( శ్రీరాంసాగర్)
2019 ఆగష్టు 5 న రాజ్యసభలో జమ్మూ కశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖామంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పై సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే వచ్చాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి వచ్చాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలవుతుంది. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. వెనువెంటనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జమ్మూ, లఢాఖ్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇంతటితో సమస్య సద్దుమణిగినట్లు కాదు. ఇప్పుడిక కాశ్మీర్లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర ప్రభుత్వమే జవాబు దారీ. జామ్మూ, కాశ్మీర్, లఢాఖ్ ప్రాంతాలలో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం, ఉపాధి కల్పన ద్వారా వారి స్థితి గతులలో మార్పు తీసుకొచ్చి, వేర్పాటువాదుల కబంద హస్తాల నుంచి వారిని విముక్తం చెయ్యాలనేది కేంద్రం వ్యూహం.
మొత్తానికి 70 ఏళ్ళ కళంకం తుడిచిపెట్టబడింది. దేశానికి మంచి రోజులొచ్చాయని యావద్దేశం సంబరాలు చేసుకుంది. ఆ సంబరాలు శాశ్వతం కావాలంటే జమ్మూ, లఢాఖ్, కాశ్మీర్ ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి. 7 దశాబ్దాలుగా చీకట్లో మ్రగ్గిపోయిన వారికి వెలుగంటే ఏమిటో తెలియాలి. అభివృద్ధిని రుచి చూపించాలి. మిగతా దేశం కంటే 25 ఏళ్ళు వెనుకబడిపోయిన జమ్మూ, లఢాఖ్, కాశ్మీర్ ప్రజలను మిగతా దేశ ప్రజలతో సమానంగా అభివృద్ధి పరచాలి. మిగతా దేశానికి కాశ్మీర్ ని, కాశ్మీరీలను చేరువ చెయ్యాలి. ఈ సమున్నత,సుదృఢ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను చక్కబెడుతూనే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచే దిశగా వడివడిగా అడుగులు వేసింది……
2019 ఆగష్టు 5న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగిన వెంటనే జమ్మూకాశ్మీర్ సెక్రటేరియట్ తో సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను అవనతం చేసి భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి వరకూ ఆ కార్యాలయాలు, అధికారిక భవనాలన్నిటి మీదా రెండు జెండాలు ఎగురుతూ ఉండేవి. ఇహ ఇప్పుడు ఆ సంస్కృతికి చరమ గీతం పాడుతూ ప్రత్యేక జెండాను దించివేశారు.
2019 అక్టోబరు 31 నుంచి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన కూడా అధికారికంగా అమలులోకి వచ్చింది. అప్పటివరకూ గవర్నర్ పాలనలో ఉన్న జమ్ముకాశ్మీర్, లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలోకి వెళ్ళింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు ప్రాంతాల, దేశ చిత్రపటాలను విడుదల చేసింది.
అక్టోబర్ 31 నుంచి కార్గిల్, లేహ్ జిల్లాలతో కూడిన లడఖ్ ప్రాంతం ఒక కేంద్రపాలిత ప్రాంతం కాగా, ఇక మిగితా జమ్మూకాశ్మీర్ అంతా రెండో కేంద్రపాలిత ప్రాంతం అయ్యింది. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ అక్టోబర్ 30 బుధవారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత అంటే గురువారం(అక్టోబర్ 31) నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి.
పునర్విభజన..
1947 నాటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో కథువా, జమ్మూ, ఉధంపూర్, రియాసి, అనంతనాగ్, బారాముల్లా, పూంఛ్, మిర్పూర్, ముజఫరాబాద్, లేహ్, లడఖ్, గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్హాస్, ట్రైబల్ టెరిటోరీ జిల్లాలుగా ఉన్నాయి. 2019లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్విభజన చేసిన ప్రభుత్వం 14 జిల్లాలను 28 జిల్లాలుగా మార్చింది.
