– కాంగ్రెస్ వైఫల్యాలను విమర్శించరేం?
– అధికారంలో ఉన్నది మేమా? కాంగ్రెస్సా?
– రేవంత్ ఏడుస్తాడు.. బండి అరుస్తాడు
– ఇద్దరూ కలసి ఒకే నాటకం ఆడుతున్నారు
– సంజయ్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సవాల్
హైదరాబాద్: ‘‘తెలంగాణ రాజకీయాల్లో మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులు నడుస్తున్నాయి. కేంద్రహోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారు. రేవంత్ ఏడుస్తాడు.. బండి అరుస్తాడు.. చివరకు ఇద్దరూ కలసి ఒకే నాటకం ఆడతారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రతిపక్షాన్ని విమర్శిస్తాయా? అధికార పార్టీని కదా విమర్శించాలి? కానీ సంజయ్.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించకుండా.. ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారంటే, ఆయన సీఎం రేవంత్ కోవర్టు కాక మరేమనాలి? మేం దశాబ్దాల నుంచి ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాం. మాకు నిందలు, జైళ్లు కొత్త కాదు. కానీ కేసీఆర్‌పై నువ్వు చేసిన ఆరోపణలు నీకు దమ్ముంటే నిరూపించు’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.
దాసోజు ఇంకా ఏమన్నారంటే…
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ చేస్తున్న అసందర్భ- అకాల దాడి చూస్తుంటే ఒక విషయం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి వహిస్తున్న బండి సంజయ్ కుమార్ , నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లో ఒక రాజకీయ తోలు బొమ్మగా మారిపోయారు. ఆయన తాను గెలిచిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం కోసం రేవంత్ రెడ్డి అందించిన “సహాయానికి” బహుశా ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టున్నారు.
ఇటీవల ఆయన చేసిన ఆరోపణలు – చాలా సంవత్సరాల క్రితం కాంగ్రెస్ నేతలు చేసిన అసత్య ఆరోపణలను.. అచ్చంగా పడికట్టు మాదిరిగా పదేపదే పునరుక్తి చేయడం ద్వారా, ఆయన నిజంగా బీజేపీకి చెందిన నాయకుడిగా కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి కి సంబంధించిన గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న కోవర్ట్ అని స్పష్టమవుతుంది. .
తెలంగాణలో నిజమైన ప్రజాభిమానాన్ని కలిగి ఉండే నాయకుడైతే, బండి సంజయ్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను, అవినీతిని, స్కాంలను ప్రశ్నించాల్సింది. కానీ ఆయన అధికార పార్టీపై నోరుమూసి, మరో విపక్షమైన బీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేయడం వల్ల, ఆయన లోపభూయిష్టమైన రేవంత్ రెడ్డి పట్ల విధేయత బయటపడుతోంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య ఉన్న దుర్నీతి అక్రమ సంబంధం నిర్ధ్వంతంగా బయటపెడుతోంది.
ఈ కుట్ర క్రమం చూస్తే ఇది మరింత స్పష్టమవుతుంది: కాంగ్రెస్ నేతలు ఒకప్పుడు నిరాధార ఆరోపణ చేశారు. ఇప్పుడు అదే ఆరోపణను బండి సంజయ్ రేవంత్ చేతిలోని చిలుకలా పదేపదే చెపుతున్నారు. కాంగ్రెస్ – బీజేపీ ఇద్దరూ కలిసి, బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.
ఇది తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవలసిన నగ్న సత్యం ఏమిటంటే “రేవంత్ ఏడుస్తాడు, బండి అరుస్తాడు. ఇద్దరూ కలసి ఒకే నాటకం ఆడుతున్నారు.” వాస్తవాలను నిరూపించని పాత ఆరోపణలను మళ్ళీ బయటపెట్టి, ఎలాంటి విచారణ లేకుండా ప్రచారం చేయడం వల్ల బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారని స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ ఈ విధమైన కుట్రలకు ఎదురొడ్డి నిలబడుతుంది. బండి సంజయ్, అతని సహచరులు చేసిన నిందలకు సంబంధించి ప్రతీ చట్టపరమైన మార్గాన్ని వినియోగించుకొని, న్యాయం కోసం పోరాడుతుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలను, సాధనను ఎటువంటి గటర్ రాజకీయాలు చెరిపివేయలేవు. బండి సంజయ్.. మీ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు చూపండి. లేదా చట్టపరంగా, రాజకీయపరంగా, నైతికంగా ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కొనండి.