*ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
*పరిస్థితి అదుపులోనే ఉంది
*అస్వస్థతకు కారణాలను అన్వేషిస్తున్నాం
*సోమ, మంగళవారాల్లో నివేదికలు వస్తాయి
*ఇంటింటి సర్వే తుదిదశకు చేరుకుంటోంది
*మంచినీటి సరఫరాపై పూర్తి స్థాయి నిఘా
*మెరుగైన వైద్యం అందేలా చర్యలు
*ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు
*వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం
*అంబులెన్సులు కూడా సిద్ధం చేశాం
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
*మీడియాతో ప్రత్యేక సమావేశం
*ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష
*ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శించిన మంత్రి
గుంటూరులో పలువురికి అనారోగ్య సమస్యలకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కొద్దిరోజులుగా నగరంలో అస్వస్థత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సోమవారం మంత్రి విడదల రజిని స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బాధితులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. అనారోగ్య సమస్యలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి శారదాకాలనీ, లాంచెస్టర్ రోడ్డు, ఐపీడీ కాలనీల్లో మొత్తం 23587 ఇళ్ల కు వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఇప్పటికే 15312 ఇళ్లకు సంబంధించి సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా 12 మంది వాంతులు, విరేచినాలతో బాధపడుతున్నారని గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రభుత్వమే సర్వే చేపట్టి అనారోగ్యంగా ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించే బాధ్యత తీసుకుందని వెల్లడించారు. మనసున్న ప్రభుత్వం కాబట్టే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో 60 కేసులు
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం 60 మంది వాంతులు, విరేచినాలు సమస్యలతో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ రోజు, రేపటిలో వీరంతా డిశ్చార్జి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్వస్థత కేసులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి అక్కడ ఒకటి, అక్కడ ఒకటి చొప్పున వస్తున్నాయని తెలిపారు. దీనికి కారణాలపై అన్వేషణ కొనసాగుతోందన్నారు.
సోమ, మంగళవారాల్లో కొన్ని నివేదికలు వస్తాయని చెప్పారు. మంచినీరు, ఆహార శాంపిళ్లను పరీక్షలకు పంపామని తెలిపారు. వాటి నివేదికలు వచ్చాక అనారోగ్య కేసులకు కారణాలపై ఒక స్పష్టత వస్తుందనితెలిపారు. నగరంలో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు చొప్పున ఏకంగా 32 బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటి సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు.
నగరంలోని అన్ని యూపీహెచ్‌సీలు 24 గంటలూ పనిచేసేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేశామన్నారు. కావాల్సిన మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. అంబులెన్సులు సరిపడా ఏర్పాటుచేశామన్నారు.
కారణాలు కనుగొనండి
మంత్రి అంతకుముందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్య సమస్యలకు గల కారణాలపై ఒక స్పష్టత రావాలని చెప్పారు. నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. మంచినీటి సమస్య అయి ఉండొచ్చని భావిస్తున్న నేపథ్యంలో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటి అందించాలని సూచించారు.
ఏ ప్రాంతానికి ఎన్ని ట్యాంకర్ల నీరు అవసరమవుతుంది..? నివేదికను తయారుచేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఆర్వో నీటిని తాగునీటి కోసం పంపాలని , నివేదికలు తయారుచేయాలని కోరారు. వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. 24 గంటలూ అన్ని ఆస్పత్రులు పనిచేయాలని ఆదేశించారు. ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు సరిపడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు.
ప్రభుత్వాస్పత్రి సందర్శన
అనంతరం మంత్రి అధికారులతో కలిసి ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. అందుతున్న వైద్యంపై రోగులను నేరుగా అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడారు. అందుతున్న వైద్యం, ఏర్పాటుచేసిన సౌకర్యాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రత్యేక వార్డు ద్వారా పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూడాలన్నారు.
సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండటాన్ని చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. రోగులు కూడా అందుతున్న వైద్యంపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి డీఎంఈ డాక్టర్ నర్సింహం, డీహెచ్ డాక్టర్ పద్మావతి, ఆర్డీ డాక్టర్ శోభారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, ప్రిన్సిపాల్ టీ టీకే రెడ్డి తదితరులు ఉన్నారు.