– టీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదు, నిధులు ఆవిరి అయ్యాయి
– గత పాలకులు దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారు
– ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
– దేవరకద్ర నియోజకవర్గం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
దేవరకద్ర: వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం, అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఆర్ & ఆర్, భూ సేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తాం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తాం. ఉద్దండపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 70 కోట్లు కావాలి అంటే వాటిని వెంటనే విడుదల చేశాం.
భవిష్యత్తులో ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
గత పాలకులు దొంగల మాదిరి అందిన కాడికి దోచుకున్నారు, ఇప్పుడు దయ్యాల ఇక హట్టహసం చేస్తున్నారు, నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని వారి కుటుంబ సభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.
నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రజలకు నిధులను ఖర్చు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రం ప్రపంచం తోనే పోటీపడేలా పరిపాలన చేస్తుంది, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా పాలనను కొనసాగిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరారు.
వ్యాపారాలు, కాంట్రాక్టులు చేయాలనుకుంటే ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదని.. ప్రజల గొంతుకై శాసనసభలో మాట్లాడి ప్రజల అవసరాలను తీర్చి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ పెంచే ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు మహబూబ్నగర్ ప్రజలను డిప్యూటీ సీఎం అభినందించారు.
మాది ప్రజా ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆశయాలే నిజంగా పనిచేస్తాం, వారి ఆశయాలే మా లక్ష్యంగా పరిపాలన అందిస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పాలమూరు బిడ్డలు ఆ నీళ్లను వారి భూముల్లో పారించుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం తీసుకొని వచ్చారు, అయితే 10 ఏళ్ల కాలంలో గత పాలకులు ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆనాడు చేపట్టిన జూరాల, కోయిల్ సాగర్, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు.
నాటి కాంగ్రెస్ పాలకులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తే 2015 జూన్ మాసంలో కరివేన ప్రాజెక్టు దగ్గర నాటి సీఎం కేసీఆర్ పునాది వేసి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చారు, పది సంవత్సరాలు అయిన నీళ్లు ఎందుకు పారించలేకపోయారని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.
ఎన్నికల ముందు హడావుడిగా నార్లాపూర్ వద్ద పంపు స్విచ్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసి అద్భుతం చేశాం, పాలమూరు బంగారం అయ్యిందని అరచేతిలో వైకుంఠం చూపారు, చందమామ కథలు వినిపించారని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొంబాయి ,బొగ్గు భాయి, దుబాయి అని పాటలు చెప్పిన వాళ్ళు అభివృద్ధిని పక్కనపెట్టి వెళ్లిపోయారు.. బాగా వెనుకబడిన పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పండుగ పేరుతో బహిరంగ సభ నిర్వహించి యావత్ క్యాబినెట్ ను ఆహ్వానించి వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని యావత్ క్యాబినెట్ అర్థం చేసుకొని విద్యుత్తు, సాగునీరు, విద్యా, వైద్యం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో పాలమూరు అభివృద్ధి చేసేందుకు కావలసిన నిధులు మంత్రివర్గం అందిస్తుందని వివరించారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం అన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్లతో మనసున్న ప్రభుత్వం హృదయంతో ఆలోచించి నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తుంది అన్నారు.
29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు సర్వరా చేస్తున్నాం ఇందు గాను ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 12,500 కోట్లు కడుతుంది అన్నారు.
200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని, పేదలకు డబ్బులు మిగలాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిని అన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి 200 కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఒక దేవరకద్ర నియోజకవర్గం లోని 45,155 మంది అంటే 71 ఒక శాతం గృహ జ్యోతి పథకాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు గతంలో ఆర్థికంగా బలంగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు.
జనంలో సగభాగమైన మహిళలను ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించామని తెలిపారు.
టిఆర్ఎస్ నాయకులకు 10 సంవత్సరాలపాటు మహిళలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాల పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలల్లో చదివించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు. ఇప్పటికే వంద శాసనసభ నియోజకవర్గాల్లో భూమి పూజలు చేశామని తెలిపారు.
10 సంవత్సరాల పాటు పరిపాలించిన వారికి పేద బిడ్డలు చదువుకునే గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో డైట్ చార్జీలు పెంచాలన్న ఆలోచన రాలేదు, ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మన బిడ్డలు బాగా తింటేనే చదువులపై దృష్టి పెట్టగలుగుతారని ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.
కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు నిరుద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయి, వారి కళలను నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నాం అని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువత వారి కాలపై వాళ్లు నిలబడేందుకు ఎనిమిది వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం అనే పదాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అడవి బిడ్డల కోసం వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలు సాగు చేసుకునేందుకు పోతే వారినీ ట్రాక్టర్లు, బుల్డోజర్లతో గత పాలకులు తొక్కించారు, అడ్డం పోయిన గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత పాలకులు ది అని డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరిజల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చాం అన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల ఆధీనంలో ఉన్న 6.70 లక్షల ఎకరాల్లో ఉచితంగా బోరు బావులు, సోలార్ పంపుసెట్లు, అవకాడో వంటి మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.