కుప్వారా, బందిపుర, గందర్బల్, శ్రీనగర్, బుద్గాం, పుల్వామా, షుపియాన్, కుల్గాం, రాజౌరి, రాంబన్, దొడ, కిష్టివర్, సాంబ, కార్గిల్ లు అప్పటినుంచి ఇక కొత్త జిల్లాలుగా మనుగడలోకి వచ్చాయి. లేహ్, లడఖ్ ల నుంచి కార్గిల్ జిల్లా ఏర్పడింది. జమ్మూకాశ్మీర్ పునర్విభజన ప్రకారం లేహ్ జిల్లా లడఖ్ ప్రాంతంలోనే ఉంది. గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్మాస్, ట్రైబల్ టెరిటోరి ప్రాంతాలు ఇందులోనే ఉన్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలపై త్రివర్ణ పతాక రెపరెపలు
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా రెపరెపలాడింది.
అధికార భాషలుగా కశ్మీరీ, హిందీ, డోగ్రీలు – సంస్కృత వార్తలు – సరికొత్త చిహ్నాలు
2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కాశ్మీర్ లో 19,952 మంది మాత్రమే అంటే అక్కడి జనాభాలో 0. 16 శాతం మంది ఉర్దూ మాట్లాడుతుండగా, 54.6 శాతం కాశ్మీరీ మాట్లాడుతారు. భద్రవాహి గోజ్రి, పహదీ లతో సహా 21.41 శాతం మంది హిందీ మాట్లాడుతారు. 20.6 శాతం మంది డోగ్రీ మాట్లాడుతుండగా, 1.79% మంది పంజాబీ మాట్లాడుతారు. అతితక్కువమంది మాట్లాడే ఉర్దూను, విదేశీభాష అయినా ఆంగ్లాన్ని రాష్ట్ర అధికారిక భాషలుగా చేసిన గత పాలకులు ఎక్కువమంది మాట్లాడే కశ్మీరీ , డోగ్రీ, పంజాబీ, హిందీ భాషలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాదు. కాశ్మీరంలో దూరదర్శన్ చానల్ ద్వారా “వార్తావళి” పేరుతో సంస్కృత వార్తలు ప్రసారం చేయడం నిజంగా ఒక మహాద్భుత ఘట్టమే కదా?
లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన చారిత్రాత్మక పరిణామం తర్వాత, ప్రత్యేక లడఖ్ పోలీసులు ఉనికిలోకి వచ్చారు. లే మరియు కార్గిల్ జిల్లాల్లోని పోలీసులను లడఖ్ పోలీసులని పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్ నుండి విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడిన లడఖ్ పోలీసులు కొత్త చిహ్నాలు, గుర్తు మరియు ప్రత్యేక గుర్తింపుతో ఒక జెండాను రూపొందించుకున్నారు. ఆ లోగోలో లడఖ్ గొప్పతనం ప్రతిబింబించేలా లడఖ్ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టారు. త్యాగాన్ని ప్రతిఫలించేలా రక్త సింధూర వర్ణం నేపథ్యంతో బంగారు రంగు బోర్డర్ మరియు రిబ్బన్ తో కదులుతున్న మంచు చిరుత చిత్రం లడాఖ్ పోలీసుల చిహ్నంగా రూపొందించబడింది. లోగోలో “సత్యమేవ జయతే” సూక్తి తోపాటు అశోక స్థూపం కూడా కనిపిస్తుంది.
నిర్లక్ష్యానికి తావులేదు….
దేశ రక్షణకు పెద్ద పీట వేసే ఏ ప్రభుత్వమైనా దేశంలోకి అక్రమ చొరబాట్లను ఏమాత్రమూ అనుమతించదు. అలాగే దేశంలో అశాంతిని, అలజడిని సృష్టిస్తూ దేశాన్ని రావణకాష్టంలా మారుస్తున్న ఉగ్రవాద మూకల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతుంది. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడదు. సరిహద్దుల రక్షణ, సైనికుల రక్షణే పరమావధిగా పనిచేసే ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు, అశ్రద్ధ కు, నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధతను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ రెండేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్లో మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే తేటతెల్లం చేస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్న రోహింగ్యా అక్రమ చొరబాటుదారుల ఆధార్ మరియు రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా వారికి అక్రమంగా ఆ కార్డులను జారీచేసిన ప్రభుత్వ అధికారుల పైన చర్య తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
జమ్మూ కాశ్మీర్లోని ఇస్లామిక్ తీవ్రవాదులను సమూలంగా ఏరిపారెయ్యాలనే సంకల్పంతో భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ ను ప్రారంభించాయి.
