Suryaa.co.in

Features

90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?

“పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం.. కానీ సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?” ఈ మాటలు ‘షహీద్’ భగత్‌సింగ్ రాసిన ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలోనివి.
పంజాబ్‌ నుంచి వెలువడే ‘కిర్తీ’ అనే పత్రికలో ‘విద్రోహి’ (తిరుగుబాటుదారు) అనే కలం పేరుతో భగత్ సింగ్ వ్యాసం రాశారు.

“మన దేశంలో ఉన్నంత దుర్భర పరిస్థితులు మరే దేశంలోనూ లేవు” అంటూ ఆయన వ్యాసం మొదలువుతుంది.
“ఇక్కడ చిత్రవిచిత్రమైన సమస్యలున్నాయి. వీటిలో ముఖ్యమైంది అంటరానితనం. సమస్యేంటంటే, 30 కోట్ల జనాభా ఉన్న దేశంలో 6 కోట్ల మందిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నారు. వారిని ముట్టుకుంటే చాలు అధర్మం జరిగిపోతుందని చెబుతారు. వాళ్లు గుడిలో అడుగుపెడితే దేవుళ్లకు కోపం వస్తుందంటారు. వారు బావి నుంచి నీటిని తోడితే బావి అపవిత్రమై పోతుందంటారు. ఇరవై శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇలా కొనసాగుతోందంటే వినడానికే సిగ్గుగా ఉంది” అన్నవి భగత్‌సింగ్ వ్యాసంలో ప్రారంభ వాక్యాలు.

1928 జూన్‌లో, అంటే అంటరానితనాన్ని నిషేధిస్తూ నాటి నేషనల్ అసెంబ్లీలో చట్టం చేయడానికి సరిగ్గా 22 ఏళ్ల కిందట, ఈ వ్యాసం అచ్చయ్యే నాటికి భగత్‌సింగ్ వయసు కేవలం 20 ఏళ్లే.

1927లో భగత్ సింగ్‌ను అరెస్టు చేసినపుడు జైల్లో తీసిన చిత్రం
చిరుప్రాయంలోనే.. భారతదేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల యువప్రాయంలోనే ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ నేటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తాడనే విషయంలో సందేహం లేదు.
చరిత్రకారులు ఆయనను సోక్రటీస్, జోన్ ఆఫ్ ఆర్క్, చేగువేరా వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విప్లవకారుల సరసన లెక్కిస్తారు.
భగత్‌సింగ్ ఒక విప్లవకారుడే కాదు, మంచి చదువరి, వక్త, రచయిత కూడా.

ఆయన లాహోర్ జైలులో ఉన్న కాలంలో రాసిన 404 పేజీల డైరీని చూసినా, తనకు ఫలానా పుస్తకాలు పంపించాలని కోరుతూ బయట ఉన్న తన సహచరులకూ, బంధుమిత్రులకు రాసిన లేఖలను పరిశీలించినా ఆయన విశ్వ సాహిత్యాన్ని చదవడం కోసం ఎంత పరితపించాడో తెలుస్తుంది.
చిన్న వయసులోనే ఆయన తన అధ్యయనానికీ, రచనా వ్యాసంగానికి ఎంచుకున్న విస్తృతిని గమనిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

భగత్‌సింగ్ ప్రధానంగా భారత స్వాతంత్ర్యోద్యమం, ప్రపంచ రాజకీయాలు, సోషలిజం-విప్లవం, కార్మికోద్యమాలు, మతం, నాస్తికత్వం వంటి అంశాలపై రచనలు చేశారన్నది తెలిసిందే.
అయితే నేడు దళిత సమస్యగా వ్యవహరిస్తున్న అంటరానితనం గురించి ఆయన భావాలేమిటో కేవలం పైన పేర్కొన్న ఒక్క వ్యాసం ద్వారానే లభ్యమవుతున్నప్పటికీ ఆయన లేవనెత్తిన విషయాలలో గాఢత, లోతు ఉన్నాయి.

సమకాలీన ఘటనల ప్రభావం
భగత్‌సింగ్ 1928లో ఈ వ్యాసం రాయడానికి కాస్త ముందుగా కొన్ని ముఖ్య ఘటనలు జరిగాయని చరిత్రకారుడు అశోక్ యాదవ్ గుర్తు చేస్తారు.
1927 డిసెంబర్ 25న బీఆర్ అంబేడ్కర్, ఆయన అనుచరులు కలిసి ‘మనుస్మృతి’ని దగ్ధం చేశారు.
అదే సంవత్సరం మార్చి 20న వారు ‘మహద్ సత్యాగ్రహం’ చేపట్టి మహద్ అనే ప్రాంతంలో చెరువులో నీటిని తాగారు.

