు..
ఆయన…
ఒక పరంపర..
ఒక సంచలనం..
రికార్డుల గని..
నిర్మాతల హీరో..!
విజయవంతమైన నిర్మాత..
భాగ్యనగరికి మణిహారంగా నిలిచిన పద్మాలయా స్టూడియో అధినేత..
చక్కని రూపసి..
ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి..
సాహసాల సహవాసి..!
డేరింగ్ అండ్ డాషింగ్..
పద్మాలయ..విజయకృష్ణ..
ప్రతిష్టాత్మక బ్యానర్ల అధినేత..
ఆదిశేషగిరిరావు..
హనుమంతరావు అనే
దిగ్గజ ద్వయానికి ప్రియభ్రాత..!
రమేష్ బాబు..ఒకనాటి హీరో
మహేష్ బాబు..
నేటి సూపర్ స్టార్ల తండ్రి..
ఆయన పేరు శ్రమ..
ఆయనే ఒక పరిశ్రమ..
ఒకనాటి తెలుగు చిత్రపరిశ్రమ నలుగురు
దిగ్గజాలలో ఒకరు..
తనతోటి మహానటులు
అన్న నందమూరి..
అభిమాన నాయకుడు ఏయెన్నార్..
ప్రియ సోదరుడు..
పోటీ నాయకుడు
శోభన్ బాబు
స్వర్గపురికి తరలి వెళ్ళినా
దేవుడు చేసిన మనుషులు కదా ఎప్పటికైనా తప్పదని తలచి..ఎంతటి హేమాహేమీలు సైతం అతీతం కాదని తలపోసి..సినిమాపై అభిమానంతో
తాను నమ్మిన..తనను నమ్మిన పరిశ్రమకు
పెద్ద దిక్కుగా..ఎనిమిది పదుల వయసులో కూడా
ఎందరికో తలలో నాలుకగా
ముందడుగు వేస్తున్న
జనం మనిషి..
అందరూ మెచ్చే..నచ్చే మహామనీషి!
అతి తక్కువ వ్యవధిలో తన నాయకి విజయనిర్మల..
పెద్ద కొడుకు రమేష్..
జీవిత ఏలిక ఇందిరా దేవి..
సోదరి..ఒకరి తర్వాత ఒకరు
తనకు దూరమైనా తట్టుకుని కొండలా నిలబడిన ధీశాలి..
నిన్న గాక మొన్ననే చిరకాల మిత్రుడు..రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణాన్ని కూడా ఓర్చుకుని ధైర్యంగా కనిపించిన ఉక్కు మనిషి..ఇప్పుడు ఇలా..
అకస్మాత్తుగా కన్ను మూయడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.!
కృష్ణ ఆగమనం తెలుగు తెరకు సరికొత్త వెలుగులు అద్దింది..కలర్ సినిమా తేనెమనసులు తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ ప్రయోగాలకు
చిరునామాగా నిలిచారు.
ఆయనే తొలి
గూఢచారి..116..
ఆయనే మొదటి కౌబాయ్..
మోసగాళ్ళకు మోసగాడు
ఆయనే తొలి సినిమాస్కోప్ నిర్మాత..! స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు సినిమాని
స్కోపులో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీసి
చరిత్ర సృష్టించారు.అది ఆయన వందో సినిమా..
ప్రయోగాలు చేయడంలో కృష్ణ ఏ దశలోనూ అలసిపోలేదు.రాజీ పడలేదు..వెనకంజ వేయలేదు..తను అమితంగా అభిమానించే అన్న ఎన్టీఆర్ తో విభేదం వచ్చినా కూడా
వెనకడుగు వేయక అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మాణాన్ని పూర్తి చేశారు.
తన ప్రయోగాల పరిధిని
బాలీవుడ్ కి విస్తరిస్తూ అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.
తెలుగులో సంచలనం సృష్టించిన పాతాళభైరవి సినిమాని కూడా హిందీలో నిర్మించి తన స్థాయిని బాలీవుడ్ కి చూపించారు.
ఇక తెలుగులో మొదటి 70 ఎం ఎం సినిమాగా సింహాసనం నిర్మించి మరోసారి చరిత్ర సృష్టించారాయన..పరిశ్రమలో సన్నిహితులు వద్దన్నా కూడా రాజీ పడక దేవదాసు సినిమాని కూడా తీసి..అలా
నాటి అగ్రహీరోలు ఎన్టీఆర్.. ఏయెన్నార్.. ఇద్దరితోనూ కొంతకాలం పాటు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కథ నడిపారు.ఎన్టీఆర్ తో రాజకీయంగా కూడా విభేదించి తను ఎంతగానో అభిమానించే ఇందిరాగాంధీ పిలుపుపై కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు ఎంపిగా కూడా ఎన్నికయ్యారు. అంతే గాక రామారావుకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు.
అయితే సహజంగా స్నేహశీలి..అగ్రహీరోలు ఇద్దరికీ అభిమాని అయిన కృష్ణ ఆ ఇద్దరితో విబేధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు.మళ్లీ ఆ ఇద్దరితో బంధాన్ని పునరుద్ధరించుకుని వారితో కలిసి నటించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో
హీరో కృష్ణ అసాధ్యుడు..
ఎంతటి ప్రయోగానికైనా వెనుదీయని అఖండుడు..