ఆపరేషన్ ఆలౌట్ ప్రభావంతో ఒకప్పుడు ఉగ్రవాదులు రొమ్ములు విరుచుకు తిరిగిన ప్రాంతాల్లో కూడా సాధారణ స్థితి నెలకొంది. సైన్యం అంతర్జాలంపై నిఘా వేయడం, సోషల్ మీడియాను కట్టడి చేయడంతో ఉగ్ర భావజాలం వల నుంచి యువత బయటపడుతోంది. అంకెలను చూస్తే సైన్యం పాత్రను శెభాష్ అనకుండా ఉండలేము.
2020లో జూన్ నాటికి కేవలం ఆ ఆరు నెలల కాలంలో 94 మంది ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. 2021లో అయితే కేవలం జూన్, జులై రెండు మాసాల్లోనే 98 మంది ముష్కరులు హతమయ్యారు. దీనిని బట్టి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఎంత ముమ్మరంగా సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండేళ్లలో అల్ బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజా, జైషే మహ్మద్ కమాండర్ ఇస్మాయిల్ లంబూ, అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ నాయకుడు జాకీర్ మూసా వారసుడు అబ్దుల్ హమీద్ లెల్హారీ, హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నయ్ కూ వంటి ఉగ్రవాదులు వందల సంఖ్యలో హతమయ్యారు. అల్ బదర్, అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ వంటి తీవ్రావాద సంస్థలు అనేకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయ్.
అలాగే యువకులు ఉగ్రవాదం వైపు వెళ్ళడం కూడా బాగా తగ్గిపోయింది. దక్షిణ కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువకులు ఉగ్రవాదంలోకి వెళ్లేవారు. వారి సంఖ్య భారీగా పడిపోయింది. 2018లో మొత్తం 220 మంది ఉగ్రవాదంలో చేరితే ఆ సంఖ్య 2019 వచ్చేసరికి 120 కు తగ్గింది. 2018లో ఎన్‌కౌంటర్లలో 254 మంది 2019లో 161 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో అత్యధికులు ఉగ్రవాదులుగా మారిన రోజులు,నెలల్లోపే హతమైపోయారు. ఈ విషయం అక్కడి యువతలోకి బలంగా వెళ్లింది.
ఉగ్రవాదం ద్వారా సాధించేదేమీ లేదనే స్పృహ విస్తృతమైంది. 2020, 2021 సంవత్సరాలలో కేవలం 10 మంది లోపే ఉగ్రవాదంలో చేరినట్లు తెలిసింది. వీరిలో శ్రీనగర్ నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాద నాయకత్వాలపై సైన్యం దృష్టిపెట్టింది. ఇటీవల ఎన్‌కౌంటర్లలో వారే ఎక్కువగా మృతి చెందారు. సైన్యం కృషి ఫలితంగా ఉగ్రఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2018లో 318 చోటుచేసుకోగా…. 2019 నాటికి ఇవి 173కు తగ్గాయి. 2020 ఫిబ్రవరి నాటికి 11 మాత్రమే నమోదయ్యాయి.
2019 తో పోలిస్తే 2020లో ఉగ్రవాదుల దాడి ఘటనలు 63.93 శాతం తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే 2019 తో పోల్చినప్పుడు భద్రతా దళాలకు 29.11 శాతానికి ప్రాణ నష్టం తగ్గినట్లుగానూ, సాధారణ ప్రజలలో అయితే 14.28 శాతానికి తగ్గినట్లుగానూ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దక్షిణ కశ్మీర్ పై భద్రతా దళాలు పూర్తిగా దృష్టిపెట్టాయి. 2019కి ముందు ఇక్కడ దాదాపు 30 మంది ఉగ్రవాదులు చురుగ్గా దాడులు నిర్వహించేవారు. కానీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పకడ్బందీగా దాడులు నిర్వహిస్తుండటంతో వీరి సంఖ్య ఇప్పుడు 3 కు పడిపోయింది.
మరోపక్క అవంతిపుర పోలీస్ డివిజన్‌లో మొత్తం 18 మంది ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. వీరంతా అభా, సంబూరు, పామ్‌పోరే ప్రాంతాల్లో నక్కినట్లు భావిస్తున్నారు. దీంతో త్రాల్ ప్రాంతంలో గతంతో పోలిస్తే ప్రశాంత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడికి కారణమైన జైషే సంస్థ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ జుల్ఫీకర్ హసన్ ఇటీవలే ధ్రువీకరించారు.
దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో మాత్రం ఉగ్ర కదలికలు కొనసాగుతున్నాయి. దాదాపు 119 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. వీరిలో 90శాతం మంది స్థానికులు కాగా.. మిగిలిన 10శాతం మంది మాత్రం విదేశీయులు.
శాటిలైట్ ఫోన్లపై నిఘాతో ఉగ్ర కార్యకలాపాలకు కట్టడి
తమ అనుపానులు దళాలకు తెలియకుండా ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లను విరివిగా వాడేవారు. దీంతో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని అడ్డుకొనే టెక్నాలజీ వినియోగించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఉగ్రవాదుల శాటిలైట్ ఫోన్ల కదలికలపై దళాలకు ఖచ్చితమైన సమాచారం లభించడం మొదలైంది. దీంతో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.
ఉగ్రవాదానికి నిధులను సమకూర్చే వారిపై కూడా భద్రతా దళాలు గట్టి నిఘా పెట్టాయి. కీలకమైన రాజకీయ నాయకులను, వారి బంధువులను కూడా లెక్కచేయకుండా అరెస్టులు చేశాయి. రాళ్లురువ్వే వారిని ఏమాత్రం ఉపేక్షించ లేదు. దీంతోపాటు లోపాయికారీగా సాయంచేసే డీఎస్పీ దవీందర్ సింగ్ వంటి వారిని కూడాఅరెస్టు చేశాయి. దీంతో ఉగ్ర నెట్‌వర్క్ బలహీనపడిపోయింది. క్షేత్రస్థాయిలో సాయం లేకపోతే తేలిగ్గా ఉగ్రవాదాన్ని అణిచివేయవచ్చనే వ్యూహాన్ని దళాలు అమలు చేస్తున్నాయి.
భారత భద్రతాదళాలు చొరబాట్లను కూడా భారీ స్థాయిలో అడ్డుకోగలుగుతున్నాయ్. 2019 లో 130 ఉగ్రవాద చొరబాట్లకు సంబంధించిన ఘటనలు జరిగాయి. 2020 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. 2021 లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ఈ అక్రమ చొరబాట్ల సంఖ్య తగ్గడంతో కశ్మీర్ వ్యాలీలో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి.
అల్లర్లు తగ్గాయి – పర్యాటకుల సందడి మొదలైంది
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయి. దాంతో 2019వ సంవత్సరంలోనే 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలి ఆరు నెలల కాలంలో 34,10,219 మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ ను సందర్శించారు. వీరిలో 12,934 మంది విదేశీయులు. ఆరునెలల్లో జమ్మూ కాశ్మీర్ కు పర్యాటక రంగం ద్వారా రూ. 25.12కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2020, 21 లలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందింది.
ఆపరేషన్ మా
దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి వారి తల్లుల ద్వారా భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చాయి. ‘ఆపరేషన్ మా’ పేరుతో ఇండియన్ ఆర్మీ 2019 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా 2019 నవంబర్ వరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం పడగ నీడను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ కుటుంబాలను చేరుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఈ పథకం కింద యువతను ఆహ్వానిస్తూ సైన్యం నిరంతరం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది.
భారత ఆర్మీలో చేరడానికి కూడా కాశ్మీరీ యువకులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. సైన్యంలో రిక్రూట్ కావడం కోసం ఎంపిక పరీక్షలకు ఎంతోమంది యువకులు హాజరయ్యారు. వారిలో నుండి 259 మంది యువకులను సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకున్నారు. భారతదేశం కోసం పోరాడేందుకు తాము సిద్ధమని చెబుతూ 259 మంది జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాన్ట్రీ బెటాలియన్ లో చేరారు. శ్రీనగర్ లోని రెజిమెంటల్ సెంటర్ లో దాదాపు ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నారు. 2021 జనవరిలో వారిని భారత ఆర్మీలో చేర్చుకునే సమయంలో జరిగిన ఈవెంట్ కు వారి కుటుంబసభ్యులు, బంధువులు అందరూ హాజరయ్యారు.
అలాగే 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న 14 మంది యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితమై స్థానిక ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రసంస్థల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిని అనంత్ నాగ్ జిల్లా పోలీసులు గుర్తించి, వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించి, వారికి అన్ని విధాలా నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులతో సైతం మాట్లాడించి వారి మనసు మార్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
పునర్వైభవం దిశగా పురోగమిస్తూ….
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణగా నిలచింది. మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవలు మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ ఏర్పాటు చేస్తోంది.
పాంగాంగ్ దక్షిణ అంచున ఉన్న మెరాక్, ఖక్టేడ్ గ్రామంలో మొట్టమొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ ప్రారంభమైంది. మెరాక్ వద్ద బి.ఎస్.ఎన్.ఎల్ టవర్ ను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాన్జిన్ ప్రారంభించారు.
ఇటీవల, చైనాతో ఉద్రిక్తతల పరిస్థితుల నడుమ తూర్పు లడఖ్‌లో సైన్యానికి మద్దతు అవసరమైనప్పుడు సరిహద్దు ప్రాంతాల గ్రామస్తులు భారత సైన్యంతో నిలబడ్డారు. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు కూడా గ్రామస్తులు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఆపరేషన్ సద్భావన వల్ల పరిస్థితులు సాధారణమైతే గ్రామస్తుల దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ఆర్మీ సమక్షంలో బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు.
మొబైల్ కనెక్టేవిటీకి కావాల్సిన అన్ని పరికరాలను బి.ఎస్.ఎన్.ఎల్ అందించింది. అలాగే చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ఈ ప్రాజెక్టుకు సౌర శక్తి వ్యవస్థను అందించారు. చుషుల్, చాంగ్తాంగ్ లలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి 2015 లోనే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీరు అభివృద్ధికి 80,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని ప్రకటించే సందర్భంలో ప్రధాని మోడీ “కేవలం ఖజానానే కాదు, మా హృదయ స్పందన కూడా జమ్మూ కాశ్మీర్ కోసమే.” అన్నారంటేనే జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి శ్రీ మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
మొదటి అడుగుగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క పంచాయితీకి 25 లక్షల చొప్పున కేటాయించింది.ఆ ప్రాంతంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఢిల్లీ – కాట్రా మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.గత రెండు సంవత్సరాలుగా, కేంద్రప్రభుత్వం జమ్మూ- కాశ్మీర్ అభివృద్ధి కోసం PRIME MINISTER DEVELOPMENT PACKAGE (PMDP) ద్వారా ఎన్నో వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.
జమ్మూ కాశ్మీర్ ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం జమ్మూ, శ్రీనగర్ లలో 2 అతిపెద్ద ఐటీ పార్కుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఒక్కొక్కటీ 500,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది.అలాగే జమ్మూకాశ్మీర్లో స్థిరాస్తి, నిర్మాణ రంగాల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు సేకరించి (ల్యాండ్ బ్యాంక్స్) వాటిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
2019 ఆగస్టు 5వ తారీఖు తర్వాత జమ్మూకాశ్మీర్లో 15000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వివిధ రంగాలకు చెందిన 40 కంపెనీలు ముందుకు వచ్చాయంటే పరిస్థితి ఎంత సానుకూలంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు.గడచిన రెండు సంవత్సరాల కాలంలో జమ్మూ కాశ్మీర్లోని అన్ని ఇళ్లలో 24 గంటల విద్యుత్ సౌకర్యం ఏర్పడడం కేంద్ర ప్రభుత్వం సాధించిన ఓ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.
ఈ రెండేళ్ల కాలంలో జాతీయస్థాయిలో 21 శాతం ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పడ్డాయి. కానీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం అది 43% గా ఉండడాన్ని బట్టి చూస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఎంత వేగంగా పురోగమిస్తున్నదో మనకు అవగతమవుతుంది. 2021 డిసెంబర్ నాటికల్లా జమ్మూ కాశ్మీర్లోని అన్ని ఇళ్లకూ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఒక్క కథువా జిల్లాలోనే వ్యవసాయ, పవర్ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం 6000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
2014 నుంచి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) కాశ్మీర్ ప్రజల విద్యుత్ అవసరాల కోసం పని చేస్తూ ఉండేది. 2019 సెప్టెంబర్ మాసంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి R.K సింగ్, అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ లు సంయుక్తంగా 15 పవర్ ప్రాజెక్ట్ లతో పాటుగా 10,000 కోట్ల రూపాయల విలువైన మరో 20 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPDCL) మరియు జమ్మూ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (JPDCL) ల ఏర్పాటుతో జమ్మూ కాశ్మీర్, విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధమయింది.
