Suryaa.co.in

Telangana

కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం

– యువతకు ఉపాధి కల్పిస్తాం
– అదే మా ప్రభుత్వ ధ్యేయం
– ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
– ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్లోబల్ హబ్ గా తెలంగాణ
– *ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో యూఎస్ కు చెందిన “ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్ గా తెలంగాణ ను మార్చేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏఐ రాజధానిగా హైదరాబాద్ ను మార్చాలనే సంకల్పంతోనే ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతునామన్నారు.

ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ యువతను నిపుణులుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇచ్చేలా నిపుణుల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఏటా రాష్ట్రంలో 2 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటున్నారని, కానీ… వీరిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఏ అంతరాన్ని తగ్గించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ కు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఆవిష్కరణలకు హబ్ గా తెలంగాణను మార్చేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ ఏఐ పవర్డ్ సబ్ స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ మానిటైజేషన్ ప్లాట్ ఫాం “ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ ద్వారా ప్రస్తుతం 600 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య వేయి మందికి చేరుతుందన్నారు. హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించిన “ఎవర్జెంట్ టెక్నాలజీస్” యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి భవానీ శ్రీ, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, ఎవర్జెంట్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విజయ్ సజ్జ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE