సంక్షేమ పథకాలపై కోర్టులకెళ్ళి స్టేలు తెస్తున్నారు

– టీడీపీ కుట్రలను న్యాయబద్ధంగా ఎదుర్కొనే బాధ్యత న్యాయవాదులదే
– పార్టీ ప్లీనరీ లోపల జిల్లా మహాసభలు పెట్టాలని పిలుపు
– లీగల్‌ సెల్‌ రాష్ట్ర సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దిశా నిర్ధేశం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను అడ్డుకుంటామని ఓపెన్‌గా చెప్పి మరీ, ప్రతిపక్ష తెలుగుదేశం కోర్టులకు వెళ్ళి ప్రతి దానిపై స్టేలు తీసుకొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థను, మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యవస్థను టీడీపీ బ్రష్టు పట్టిస్తుందని అన్నారు. న్యాయమూర్తులను దూషించకుండా… న్యాయ వ్యవస్థను కించపరచకుండా… న్యాయబద్ధంగానే ఈ చర్యలను ఎదుర్కోవడం ద్వారా నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని ఆయన వైఎస్ఆర్సీపీ లీగల్‌ సెల్‌ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్ ఆర్సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, హక్కుల కోసం బాధ్యతాయుతంగా పోరాడే వారే న్యాయవాదులని పేర్కొన్నారు. అలాంటి న్యాయవాదులకు నాయకులుగా ఉన్న మీరంతా శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలలో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆ దిశగా దృష్టి సారించి లీగల్‌ సెల్‌ను మరింత బలోపేతం చేయాలని కోరారు. బార్‌ కౌన్సిల్‌తో సహా రాష్ట్రంలో ఉన్న 143 బార్‌ అసోసియేషన్లలో మన పార్టీకి చెందిన లీగల్‌ సెల్‌ నాయకులే పట్టు సాధించాలని సూచించారు. తద్వారా న్యాయ వ్యవస్థలో మరింత క్రియాశీలకం కావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

ఎందుకంటే… “ప్రభుత్వం ఏ ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టినా.. ప్రతిపక్షం అందుకు అడ్డుపడుతోంది. స్టేలు, కేసులతో వేధిస్తోంది. మీడియాలోని కొన్ని సంస్థలు కూడా ప్రతిపక్షం కొమ్ము కాస్తున్నాయి. రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందనీ… త్వరలోనే మరో శ్రీలంక కాబోతోందనీ… ఇటువంటి దుష్ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిర పరిచే పన్నాగాలు పన్నుతోంది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్య ప్రవేశపెడితే… కోర్టుకు వెళ్ళారు. పేదలకు ఇళ్ళు ఇద్దామన్నా… కోర్టును ఆశ్రయించి అడ్డుకుంటున్నారు. ఇక నవరత్నాలపై నిత్యం కేసులు వేస్తూనే ఉన్నారు. నిరర్ధక ఆస్తులు అమ్మి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేద్దామన్నా చేయలేని పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థతో పరిపాలనను ప్రజల ముంగిటకు చేరుస్తుంటే అక్కడా అడ్డం పడుతున్నారు. ఆఖరికి టీటీడీ ట్రస్టు బోర్డు నియామకంపై కూడా వారు కోర్టు కెక్కి రచ్చ చేస్తున్నారు.” ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లోనూ కోర్టులు జోక్యం చేసుకునేలా ప్రతిపక్షం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. దీన్ని మనం సమిష్టిగా తిప్పికొట్టినప్పుడే అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లా నేస్తం పథకంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధి కింద నిధులు విడుదల చేసిందని తెలిపారు. లీగల్‌ సెల్‌ నేతల కోరిక మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో న్యాయవాదులకు ప్రత్యేకంగా హౌసింగ్‌ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. న్యాయవాదుల కోసం ఇంకా ఏమైనా కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

రెండేళ్ళలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా మహాసభలు జరపడం లీగల్‌సెల్‌ ముందున్న తక్షణ కర్తవ్యమని విజయసాయిరెడ్డిగారు తెలిపారు. జులై 8వ తేదీన జరుగనున్న పార్టీ ప్లీనరీలోపల అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రతిపక్షం విష ప్రచారాన్ని ఎదుర్కొనే క్రమంలో న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేకుండా సోషల్‌మీడియాతో అనుసంధానమై ముందుకు సాగాలని వి.విజయసాయిరెడ్డి లీగల్‌ సెల్‌ నేతలకు పిలుపునిచ్చారు.

శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ… ఈ రాష్ట్రంలో అందరూ ఒక పక్క ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే మరో పక్క ఉన్న వాతావరణాన్ని న్యాయవాదులు సవ్యంగా అర్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, ఆలోచనలు, సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకుని క్షేత్ర స్థాయిలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. రానున్న ఎన్నికల నాటికి పార్టీలోనే అత్యంత బలమైన శక్తిగా… అందరికీ ఆదర్శప్రాయంగా ఎదిగి మరో 30 సంవత్సరాల పాటు జగన్ గారే ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేయాలని కోరారు.

లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రతి పనికీ కోర్టులో పిల్స్‌ వేయడం ద్వారా ప్రతిపక్షం, విషపు రాతల ద్వారా ఎల్లో మీడియా సంస్థలు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. బాధ్యత గల నాయకులుగా తామంతా ప్రతిపక్ష తెలుగుదేశం కుట్రలను ఎండగడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి విపక్షం కుట్రలు భగ్నం చేసేందుకు సుశిక్షితులమైన సైనికులుగా పని చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో జూన్‌ 30వ తేదీ లోగా లీగల్‌ సెల్‌ అన్ని జిల్లాల మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు మనోహర్‌రెడ్డి పెట్టిన జిల్లా మహాసభల తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

రాష్ట్ర ఫైబర్‌ గ్రిడ్‌ ఛైర్మన్‌ పూనూరి గౌతంరెడ్డి మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో న్యాయవాద సంక్షేమం అమలవుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ లీగల్‌సెల్‌ ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికీ అండగా నిలవాలని కోరారు.

ఈ సమావేశంలో నవరత్నాల కార్యక్రమం వైస్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, ఆప్కో ఛైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర నేతలు కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, 26 జిల్లాల లీగల్‌ సెల్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.