2019 నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి వంటి సౌకర్యాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కాశ్మీరీ పిల్లలు, యువతకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం వందల సంఖ్యలో పాఠశాలలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మరో 50 విద్యాసంస్థలను ఏర్పాటు చేసి 25వేల మంది విద్యార్థులకు వాటిలో ప్రవేశం కల్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఏడాదీ 5లక్షల మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ ను కూడా ప్రభుత్వం అందిస్తోంది.
PMDP నిధులతో ఒక Indian Institute of Technology [IIT], అలాగే ఒక Indian Institute of Management [IIM] లు కూడా జమ్మూకాశ్మీర్లో ఏర్పాటు కానున్నాయి. ఇక వైద్య విద్యారంగంలో 2 AIIMS, 7 సరికొత్త వైద్య కళాశాలలు, 5 నర్సింగ్ కళాశాలలు, ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణంలో ఉన్నాయి.
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో రూ. 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన కాశ్మీరీ వలసదారుల వసతి గృహాల సముదాయానికి షిప్పింగ్, జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ శంకుస్థాపన చేశారు.
50 కానల్స్ (6.25 ఎకరాలు)లో విస్తరించి ఉన్నఈ వలసదారుల గృహ సముదాయం దాదాపు 337 కుటుంబాలకు వసతి కల్పిస్తుందని భావిస్తున్నారు. వారి కోసం నిర్మిస్తున్న ఒక్కొక్క ఫ్లాట్ కు రూ .12 లక్షల రూపాయలు వ్యయమవుతున్నాయ్.
అనంతనాగ్ జిల్లాలోని మార్హమా-బిజ్‌బెహారా, గంధేర్‌బల్ జిల్లాలోని వంధమా-లార్, బారాముల్లా జిల్లాలోని ఫతేహోరా, షోపియాన్ జిల్లాలోని అల్లోపోరా-కీగామ్, బండిపోరా జిల్లాలోని ఒడినా-సుంబల్ మరియు కుప్వారా జిల్లాలోని ఖుల్లంగంలలో మొత్తం 6 చోట్ల వలసదారుల వసతి గృహ సముదాయాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ప్రధానమంత్రి అభివృద్ధి పథకం క్రింద నిర్మాణమవుతున్నాయ్. వాటిలో కొన్ని పూర్తయ్యి లబ్దిదారులకు అందజేయడం కూడా జరిగింది. ఈ ఆరు గృహ సముదాయాల మొత్తం సామర్థ్యం దాదాపు 1,680 యూనిట్లు.కేంద్ర ప్రభుత్వం 4500 మంది కాశ్మీరీ పండిట్లకు ఉద్యోగాలను కూడా కల్పించడం విశేషం.
జమ్మూ కాశ్మీర్ సమాచార, పౌర సంబంధాల శాఖ నివేదిక మేరకు పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన 55,931 మంది వలసదారులు , 2,754 మంది వాల్మీకులు మరియు 789 గూర్ఖాలతో సహా 4.1 మిలియన్ వలసదారులకు ఇప్పటివరకూ నివాస ధృవపత్రాలు జారీ అయ్యాయి. 8,75,000 మంది పహారీలు ఇప్పుడు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్నారు.
అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన 36,384 నిరాశ్రయ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5.5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. అలాగే పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చి జమ్మూకాశ్మీర్లో తలదాచుకుంటున్న 5,764 బాధిత కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 5.5 లక్షల రూపాయల చొప్పున సాయం అందింది.
2015 లో జమ్మూ కాశ్మీర్ కోసం ప్రధాని ప్రకటించిన ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద చేసిన వ్యయం 2018 జూన్‌లో 26% పెరిగింది. 2021 జూన్‌లో 62% కి పెరిగింది. జమ్మూ కాశ్మీర్ లో నిర్మాణమవుతున్న ప్రధానమైన ప్రాజెక్టులలో ప్రపంచంలోనే అత్యున్నతమైన రైల్వే వంతెన ఒకటి. ఇది 2022 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. అలాగే 8.45 కిమీ ఖాజిగుండ్-బనిహాల్ సొరంగం, 6.50 కిమీ జెడ్ మోర్ సొరంగాలు కూడా డిసెంబర్ 2023 నాటికి పూర్తి కానున్నాయి.
