Suryaa.co.in

Telangana

లోహ విజ్ఞానంపై “Wootz The Forgotten Metal Craft of Deccan..”

లోహ విజ్ఞానంపై “Wootz The Forgotten Metal Craft of Deccan..” ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, దాసోజు శ్రవణ్..

హైదరాబాద్: “ప్రపంచంలో అత్యంత నాణ్యమైన కత్తుల తయారీకి ప్రధాన కేంద్రం డమాస్కస్.. అయితే, ఈ కత్తుల తయారీకి తెలంగాణలో ఉత్పత్తయ్యే ఉక్కును డమాస్కస్ దిగుమతి చేసుకునేది. పైగా, ఒక ముద్ద ఉక్కుకు పది రేట్ల బంగారు ముద్దలను మన తెలంగాణా ఉక్కు తయారీ దారులకు అందచేసే వారట.. ఆరు వేల సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో ప్రపంచం లోనే అత్యంత మేలు రకమైన ఉక్కు తయారీ కావడంతో పాటు ప్రపంచం లోని పలు దేశాలకు ఎగుమతి చేసే వారట”

ఈ అంశాలతో పాటు ఎంతో విలువైన సమాచారాన్ని “Wootz The Forgotten Metal Craft of Deccan” అనే గ్రంధంలో పేర్కొన్నారు. డా. శ్రీపెరుంబుదురు జైశంకర్ రాసిన ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్, నాంపల్లి లోని తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో జరిగింది.
జాతీయ విశ్వకర్మ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, దాసోజు శ్రవణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఏ. పద్మా చారి అధ్యక్షతన జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ, తెలంగాణా కేవలం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉన్నత చరిత్ర కలిగిన తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి చేసేదని ఆధారాలతో సహా రూపొందించిన ఈ పుస్తకం మంచి పరిశోధనా గ్రంధంగా పలువురికి ఉపయోగ పడుతుందని అన్నారు.

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ప్రస్తుత నిచ్చెన మెట్ల సమాజంలో అద్భుత కళాకారులుగా, నిర్మాణ ప్రతిభ వున్నా విశ్వ బ్రాహ్మణులు శూద్రులుగా విభజించబడి అణగారిన కులాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి నాగరికత నేర్పిన విశ్వ బ్రాహ్మణుల గొప్పతనంపై ఈ గ్రంధంలో అద్భుతంగా పేర్కొన్నారని అన్నారు.

గ్రంథ రచయిత శ్రీపెరంబుదూరు జైకిసాన్ మాట్లాడుతూ, తెలంగాణాలో ఉక్కు లోహ పరిశ్రమ పరిణామంపై వివరించారు. ఆంగ్లంలో Wootz అని పిలిచే ఉక్కును భారత దేశంలో అత్యంత పదునైన ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించే వారు. ఈ లోహం అధిక కర్బనం కలిగి ఉంటుంది. ఇది, ఇనుము లాగా మెత్త నైనా లోహం కాదు. ఇనుప ముక్కలను అతి ఉష్టోగ్రత దగ్గర కరిగించి కర్బనం జోడించి ఉక్కుగా తయారు చేస్తారు.

దీని తోనే కత్తులు, చాకులు, పదునైన ఆయుధాల తయారీకి ఉపయోగించే వారు. ఈ ఉక్కును గుజరాత్ లోని క్యాచ్ ఓడ రేవు ద్వారా పర్షియన్ జల సంధి మీదుగా డమాస్కస్ కు రవాణా చేయబడి సిరియాలో ఆయుధాలు తయారు చేసేవారు. కచ్ మీదుగా ఎగుమతి చేసినందున ఈ లోహాన్ని కచ్చి లోగా అనీ పిలిచే వారట.. 1750 లో డమాస్కస్ లో మన లోహంతో కత్తులు, ఆయుధాల తయారీ నిలిచి పోయిందని ఈ గ్రంధంలో సవివరంగా తెలిపారు.

మహమ్మద్ ప్రవక్త వాడిన ఖడ్గాన్ని ‘మొహాన్నద్’ అని పిలిచే వారు. మొహాన్నది అంటే మంచి భారత దేశం ఉక్కుతో తయారు చేసిన ఖడ్గమని అర్ధం. ఇక, మన దేశంలో గుప్తుల కాలం క్రీ.శ. 400లో నిర్మించిన ఢిల్లీ ఇనుప స్తంభం, ఒర్రిస్సా లోని కోణార్క్ దేవాలయంలో సుమారు 50 నుండి 60 టన్నుల బరువైన దాదాపు 60 ఇనుప స్తంబాలు, ఇప్పటికీ కాన వచ్చే ఎన్నో ఫిరంగులు తుప్పు పట్టకుండా ఉంది మన పూర్వీకుల లోహ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి..

Wootz The Forgotten Metal Craft of Deccan అనే ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో తెలంగాణ సంక్షిప్త చరిత్ర, ఈ ప్రాంతం లోని ఉక్కు భౌతిక సంస్కృతీ, వివిధ ప్రాంతాల్లో తుప్పు పట్టని ఉక్కు స్తంబాలు, ఫిరంగులు, విశ్వకర్మల వృత్తి నైపుణ్యం తదితర అంశాల గురించి వివరించారు. రెండు అధ్యాయంలో తెలంగాణాలో పెద్ద రాతి సమాధుల యుగం గురించి, క్రీ.పూ. 6 వేల సంవత్సరాల నాడు ఇక్కడ కనిపించే ఇనుప సంస్కృతిని వివరించారు.

మూడవ అధ్యాయంలో తెలంగాణలో అధికంగా ఉక్కు ఆధారిత వస్తువులు తయారయ్యే గ్రామాలు, చిన్న పట్టణాల గురించి వివరించారు. కర్ణాటక, తమిళ నాడు, తెలంగాణాలో ఉక్కు తయారీలో తేడాలున్నాయని, తెలంగాణలో ఉక్కు తయారీలో ఉక్కు ముద్దలకు 1% నుండి 2% కార్బనం కలిపే వారు. ఇతర రాష్ట్రాలల్లో ఇది, 0.8% నుండి 1.2% కర్బనం కలిపే వారు. అందుకే, తెలంగాణా ఉక్కు అత్యంత ప్రామాణికమైనది.

తెలంగాణాలో ఉక్కు లోహానికి సంబందించిన అనేక అంశాలను తెలియచేసే ఈ పుస్తకం మెటల్స్ పై పరిశోధన చేసే స్కాలర్స్ కు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, హైదరాబాద్ డీఆర్ఓ వెంకటా చారి, రాజేందర్ రెడ్డి, వి. రఘునాధ్, రఘువీర్ ప్రతాప్, పెందోట శ్రీను, తంగెళ్లపల్లి రవి కుమార్, కిరణ్ కుమార్, బుద్దారం సుధాకర్, శాంతి కృష్ణ, మంజుల, తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE