– పర్సంటేజీలను కేటీఆర్ నిరూపించాలి
– లేదంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకున్నారు
– పోరాటాల ద్వారా తెచ్చుకున్న భూ చట్టాలను ఒక్క కలం పోటుతో కనుమరుగు చేశారు
– పట్టాదారు కాలం పెట్టి సాగుకాలం ఎత్తివేసి దుర్మార్గమైన ధరణి చట్టం తెచ్చారు
– బడ్జెట్ పై చర్చలో భాగంగా కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిల కు ఘాటుగా సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: 30% పర్సంటేజీలు అంటూ సభ్యుడు కేటీఆర్ చేసిన ప్రకటన నిరూపించాలి లేదంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఘాటుగా స్పందించారు. మేము బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం, అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, పీడుతుల పక్షాన నిలబడ్డం. మీలాగా రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకోలేదు.. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అన్నారు.
సభ్యులు మాట్లాడేటప్పుడు నిబద్ధతతో, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాలి … ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అన్నారు.
డిస్కషన్, డిబేట్ పేరిట సభలో ప్రతి మాట అబద్ధాలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అన్నారు. 40,000 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులు మీరు పెండింగ్లో పెట్టి పోయారు, మీ పాపం వల్ల మొత్తం లక్ష కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయి. పనులు చేసిన వాళ్లు బిల్లులు రాక సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరిట అడ్డ గోలుగా ప్రకటనలు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా, మేము ప్రకటనలు ఇచ్చింది మీరు చూశారా అని ప్రశ్నించారు.
రాష్ట్రం నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించాం, మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం వస్తే మన ప్రతిష్ట పెరుగుతుంది, ఎప్పుడైనా అవకాశం వస్తే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు అన్న భావనతో వారిని ప్రోత్సహించినట్టు తెలిపారు.
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో.. దున్నేవారికి భూములపై హక్కులు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు భూ హక్కులు కల్పించాయని వివరించారు. బూర్గుల రామకృష్ణారావు గారు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు, కౌలుదారులకు హక్కులు కల్పించారని వివరించారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ తెచ్చిన సిఫారసులు భూ సంస్కరణ ద్వారా 1970 లలో లక్షలాదిమందికి భూ హక్కులు వచ్చాయని వివరించారు.
మీరు వచ్చాక పట్టాదారు కాలం పెట్టీ, సాగుకాలం ఎత్తేసి దుర్మార్గమైన ధరణి చట్టం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సంస్కరణల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 24 లక్షల మందికి భూములు పంచితే మీరు ధరణి చట్టం ద్వారా పార్ట్- బి లో పెట్టి అధికారుల చుట్టూ రైతులను తిప్పారు. వెరిఫికేషన్ లేకుండా భూములు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని తాసిల్దార్లకు కట్టబెట్టారు. అనేక పోరాటాల ద్వారా వచ్చిన భూ చట్టాలను కాలరాశారు అన్నారు.
ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అన్నాం, ప్రజలు నమ్మరు మాకు ఓటు వేశారు. 1970ల లో ప్రధానమంత్రిగా ఇందిరా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు భూములు పంపిణీ చేశారు. ఇంకా కొన్ని భూములు మిగిలిపోతే నక్షల్ బరీ ఉద్యమం వచ్చింది. మాకు భూములు అక్కరలేదని… భూ స్వాములు తెల్ల కాగితంపై రాసి ఇచ్చి పట్టణాలకు వెళ్లిపోయారు.
సాగుకాలంలో రైతుల పేర్లు రాస్తే విజయ భాస్కర్ రెడ్డి సీఎం గా ఉన్న కాలంలో హక్కులు కల్పించారు. మీరు ఆక్యుపేషన్ కాలం ఎత్తేసి.. పట్టాదారులకు అవకాశం కల్పించి తిరిగి జాగిర్దారులు, జమీందారులకు అవకాశం కల్పించారు.