నమ్మలేని నిజాలు
అంతేకాదు మరో అద్భుతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ సాధించింది. జమ్మూకాశ్మీర్లో మూడు విడతలుగా ప్రశాంతంగా పంచాయతీ రాజ్ ఎన్నికలు జరగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆ ఎన్నికలలో 50 శాతం పైగా ఓటింగ్ నమోదు కావడం కూడా ఒక చెప్పుకోదగ్గ పరిణామమే. ఎందుకంటే విపరీతమైన చలి వాతావరణంలో, సర్వత్రా కరోనా భయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని అక్కడి పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ మాత్రం ఓటింగ్ శాతం నమోదు కావడం అంటే సాధారణమైన విషయమేమీ కాదు.
కాశ్మీర్ ప్రజల ఆలోచనలలో, నడవడిలో వచ్చిన మార్పుకు ఇది ఒక పెద్ద సూచన. వారు కూడా జరుగుతున్న పరిణామాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారన్నదానికి అక్కడ జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికలే ఒక పెద్ద ఉదాహరణ.కేంద్ర ప్రభుత్వ చర్యలతో జమ్మూ, లఢాఖ్, కాశ్మీర్ లలో ఎన్నో నమ్మశక్యం కాని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయ్.
నెమ్మది నెమ్మదిగా ప్రశాంతత నెలకొంది. దశాబ్దాలుగా మూత పడి ఉన్న ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం మొదలైంది. ముఖ్యంగా జమ్మూ, లఢాఖ్ ప్రాంతాలలోని హిందువులు 3,4 దశాబ్దాల అనంతరం స్వేచ్చా వాయువులు పీల్చుకున్నట్టయింది. ముస్లిములు ఎక్కువగా ఉండే శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న షితాల్ నాథ్ ఆలయం వంటివి కూడా తెరుచుకోవడం విశేషం. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదుల బెదిరింపుల వల్ల ఈ ఆలయం బలవంతంగా మూసివేయబడింది. ఆ సమయంలో ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు.
30 ఏళ్ళ క్రితం మూసివేయబడిన ఆ ఆలయాన్నితిరిగి తెరవడానికి స్థానికుల నుండి, ముఖ్యంగా ముస్లింల నుంచి కూడా అక్కడి హిందువులకు మద్దతు లభించడం ఇంకా గొప్ప విశేషం. ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు ముందుకు వచ్చారు. తాజా పరిణామాలని స్థానికులు, ముఖ్యంగా ముస్లిములు కూడా స్వాగతిస్తున్నారనడానికి పై సంఘటన ఒక ప్రబల సంకేతం.
మంచు కొండల నడుమ ఏడుకొండలవాడు
కాశ్మీర్లో TTD ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 13/6/2021 న భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్ లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం
జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా అక్కడ త్రివర్ణ శోభ కనిపించింది. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణ పతాక రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్ ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ రంగు రంగుల విద్యుద్దీపాల మధ్య త్రివర్ణం ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లాక్ టవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొత్త గడియారాలను సైతం అమర్చారు. ఇలాంటి దృశ్యం జమ్మూ కాశ్మీర్ లో మొట్టమొదటిసారిగా ఆవిష్కృతమైంది. ఈ దృశ్యం సహజంగానే ఉగ్రవాద సంస్థలకు ఉక్రోషం తెప్పించింది. కానీ చూస్తూ వుండడం మినహా వారు చెయ్యగలిగిందేమీ లేదు. చీమంత కదిలినా చెరువంత చెరుపు జరుగుతోంది వారికి. అందుకే చేతులు నలుపుకుంటూ మౌనంగా కూర్చున్నారు వారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన బుర్హాన్ వాని తండ్రి
2016 జులై 8న భద్రతా దళాల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద కమాండర్ బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వానీ ట్రాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. “ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని కార్యాలయాలలో జెండా ఆవిష్కరణ జరిగేలా చూడాలని విద్యా శాఖతో సహా అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. జమ్మూలోని అన్ని పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. అన్ని పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రధానోపాధ్యాయులందరికీ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దానిననుసరించి ట్రాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వానీ తను పనిచేస్తున్న పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పైకి సాధారణ విషయంగా కనిపించినా ఈ ఘటన అత్యంత అసాధారణమైనది. భారత ప్రభుత్వం సాధించిన ఘన విజయమిది.
