Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ప్లాప్

-ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికెట్ల దందా
-జీహెచ్ ఎంసీ నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం సర్కారు అవినీతికి నిదర్శనం
-తెలంగాణ రాష్ట్రం లో పర్సెంటేజీల రాజ్యం నడుస్తోంది
-కాంగ్రెస్ నేతలు బిల్లులు ఇప్పించి 20శాతం కమీషన్ కొట్టేస్తున్నారు
-సీఎం రేవంత్ పాలన గాలికొదిలేశారు
-గల్లీలో వట్టి మాటలు చెబుతూ ఢిల్లీకి డబ్బు మూటలు మోస్తున్నారు
-ఇందిరమ్మ రాజ్యమంటే, ప్రజాపాలనంటే ఇదేనా?
-బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ప్లాప్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫేక్, వాటి అమలు ఫాల్స్, అరకొర పథకాల అమలు పెద్ద ఫ్రాడ్, పాలనలో అట్టర్ ఫ్లాఫ్ అని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.

ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతోందని జీహెచ్ఎంసీ లో వెలుగు చూసిన ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారమే సర్కారు అవినీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో వేరే దేశాల నుంచి వచ్చిన పలువురు అక్రమంగా నివాసం ఉంటూ ఇక్కడ ఆధార్, ఓటర్ కార్డులు తీసుకోవడం తీవ్రమైన విషయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఫేక్ అని, రుణ మాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు వంటివి బుట్ట దాఖలా అయ్యాయని ఆయన అన్నారు. పథకాల అమలు పెద్ద ఫాల్స్. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మొండి చెయ్యి చూపించారు. రైతులకైతే తీరని ద్రోహం చేశారు. పంటలు కొనకుండా అన్నదాతలను ఆగం చేశారు.తెలంగాణ రాష్ట్రం లో పర్సెంటేజీల రాజ్యం నడుస్తోంది.

కాంగ్రెస్ నేతలు బిల్లులు ఇప్పించి 20శాతం కమీషన్ కొట్టేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికొదిలేశారు. గల్లీలో వట్టి మాటలు చెబుతూ ఢిల్లీకి డబ్బు మూటలు మోస్తున్నారు. సీఎం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంటే మంత్రులు హెలీ క్యాప్టర్లు దిగడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే, ప్రజాపాలనంటే ఇదేనా? అని జీవన్ రెడ్డి నిలదీశారు.

LEAVE A RESPONSE