గంజాయిలా పొగాకును నిషేధించాలి

మన వాళ్ళు, మన స్వంత మనుష్యులు చెడు వ్యసనాలకు లోనైతే ఖచ్చితంగా హెచ్చరిస్తాం, ఎందుకంటే వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు కాబట్టి, యిది మనం మనవాళ్ళనుకున్న వాళ్ళపట్ల కనబర్చే ప్రేమ, బాధ్యత. కానీ నగరంలో ఒక డాక్టర్ గత 21 సంవత్సరాలుగా చెవిని యిల్లు కట్లుకుని పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరికి సమాజం పట్ల తన వాళ్ళు అయినా కాకపోయినా తోటి మనుష్యులు పట్ల ఎంతటి బాధ్యత వహిస్తున్నారో ఈ డాక్టర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు.

ఒక వైపు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయన చేస్తున్న పోరాటం కనిపించే శతృవు మీదే ఆ శతృవు మరెవ్వరో కాదు. ఏటా దేశంలలో పది లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా యాభై లక్షల పై చిలుకు కేవలం పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారా మృత్యవాత పడుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి.

పొగాకు ఉత్పుత్తులు అనగా బీడి, చుట్ట, సిగరెట్, ఖైనీ, గుట్కా, జర్దా వంటివి. ఇవి నేరుగా వినియోగించేవారితో పాటు వారిప్రక్కన వుండే కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య సమస్యల పాలయ్యి చివరికి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఒక సిగిరెట్ తాగితే సుమారు 8 నుండీ 11 నిమిషాల ఆయుష్షు క్షీణిస్తుందని నిపుణులైన వైద్యులు చెబుతున్నారు.

సిగిరెట్ పొగలో 7000 కంటే ఎక్కువ ప్రమాదకరమైన రసాయన విషపదార్ధాలు వుంటాయి. ఇవి 69 రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. ప్రపంచంలో చైనా తరువాత పొగాకు ఉత్పత్తులను వాడుతోంది భారతదేశం. గ్లోబల్ అడల్ట్స్ టుబాకో సర్వే ప్రకారం 42.4శాతం, 14.2శాతం మహిళలు పొగాకు ఉత్పత్తుల సేవనానికి అలవాటుపడి వివిధ రకాల క్యాన్సర్లతో జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. దేశంలో నమోదైన క్యాన్సర్ కేసుల్లొ దాదాపు 30శాతం నుండీ 40శాతం వరకు నోటిక్యాన్సర్లే అని వైద్యులు తేల్చి చెప్పుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం నేడు ప్రపంచంలో 1.3 బిలియన్ల మంది ధూమపానం వంటి దుర్వసనాలకు బానిసలవుతూ మృత్యువాతపడుతున్నారు. ధూమపానం చేసేవారిలో 80శాతం అల్పాదాయ దేశాల్లో నివసిస్తున్నారు.

పొగాకు ఉత్పుత్తులువల్ల వచ్చే వ్యాధులు : సిగరెట్ తాగడం చాలామందికి ప్రక్కవారిని చూడటం ద్వారా అలవాటవుతుంది. మొదట్లో ఫ్యాషన్ గా మొదలై తరువాత దానిని ఒదులుకోలేని వ్యసనమై కూర్చుంటుంది. దీని ద్వారా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఊపిరి తిత్తుల్లో క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఆస్టియో ఆర్ద్రైటీస్, సొరియాసిస్, ఉదర క్యాన్సర్, మొదలైనవి.

మనమేం చేయాలి?
ధూమపానం వల్ల జరిగే నష్టం ప్రధానంగా వాటిని ఉపయోగించే వ్యక్తుల్లోనే కాక ప్రక్కనున్నవారికి కూడా హానికరం, కాబట్టి అటువంటి వ్యక్తులకు అవగాహన కల్పించడం చేయాలి. సిగిరెట్ బీడి చుట్ట వంటివి తాగే వ్యక్తి వాటిని తాగి పొగను గాలిలోకి వొదలడం ద్వారా ఆ కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా అనేకమంది వ్యాధుల పాలవుతున్నారు. కావున ప్రమాదం వ్యక్తులకే కాకుండా మొత్తం మానవ సమాజానికే కాబట్టి ప్రతి ఒక్కరినీ ఈ పొగాకు ఉత్పుత్తులకు వ్యతిరేకంగా మోహరింపచేయాలి. పొగాకు ఉత్పత్తులపై మానవాళి మొత్తం యుద్ధం ప్రకటించాలి.