భారత ప్రభుత్వం వేసిన మరో సాహసోపేతమైన ముందడుగు కూడా ఇక్కడ ప్రస్తావనార్హమైనదే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020 మే 5వ తేదీ నుంచి పీవోకే ప్రాంతాల్లో కూడా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ అవుతున్నాయ్. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది. పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్ లను కూడా జమ్మూ-కశ్మీర్ సబ్ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు పాక్ కు స్పష్టం చేస్తూ భారత ప్రభుత్వం ఈ సాహసోపేతమైన ముందడుగు వేసింది.
పరివర్తనే పరమౌషధం
చివరిగా జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా కాశ్మీర్ ప్రజల్లో వచ్చిన గణనీయమైన పరివర్తనకు మరో ఉదాహరణను ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి.
అతని పేరు నజీర్. పాతికేళ్ళ యువకుడు. అతనిప్పుడు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి 815 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్క నిర్ణయంతో తమ జీవితాలలో వెలుగులు నింపిన ప్రధాని శ్రీ నరేంద్రమోడీ దర్శనానికి. ఆయనకు తన కృతజ్ఞతలు చెప్పడానికి.
“ఇంతకుముందు, జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి నెమ్మదిగా సాగేది. కానీ ఆర్టికల్ 370, 35Aల రద్దు తర్వాత అక్కడి పరిస్థితులు మారాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం. అభివృద్ధి పనులు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో యువత మోడీ ప్రభుత్వ పనితీరుపై సంతోషంగా ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో మార్పు కనిపిస్తోంది. కశ్మీర్ లో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయి. అందుకే నేను మా ప్రియతమ ప్రధాని మోడీని కలిసి కృతజ్ఞతలు తెలుపుదామనుకున్నాను. కానీ నాకు ప్రధాని అప్పాయింట్మెంట్ దొరకదని తెలుసు. అందుకే కాలి నడకన వెళ్లాలని నిర్ణయించుకున్నాను.” అని తెలిపాడు నజీర్.
ఇదీ కాశ్మీర్ కథ. కాశ్మీర్ సాగిస్తున్న ప్రగతి కథ. మిద్దెలు, మేడలు, రహదారులు, పెద్ద పెద్ద వంతెనలు, ఆకాశహర్మ్యాలు వీటిలో మాత్రమే అభివృద్ధి లేదు. ఇప్పుడు కాశ్మీర్ లో వచ్చినట్టుగా గతి తప్పిన ప్రజల హృదయాలలో వచ్చే పరివర్తనే నిజమైన ప్రగతి. గత పాలకుల మతిమాలిన నిర్ణయాల వల్ల ఒక్క కాశ్మీర్ కే కాదు యావద్దేశానికి అనేక విధాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయ్. దేశ ప్రగతికి విఘాతాలు ఏర్పడ్డాయ్. ప్రజల మధ్య అగాథాలు ఏర్పడ్డాయ్. వైషమ్యాలేర్పడ్డాయ్. విదేశీ పెత్తనమే మేలనుకునేంతగా, మెరుగనుకునేంతగా భావ దాస్యం ఏర్పడ్డది. ఆ వికృతులన్నిటినీ ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ, ఇంటాబయటా ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ మన దేశాన్ని మనం, అవును మనమే…. పునర్నిర్మించుకోవాల్సిన, పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదు. అందుకు మనందరం సమైక్యంగా, సంఘటితంగా కృషి చేయాలి. జాతి పునర్నిర్మాణ పవిత్ర మహా కార్యంలో మనమంతా భాగస్వాములం కావాలి. భారతీయులను మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆహారపుటలవాట్లు, ఆచార వ్యవహారాలు ఏవీ వేరు చేయలేవని, భారతీయులందరూ ఒకే తల్లి భరతమాత సంతానమని యావత్ ప్రపంచానికీ చాటాలి. భారత్ మాతాకీ జై.
(vskandhra.org)