Suryaa.co.in

Telangana

ఆర్టీసీని ఆధునికరిస్తున్నాం

– సూర్యాపేట బస్టాండ్ లో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

సూర్యాపేట: మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునికరిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ బతికి బట్టకట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టీసీ సంస్థ ఇబ్బంది పడేది. సామాన్యుడి అవసరాలు తీర్చే ఆర్టీసీని నడపగలమా? వదిలించుకుందామా అన్న ఆలోచనలు గత పాలకులు చేశారు

ప్రజల ఆస్తులను, వారసత్వంగా వస్తున్న ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మారిన పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట బస్ డిపోలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి 45 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన అనంతరం స్థానిక సభను ఉద్దేశించి ప్రసంగించారు.

సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు ఏర్పాటుచేసిన ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నది దీనిని నడపగలమా? వదిలించుకుందామా అన్న ఆలోచనను గత పాలకులు చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆర్టీసీ బతికింది, ఆర్టీసీ మంత్రి అనేక ప్రణాళికలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రోగ్రెసివ్ ఆలోచనతో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రివర్గంలో చర్చించి ఆర్టీసీని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం అభినందించారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనలను అందిపుచ్చుకొని ఆర్టీసీ ముందుకు పోతుంది అన్నారు సూర్యాపేట డిపోకు 79 బ్యాటరీ బస్సులు మంజూరు కాగా ఈ ఒక్కరోజు 45 బ్యాటరీ బస్సులు ప్రారంభించుకోవడం చారిత్రాత్మకం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ఓ ఆర్ ఆర్ లోపల 2800 బ్యాటరీ బస్సులు మంత్రి పొన్నం ప్రవేశపెట్టారని వివరించారు. ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామన్నారు.

పథకం ప్రారంభం నాటి నుంచి ఈరోజు వరకు 182 కోట్ల జీరో టికెట్లు ఆర్టీసీ మంజూరు చేసింది, ఆడబిడ్డల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 6088 కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం చెల్లించింది అన్నారు. ఆర్టీసీ ఏమైపోతుందో అనుకున్న దశలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాట పట్టింది అని తెలిపారు.

మహాలక్ష్మి పథకం మూలంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయి కెపాసిటీతో తిరుగుతున్నాయి, ఉచిత టికెట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించకపోతే ఆర్టీసీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండేది అన్నారు.

LEAVE A RESPONSE