– పునరుత్పాదక విద్యుత్ రంగంలో నైపుణ్యాభివృద్ధిపై చర్చ
– ఉమ్మడి కార్యచరణతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హామీ
తాడేపల్లి: ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సిలైజకి, డిప్యూటీ జనరల్ డేవిడ్ ఈగిల్స్టన్ లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు.
సోలార్ తో పాటు పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఉన్న అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆస్ట్రేలియన్ కాన్యూలేట్ ప్రతినిధులకు వివరించారు. దీనితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను పైన చర్చించారు.
మంత్రి గొట్టిపాటితో భేటీపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలైజకి.. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియన్ ప్రతినిధులు మంత్రి గొట్టిపాటికి వివరించారు.
అదే విధంగా మహిళలకు, గిరిజన ప్రాంత యువతకు ఉమ్మడి కార్యచరణతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటికి కాన్సులేట్ జనరల్ తెలిపారు. వీటితో పాటు గిరిజన ప్రాంత విశ్వ విద్యాలయాలకు ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు.