– ఎస్ఎల్బీసీ పూర్తయితే 30 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు
– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
– అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్-1 ప్రాంతంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగర్ కర్నూల్: ఈ సర్వే ద్వారా భూగర్భ స్థితిగతులు, రాతి నిర్మాణం, నీటి ప్రవాహాలను 800-1000 మీటర్ల లోతుల్లో ఆధునిక సాంకేతికతతో గుర్తించనున్నారు. రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ ( ఎస్ఎల్బీసీ ) ప్రాజెక్టును మా ప్రభుత్వం తిరిగి చేపట్టి, ఎదురైన సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను అమెరికాకు వెళ్లి టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తెప్పించాను. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకపోతే ఇదే పనులు చాలా కాలం క్రితం పూర్తయ్యేవి. ఎస్ఎల్బీసీ పూర్తయితే 30 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి భారీ ఆదా లభిస్తుంది. మూసి నది శుద్ధీకరణతో నల్లగొండకు శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటి. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీనిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా అందుబాటులోకి తెస్తాం. పునరావాస ప్యాకేజీలను డిసెంబర్ 31 నాటికి పూర్తిచేస్తాం. భూములు కోల్పోయిన వారికి నష్టం జరగకుండా పూర్తి సహాయం అందిస్తాం అని మంత్రి అన్నారు.