– మంత్రి పొంగులేటి సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలు
హైదరాబాద్ : మంచి మెజార్టీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహ్మత్‌నగర్ డివిజన్లోని ఓమ్ నగర్ చర్చి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రిగారు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గడచిన 23 నెలల్లో చేపట్టిన అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చిపెడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు మంచి మెజార్టీతో విజయం తధ్యమని అన్నారు. ఇప్పటికే ఈ డివిజన్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. త్వరలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని అన్నారు.
పదేళ్లలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డుకూడా ఇవ్వలేని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 22 నెలల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అర్హులైన 14వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, అలాగే సుమారు 8వేల మంది పేర్లను కార్డులలో చేర్పించామని అన్నారు.