రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా మేం సిద్ధం

– రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
– ప్రజా బలం మాకు ఉంది.. ప్రజల్లో బలం లేకే మీరు ప్రభుత్వంపై బురదచల్లుతున్నారు
– ఏపీకి కేంద్రం స్పెషల్ గా నిధులు ఇవ్వడం లేదు
– సోమశిల నిర్వాసితులను ఆదుకుంటాం
– ప్రభుత్వ చీఫ్ విప్గ డికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్
గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..బద్వేలు ఉప ఎన్నికలో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు తమ పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న గర్వంతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు బద్వేలు ప్రచారానికి వస్తున్నారు. అయితే, వాళ్ళంతా కేవలం పత్రికా సమావేశాలకు మాత్రమే పరిమితమై, ప్రభుత్వంపైన బురదజల్లి వెళుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఆ పార్టీ నేతలకు లేదు. అసలు ఈ రాష్ట్రం రాజధాని లేకుండా, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చకుండా చేసింది ఆ రెండు జాతీయ పార్టీలు కాదా.. అని ప్రజలు నిలదీస్తారని వారి భయం.
సోమశిల ప్రాజెక్టు ముంపు, నిర్వాసితుల గురించి బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో నిర్వాసితులకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎకరాకు రూ. 6 నుంచి 10 వేలు కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉంది. వైయస్ఆర్ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులైన రైతులకు రూ. 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించింది వాస్తవమా.. కాదా..?
రైతులు ఆనందంగా ఉండాలని, బాగుండాలని, మార్కెట్ రేటు ఫిక్స్ చేసి వైయస్ఆర్ నష్టపరిహారం చెల్లిస్తే… పునరావాస చట్టాన్ని మరింత బలోపేతం చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్. సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి 19వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని మాట్లాడుతున్నారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి, వారందరికీ వన్ టైం సెటిల్ మెంటు చేయమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వారికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి.. పోలీసులు, ఇతర అధికారులపై విచక్షణ కోల్పోయి బీజేపీ నేతలు ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఒక్క అధికారి అయినా మా దగ్గరకు వచ్చారా..?, ఏ అధికారి దగ్గరకు అయినా మేం వెళ్ళామా.. ?. మీకు ప్రజా బలం లేదని తెలుసు, అయినాసరే, అధికారులు, పోలీసులపై ఆరోపణలు చేస్తూ, ఫిర్యాదులు చేస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నిక జరపమని మేమే చెబుతున్నాం. మాకు ప్రజా బలం ఉంది. ప్రజా బలం ఉన్నప్పుడు వేరే బలాల కోసం అర్రులు చాచాల్సిన అవసరం మాకు లేదు. మీకు ప్రజల్లో బలం లేక, కేవలం ఆరోపణలు చేసి, బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరదు.
కేంద్రంలో అధికారంలో ఉన్నామని, బీజేపీ నేతలు బద్వేలు ఉప ఎన్నికలో పారా మిలటరీ బలగాలను మొహరింపజేస్తామని మాట్లాడుతున్నారు. ఆర్మీ అయినా, మరొకటైనా దింపండి. మేం భయపడం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడాలని మేం ఆలోచనలు చేయం. పైపెచ్చు బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ ఎలా అయితే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందో.. ఆ చర్యను సపోర్టు చేసింది బీజేపీనే. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్.. ఇవన్నీ ఇస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతే.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు, ఎందుకు..?
రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా మేం సిద్ధం. ప్రత్యేక హోదాతోపాటు, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్.. ఈ మూడు మీరు ఇవ్వండి.. మేం పోటీ నుంచి విరమించుకుని మీకు మద్దతు ఇస్తాం. అది, మీరు చేయలేకపోతే.. “మేం చేయలేం, మాకు ఓట్లు అడిగే అర్హత లేదు” అని మీరే బహిరంగంగా మీడియా సమావేశాల్లో చెప్పండి.
మాట్లాడితే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు ఇస్తుందని అంటున్నారు. ఏపీకి స్పెషల్ గా ఏమైనా నిధులు ఇస్తున్నారా.. ? రాష్ట్రం నుంచి కట్టే జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి, పర్ క్యాపిట ఇన్ కమ్ ప్రకారం కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. ఎవర్నీ వ్యక్తిగతంగా మేం దూషించం. మేము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం. కేంద్ర మంత్రులతో సహా, పెద్ద పెద్ద నాయకులు మాపై విమర్శలు చేసే ముందు.. ప్రత్యేక హోదాతోపాటు, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్.. ఈ మూడు అంశాలను ఫలానా గడువు లోపల చేస్తామని కేంద్రంలోని మీ పెద్దలతో చెప్పిస్తే.. ఉపఎన్నికలో మీకు మేము మద్దతు ఇస్తాం. లేకపోతే, క్షమాపణలు చెప్పి వైయస్ఆర్సీపీ కి ఓటు వేయమని మీఅంతట మీరే చెప్పండి.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు కేంద్రం వల్ల కాదా పెరిగింది. వీటి గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయని మేం చెప్పినప్పుడు.. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రస్తుత ప్రధాని మోడీ ఏపీకి వచ్చి ఎన్నికల ప్రచార సభలో చెప్పింది నిజం కాదా.. ? దానిని నెరవేర్చాలని బీజేపీ నేతలు ఎందుకు అడగలేకపోతున్నారు..?
ఇప్పటికైనా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. కేంద్రంలో పదవులు ఆశించి, వారి మెప్పుకోసం ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే.. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ప్రజా క్షేత్రంలో ప్రజలు తిరస్కరిస్తారు. స్వప్రయోజనాలకోసం విమర్శలు తగదు. రాజకీయాల్లో హుందాతనం నేర్చుకోవాలి. బద్వేలు ఎన్నికలో ఎటూ మీకు డిపాజిట్లు రావని తెలిసిపోయింది. రౌడీయిజం చేస్తాం.. పోలీసులు, అధికారుల మీద నెపం వేసి ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కుదరదు.
బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో జిల్లా నాయకులు, కొంతమంది మంత్రులు మాత్రమే పాల్గొంటున్నారు. మరి, బీజేపీ నేతలు ఎందుకు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులను దింపుతున్నారు..? ప్రజా సమస్యలు తీర్చడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. మీడియా సమావేశాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయికు వచ్చి చూస్తే ఎవరి బలం ఏమిటో తెలుస్తుంది.