అప్పటి వరకు అంటరానివారికి చెరువులలో, బావులలో నీటిని కూడా ముట్టుకునే హక్కు లేదు.
1926లో సింధ్ ప్రాంతానికి చెందిన నూర్ మహ్మద్ అనే శాసనసభ్యుడు బాంబే కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ, “సాటి మనిషికి తాగడానికి నీళ్లు కూడా మీరు ఇవ్వనపుడు, వాళ్లను స్కూళ్లలో చదువుకోవడానికే అనుమతించనపుడు, మీకు మరిన్ని అధికారాలు కావాలని పరాయి పాలకులను అడగడంలో అర్థం ఏముంది? సాటి మనిషికే సమాన హక్కులు ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేనపుడు మరిన్ని రాజకీయ హక్కులు కావాలని అడగడంలో ఔచిత్యం ఏముంది?” అని అన్నారు.
పై మాటలను భగత్‌సింగ్ తన వ్యాసంలో ఉల్లేఖించడమే కాదు, “ముస్లిం కాబట్టి అంటరానివారిని తమ మతంలో చేర్చుకోవడం కోసమే ఇలా మాట్లాడాడంటూ ఆయనపై నిందలు వేయకండి” అని కూడా అందులో రాశారు.

కేథరీన్ మేయో అనే అమెరికన్ పరిశోధకురాలు రాసిన ‘మదర్ ఇండియా’ పుస్తకం కూడా దాదాపు అదే సమయంలో విడుదల కావడం మరొక ముఖ్య పరిణామం.
భారతదేశంలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఉన్న చెడులను ఆమె తన పుస్తకంలో కళ్లకు గట్టినట్టుగా రాశారు.
అయితే గాంధీజీ ఈ పుస్తకాన్ని ‘మురికికాల్వల ఇన్‌స్పెక్టర్ నివేదిక’ అంటూ మండిపడ్డారు.
కానీ భగత్‌సింగ్ మాత్రం మేయో రాసిన “స్వాతంత్ర్యాన్ని కోరుకునే వారు తమపై తాము కూడా పోరాడాలి” అన్ని మాటను తన వ్యాసంలో ప్రముఖంగా ఉల్లేఖించారు.

ఇలా ఈ మూడు ఘటనలు – మహద్ సత్యాగ్రహం, మనుస్మృతి దహనం, మదర్ ఇండియా పుస్తకం – సామాజిక సమస్యల అంశాన్ని జాతీయోద్యమంలో బలంగా ముందుకు తెచ్చిన నేపథ్యంలోనే భగత్‌సింగ్ పై వ్యాసాన్ని రాశాడని అశోక్ యాదవ్ అంటారు.

మనుషుల్లా చూడకపోతే మతం మారరా?
మతమార్పిడుల గురించి ఇటీవలి దశాబ్దాలలో చాలానే చర్చ జరుగుతోంది.
అయితే అంటరానివారు (దళితులు) తాము ఎదుర్కొంటున్న అవమానాల నుంచి తప్పించుకోవడానికి ఇతర మతాల్లో చేరాలని భావిస్తుంటే అందులో తప్పేంటని భగత్‌సింగ్ తన వ్యాసంలో ఆనాడే ప్రశ్నించారు.

“మీరిలా సాటి మనుషులనే పశువులకన్నా హీనంగా చూస్తుంటే వాళ్లు ఇతర మతాల్లోకి వెళ్లాలని భావించడంలో తప్పేముంది? తమకు ఎక్కువ హక్కులు లభిస్తాయని, తమతో సాటిమనుషుల్లా ప్రవర్తిస్తారని నమ్మకం ఉన్న ఇతర మతాల్లోకి వెళ్లిపోతారు. అప్పుడు మీరు ..క్రైస్తవులు, ముస్లింలు కలిసి హిందూ మతానికి నష్టం చేకూరుస్తున్నారని వాపోతే అందులో అర్థమేముంది?” అని భగత్‌సింగ్ తన వ్యాసంలో రాశారు.