సినిమా తీస్తే ఖర్చుకి వెనకంజ వేయక రిచ్ గా తీయడం ఆయనకు అలవాటు.సీతారామరాజు సినిమా కోసం 1973 ప్రాంతాల్లో చింతపల్లి ఏరియాలో కొన్ని రోడ్లు వేసి మరీ నిర్మాణాన్ని కొనసాగించిన ధీశాలి కృష్ణ..
అలాగే కురుక్షేత్రం సినిమా కోసం ప్రత్యేక రైలులో మొత్తం యూనిట్ ను రాజస్థాన్ వెళ్ళి ఏడు కెమెరాలతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన ఘనాపాటి ఈ ఘట్టమనేని..
ఎన్టీఆర్..అక్కినేని..శోభన్.. కృష్ణంరాజు..రామకృష్ణ..హరనాథ్..మురళీమోహన్ సహా
చిరంజీవి..నాగార్జున వంటి హీరోలు అందరితో సినిమాలు చేశారు కృష్ణ..
తనతో సినిమా చేసిన నిర్మాత నష్టపోతే అదే నిర్మాతకు మరో సినిమా ఉచితంగా చేసిన సందర్భాలు ఎన్నో ఉండేవి..
తన పారితోషకం గురించి డిమాండ్ చేయడం ఆయన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ జరగలేదని అంటారు.
అనుకున్న తేదీకి సినిమా విడుదల చేయాలన్న పంతం కృష్ణకి ఎక్కువ..దేవుడే దిగివస్తే సినిమా సమయంలో
రాష్ట్రాన్ని తుపాను అతలాకుతలం చేస్తూ వాహనాలు తిరగలేని దశలో ఆయన స్వయంగా తన కారులో విజయనిర్మలతో కలిసి బయలుదేరి ఆయా ఊళ్లలో థియేటర్లకు ప్రింట్లు అందజేసిన సాహసి..
రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసి నిర్మాతలు నిర్దేశించుకున్న సమయంలో సినిమా పూర్తి చేసే నిబద్ధత కలిగిన నటుడు..
మిత్రుడు హరనాథ్ మంచిరోజు అనే సినిమా తనతో తీస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు లోనై నిర్మాణం ఆపేస్తే తన ఖర్చుతో పూర్తి చేసి ఆదుకున్న మంచి మనిషి.. తనతో పాటు పరిశ్రమకు వచ్చిన రామ్మోహన్ ను మరచిపోకుండా ఆయనకు అవకాశాలు ఇచ్చిన స్నేహితుడు సూపర్ స్టార్.
అలాగే తాను ఎంతగానో అభిమానించే సీనియర్ హీరో
కాంతారావుకు దేవుడు చేసిన మనుషులు సినిమాతో పరిశ్రమలోకి
రీ ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి తాను తీసిన…నటించిన ఎన్నో సినిమాల్లో అవకాశం కల్పించి సాయం చేసిన గొప్ప మనిషి కృష్ణ ..ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణ కథ
ఓ చరిత్ర..ఆ కథ ఈ రోజుతో ఆగింది..చరిత్ర మాత్రం ఎప్పటికీ అలా సువర్ణాక్షరాలతో వెండితెరపై నిలిచి ఉంటుంది..!.
(కృష్ణ గారితో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
మా నాన్న గారు ఎలిశెట్టి ఈశ్వరరావు గారు కృష్ణ గారు మంచి స్నేహితులు..సినిమా ఫంక్షన్లకు మద్రాస్ వెళ్ళినప్పుడు కృష్ణ ఆయనను ఎంతో గౌరవంగా చూసుకునే వారు..విజయనగరంలోని మా వేంకటేశ్వరా థియేటర్లో కృష్ణ సినిమాలు ఎన్నో వేశాం.
గూఢచారి 116..
గూడుపుటాని..మొదలు ఆయన స్వయంగా నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమాలు మోసగాళ్ళకు మొనగాడు..దేవుడు చేసిన మనుషులు..
అల్లూరి సీతారామరాజు(1974 మే 1న విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా కోసం మా దియేటర్లో సినిమా స్కోప్ ఏర్పాటు చేశాం)..
పాడిపంటలు..కురుక్షేత్రం..మా హాల్లోనే విజయవంతంగా ఆడాయి ఇవి మాత్రమే గాక సంక్రాంతికి కృష్ణ సినిమా ఏది విడుదలైనా విజయనగరంలో శ్రీ వేంకటేశ్వర లో పడేట్టు చేసేవారు కృష్ణ..కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు ఆయన సోదరులు
ఆది శేషగిరిరావు..
హనుమంతరావు..
విజయనగరం వచ్చి మా ఇంట్లోనే బస చేసేవారు…
1970 నాటికే మా ఇంట్లో ఎసి రూం ఉండేది..రాధమ్మ పెళ్లి.. ఏజెంట్ గోపి.. మామా అల్లుళ్ల సవాల్..ఇలా ఎన్ని సినిమాలు మా థియేటర్లో ఆడాయో లెక్క లేదు.ఇక రిపీట్ రన్స్ కూడా కలుపుకుంటే ఇంచుమించు ఆయన నటించిన సినిమాలు అన్నీ మా థియేటర్లో ఆడినట్టే..ఆ రకంగా కృష్ణ మా హీరో..!)
సూపర్ స్టార్ కృష్ణకి నివాళి అర్పిస్తూ..
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286