– ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శ
అమరావతి: అసెంబ్లీలో జలవనరుల శాఖపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన జగన్… పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను మూలన పడేశారని, ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలకళ పోయి, కరువు బయటపడుతున్నా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో 62 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు.
2014 -19 సంవత్సరాలలో 68,293 కోట్లు ఖర్చు చేసి 7 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించడంతో పాటు, 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిందన్నారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా చెరువుల అనుసంధానం, చెక్ డ్యాముల నిర్మాణం చేయగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మొత్తం ఇరిగేషన్ వ్యవస్థనే నాశనం చేశారని ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
ముఖ్యంగా నాగార్జున సాగర్ కుడి కాల్వ చివరి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవసరమైన కాల్వలు, డ్రైన్ల మరమ్మత్తులను కూడా గత ఐదేళ్లుగా చేపట్టకపోవడంతో నీళ్ళు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జలవనరుల శాఖ వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.