అయితే ఈ పొగాకు ఉత్పుత్తులపై యుద్ధానికి సిద్ధమయ్యింది మొదటిగా డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు అని చెప్పాలి. సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో 1989లో డెంటల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగేశ్వరరావు వృత్తిలో అడుగుపెట్టిన నాడే పోగాకు ఉత్పత్తులపై యుద్ధాన్ని ప్రకటించారు.

dr-nageswar-rao

ఆనాటి నుండీ నేటి వరకూ తను విశ్వసించిన మార్గాన్ని వదలి ప్రక్కకు రాలేదు. రెండు దశాబ్ధాలకు పైగా ఆయన అలుపెరుగకుండా ఈ పోరాటం చేస్తూనే వున్నారు. ప్రభుత్వాలకు చిత్త శుద్ధి వుంటే పొగాకు ఉత్పత్తులపై పొగ త్రాగుట నేరం వంటి హెచ్చరికలు వేయించి చేతులు దులుపుకోవడం కాదు. అసలు పొగాకు పంటనే వాణిజ్య పంటల జాబితా నుండీ తొలగించాలనేది డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు ప్రధాన డిమాండ్. ఒకప్రక్క పొగాకు పండించడానికి ప్రోత్సాహకాలను యిస్తూ కేవలం సిగిరెట్ బీడీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలు ముద్రించడం ద్వారా ఒరిగే ఫలితం శూన్యమని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు ఈ డాక్టర్.
అమ్మకాలను నిషేదించడమే కాదు. పొగాకు ఉత్పత్తులకు కారణమయిన పొగాకు పంటనే పండించకుండా రైతులను నిరుత్సాహపరచాలనే వీరి ప్రధాన ఆశయం. ఇంత కాలంగా బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పొగాకు ఉత్పత్తులపై సమరశంఖం పూరించిన మరో డాక్టర్ లేరంటే అతిశయోక్తి కాదు. గాంధీ హాస్పిటల్ లో పనిచేసే రోజుల్లోనే సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ విద్యార్ధినులు మొదలు అనేక ఫ్రీ డెంటల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా మాటలు చెప్పడమే కాదు ఆచరించి చూపించడం ద్వారా అనేకమందికి ఆయన ఆదర్శప్రాయులుగా నిలిచారు.

నోటి ఆరోగ్యమే మహా ఆరోగ్యం అంటూ డెంటల్ డాక్టర్ గా సరికొత్త యంనినాదంతో నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఎటువంటి ఉద్యమ నేపధ్యం లేదు కానీ వీరు చేసిన పోరాటాలు తన కొసం కొన్ని పేజీల చరిత్రను సృష్టించారు ఈ డాక్టర్. నగరంలో ఎంతో ప్రాధాన్యత వున్న గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ నుండీ ప్రస్తుతం వున్న చోటుకు మారడానికి ప్రభుత్వాలతో అక్కడి డాక్టర్లు సిబ్బంది ఒక తరహా యుద్ధమే చేశారు.

అటువంటి మహా పోరాటంలో డాక్టర్ నాగేశ్వరరావు పాత్ర ఒకరకంగా ప్రధానమయింది. ఆ ఉద్యమంలో డాక్టర్ నాగేశ్వరరావు ముందుండి పోరాడారు విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతోనూ వీరు అలుపెరుగని పోరాటం చేసారు. తన ముందు వెనుక ఎవరున్నారో లేదో చూసుకొని ఉద్యమాలు చేయడం వీరికి తెలియదు. తనకు ఎదురుగా నిలిచిన ప్రత్యర్ధి ఎవరనేది కూడా ఆయన ఆలోచించరు, ఒక మంచి కారణం కోసం పోరాటం చేయాలనే ఏకైక లక్ష్యమే తనను నిర్భయంగా ముందుకు నడిపించే శక్తి అని ఆయన వివరించారు.
వాస్తవానికి అందరు డాక్టర్ల లా వీరూ 2010 వరకు మే 31 నాడు వరల్డ్ నో టుబాకో డే గా పాటించారు. కానీ ఇంత పెద్ద భూతంపై పోరాటానికి ఒక్క రోజు నో టుబాకో డే గా పాటిస్తే సరిపోదని, 2011 నుండీ మే 1 నుండీ 31 వరకూ అంటే పూర్తిగా మే నెల మొత్తాన్ని నో టుబాకో మంత్ గా ప్రకటించి అనేక క్యాంపులు నిర్వహిస్తూ ప్రజల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని తపిస్తున్నారు.

ప్రపంచంలో ఏ దేశంలోనైనా నో టుబాకో మంత్ పాటిస్తున్న డాక్టర్లు కానీ ప్రభుత్వాలు కానీ వున్నాయో లేవో తెలియదు కాని ఈ డాక్టర్ మాత్రం ప్రభుత్వాలు కూడా చేయలేని కార్యక్రమాలను భుజాన మోస్తూ మే నెల మొత్తాన్ని నో టుబాకో మంత్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలకే ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి వుంటే మొదటిగా చివరిగా చేయవలసింది, పొగాకు పంటను గంజా పంట వలే నిషేధించాలని కోరుతున్నారు. గత 20 సంవత్సరాలుగా వీరితో పాటు ఆరోగ్య శిబిరాలు అవగాహానా కార్యక్రమాల్లో డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ గా డాక్టర్ కుసుమ భోగరాజు సహకారం మరువలేనిదని డాక్టర్ ఓ.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ డాక్టర్ ఆలోచన ఆశయం నెరవేరి పొగాకు పంటను ప్రభుత్వాలు నిషేదించాలని ఆశిద్దాం.

(మే 31 నో టుబాకో డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం)