మాంగల్యం ‘తంతు’నానేనా!?

జీవితంలో
ఎందరో వస్తారు..వెళతారు..
బంధువులైనా..బిడ్డలైనా..
హితులైనా..స్నేహితులైనా…
సన్నిహితులైనా..
వచ్చేపోయే అతిధులే..!

ఎప్పుడు కలుస్తారో..
ఏ ముహూర్తాన ఒకటవుతారో..
దంపతులై..
జత అయి..స్వరజతులై..
వీడిపోని బంధమై..
వాడిపోని సుగంధమై..!

ఒకరి కోసం ఒకరై..
ఇద్దరి బ్రతుకు ఒకటై..
ఒకే మాటై..
జీవితాంతం
విడిపోని బాటై..!

తను కార్యేషు దాసి..
కరణేషు మంత్రి..
అమ్మ తర్వాత
నీ జీవితంలోకి వచ్చే దేవత..
ఆమెలాంటి మరో మాత..
నీ ఇల్లాలు..
ఆమె రాకతోనే
సరి అయ్యెను
నీ జీవితాన ఎత్తుపల్లాలు!

భరించే వాడు భర్త..
నీ జీవితానికి కర్త..
అందమైన దాంపత్య కృతికర్త
సంసార నౌకకు సారథి..
బ్రతుకు బండిని ఒడిదుడుకులు లేకుండా
నడిపే మహారధి!

మూడుముళ్లు పడినాక
ఇద్దరు కాని ఒక్కరు..
నువ్వు కాని నువ్వు ..
తను కాని అతను..
ఒకే గణమై..ఒకే గుణమై..
ఒకరికొకరు రుణమై..
ఒకే కులమై..బలమై..
ఒకరికొకరు వశమై..
పరవశమై..సర్వస్వమై..
ఎప్పటికీ కలిసి ఉండడమే
ఇంగితమై..అదే జీవితమై..!

రాముని రాజ్యంలో సీతమ్మకు అర్ధసింహాసనం..
రామయ్య మాట జవదాటని
సీతమ్మ తత్వం..
ఆమె మంచినే కాంక్షించి
అడవికి పంపిన రామతత్వం..
అదే ఆ ఆదిదంపతుల
జీవితానికి అర్థం..
పరమార్థం..!
ఏమీ లేని శివయ్య
అర్ధాంగికి తనువులోనే
అర్ధభాగమిచ్చి
అర్ధనారీశ్వరుడై..
జగతికే ఆదర్శప్రాయుడై!

పెళ్లి వినోదమై..
నాటి ప్రమాణాలు
ప్రమాణాలు కోల్పోయి
అర్థమే ఉండని ప్రయాణమై..
ప్రమోదమే లేని ప్రమాదమై..
మావిడాకులు వాడక మునుపే విడాకులా..
వద్దు వద్దు..
ఈ దుష్ట సంప్రదాయం..
భ్రష్ట సముదాయం..
మనం అనుకుంటే..
రుణం అని తలపోస్తే..
పేచీ రాజీగా మారితే..
మీ సప్తపది..
జీవిత సత్యాన్ని..
అర్థాన్ని…పరమార్థాన్ని..
దాంపత్యంలోని మాధుర్యాన్ని
బోధించే అష్టపది..
కొనసాగించు ఇష్టపడి..!

దంపతుల దినోత్సవ శుభాకాంక్షలతో..

సురేష్ కుమార్..ఇ
9948546286

 

Leave a Reply