తిరగబడకుండా అడ్డుకోవడం కోసమే పునర్జన్మ సిద్ధాంతం!
మనుషులందరూ సమానమేననీ, పుట్టుక వల్ల గానీ పని విభజన వల్ల గానీ ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కారని భగత్‌సింగ్ అభిప్రాయపడ్డారు.
అంటరానివారి పట్ల అనుసరిస్తున్న అన్యాయమైన, అమానవీయమైన పద్ధతులతో వారెక్కడ తిరుగుబాటుకు పూనుకుంటారోనన్న భయంతోనే పునర్జన్మ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

“ఇదంతా నువ్వు పూర్వ జన్మలో చేసుకున్న పాపాల ఫలితం. ఇప్పుడు చేసేదేముంది? నోరుమూసుకొని ఇదంతా అనుభవించు అంటూ వారికి ఓపిక పట్టాలనే ఉపదేశాలు చేసి చేసి చాలా కాలం పాటు వారిని నోరెత్తకుండా చేశారు. కానీ ఇదే అతి పెద్ద పాపం. మీరు మనిషిలో మానవత్వాన్నే లేకుండా చేశారు. ఆత్మవిశ్వాసం, స్వావలంబన వంటి భావనలను అంతమొందించారు. అంటరానివారిపై చాలా దమనకాండకూ, అన్యాయానికి పాల్పడ్డారు. ఇప్పుడు వాటన్నింటికి గాను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది” అని భగత్‌సింగ్ రాశారు.

సమాజానికి అవసరమైన పనుల పట్ల ఏవగింపా?
మలాన్ని శుభ్రం చేసినంత మాత్రాన మనుషులు అంటరానివాళ్లెట్లా అవుతారని భగత్‌సింగ్ తన వ్యాసంలో ప్రశ్నిస్తారు.
“తల్లులు తమ పిల్లల మలాన్ని శుభ్రం చేయడానికీ, పాకీపని చేసే ఓ వ్యక్తి మలాన్ని శుభ్రం చేయడానికి తేడా ఏముంది” అని ఆయన తన వ్యాసంలో వాదిస్తారు.

ఇలా మనుషులను అంటరానివారిగా చేసే దురాచారం వల్ల సమాజానికి అవసరమైన పనుల పట్ల మనుషుల్లో ఏవగింపు మొదలైందని, దాంతో సమాజ పురోగమనానికి అడ్డంకి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

“మనం బట్టలు నేసేవాళ్లను చీదరించుకున్నాం. ఈరోజు నేతపని చేసే వాళ్లను కూడా చాలా చోట్ల అంటరానివారిగా చూస్తున్నారు. యూపీ వైపు డోలీలను మోసేవారిని కూడా అంటరానివారిగానే చూస్తారు. దీంతో సమాజంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాజం ముందుకు సాగకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి” అని ఆయన రాశారు.
మెల్లమెల్లగా జరిగే సంస్కరణలతో ఒరిగేదేం లేదు!
అంటరానివారికి తమ సొంత ప్రజాప్రతినిధులు ఉండటం అవసరమని భగత్‌సింగ్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

మరోవైపు అప్పటికే అంబేడ్కర్, ఆయన సహచరులు అంటరానివారి కోసం ప్రత్యేక ఎలొక్టరేట్లు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
“వాళ్లు తమ హక్కుల కోసం గొంతెత్తాలి. అంటరానివారిగా పిలవబడుతున్న ప్రజాసేవకులారా, సోదరులారా లేవండి” అంటూ భగత్‌సింగ్ అంటరానివారికి పిలుపునిచ్చారు.
గురు గోవింద్‌సింగ్ సైన్యంలో అసలైన బలం అంటరానివారిదేననీ, ఛత్రపతి శివాజీ కూడా వారి బలంతోనే విజయాలు సాధించాడనీ భగత్‌సింగ్ పేర్కొన్నారు.

“అసలైన కార్మికవర్గం మీరే. సంఘటితం కండి. మీరు కోల్పోయేదేం లేదు. తెగిపోయేవి మీ బానిస సంకెళ్లే. ప్రస్తుత వ్యవస్థపై తిరుగుబాటు చెయ్యండి. మెల్లమెల్లగా జరిగే సంస్కరణలతో ఒరిగేదేం లేదు. సామాజిక ఉద్యమం ద్వారా విప్లవం మొదలు పెట్టండి. రాజకీయ, ఆర్థిక విప్లవాలకు నడుం బిగించండి. మీరే దేశానికి ప్రధాన ఆధారం. మీదే నిజమైన శక్తి. నిద్రబోతున్న పులులారా! లేవండి! తిరుగుబాటు చెయ్యండి” అంటూ భగత్‌సింగ్ తన వ్యాసాన్ని ముగిస్తారు.

డా”.ఎస్.బాబూరావు.
జర్నలిస్ట్/కాలమిస్ట్.

LEAVE A RESPONSE