• జగ్గయ్యపేటలో కోల్డ్ స్టోరేజీ దగ్ధం దురదృష్టకరం..
• రైతులను ఆదుకోవాలని పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరతాం
• అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట: తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల కోల్డ్ స్టోరేజీ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోల్డ్ స్టోరేజీని సందర్శించి ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. ఏపీ ఫైర్ డైరెక్టర్ జనరల్ (డీజీ) మాదిరెడ్డి ప్రతాప్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణతో మాట్లాడి అగ్నిప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉదయభాను మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు. ఈ గోడౌన్ లో ఏడాది నుంచి దాదాపు 400 మంది రైతులు మిర్చి, అపరాలు ( పప్పు ధాన్యాలు)ను నిల్వ ఉంచారని చెప్పారు. ఈ ప్రమాదంతో సుమరు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని ఉదయభాను భరోసా ఇచ్చారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం కూడా రైతులకు న్యాయం చేయాలని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నడూ ఇలాంటి అగ్నిప్రమాద ఘటనలు సంభవించలేదని ఉదయభాను అన్నారు.