– స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్ర నిధులతోనే ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు
– మాజీ ఎంపి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జోస్యం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితం రాజకీయపరంగా కీలకం అవుతుందని మాజీ ఎంపి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో కొనసాగుతున్న “ఓటుకు నోటు” కేసులో పరిణామాలు, ఈ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి రాజకీయ ప్రభావం చూపవచ్చని ఆయన జోస్యం చెప్పారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుల్లో కొందరు ఆయన నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించారని వెల్లడించారు. ఢిల్లీలో కూడా ఈ అంశంపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగకపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉండటం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల అసలైన ప్రతిఫలమేనని డా.బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.
ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఇలాంటి దుస్థితి ఉంటే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఊహించుకోండని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ ప్రలోభాలు, మాయమాటలతోనే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “ప్రజల సమస్యలు పక్కనపెట్టి, రియల్ ఎస్టేట్ లాభాలు, కాంట్రాక్టులు, రాజకీయ బేరసారాలు మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యం అయిపోయాయని ఆయన అన్నారు.
తమ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని చెప్పడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణానికి రెండు వైపులని… ప్రజలు ఈసారి జూబ్లీహిల్స్ బైఎలక్షన్లో బీజేపీకి మద్దతు ఇచ్చి, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన హామీలను ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారని నర్యయ్య గౌడ్ తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు రూ. 4,000 పెన్షన్, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కి గ్యాస్ సిలిండర్, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం, డిగ్రీ విద్యార్థినులకు స్కూటర్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటైన రాజకీయ వ్యవస్థలు, అధికారిక నియామకాలు, కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిపత్యం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘మోదీ , కిషన్ రెడ్డి , బండి సంజయ్ ఏమి తెచ్చారన్న వ్యాఖ్యకు సమాధానంగా “ఉచిత రేషన్, ప్రతి ఇంటికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్, తాగునీరు – ఇవన్నీ కేంద్ర పథకాల ఫలితమే. విశ్వకర్మ యోజన కింద వేలకు వేలు కుటుంబాలు లబ్ధి పొందాయి. ఇవన్నీ మోదీ పాలనలోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
“స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్ర నిధులతోనే ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. జూబ్లీహిల్స్లో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, మహిళా సంఘాలకు స్వనిధి, ముద్ర రుణాలు, స్టాండ్అప్ యోజనల కింద ఆర్థిక సహాయం అందిందని చెప్పారు.
“తెలంగాణలో 46 లక్షల మందికి ఈ పథకాల లబ్ధి కలిగింది. జూబ్లీహిల్స్లో వేలాది కుటుంబాలు వాటి లబ్ధిదారులుగా ఉన్నారని స్పష్టంగా వివరించారు. మరోవైపు “హైదరాబాద్లో నేషనల్ హైవేల దగ్గర రోడ్లు కొంత బాగున్నాయంటే, అది మోదీ గారి ‘గతిశక్తి’ యోజన వల్లేనని.. కాని గుంతలు పూడ్చేందుకు కూడా బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.