Suryaa.co.in

Telangana

దవాఖానలకు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?

– పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానల్లో ఎందుకు ఓపీ పడిపోయింది?
– పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫైఫల్యం పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానల పనితీరు దుర్బరంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానల్లో ఎందుకు ఓపీ పడిపోయింది? పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజల సుస్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొడిగే, ఆ దవాఖానలకే సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.

పట్టణ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దవాఖానలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమొక్కు లేక మూతబడటం దురదృష్టకరం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ సహా రాష్ట్రవ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ఇదేవిధంగా గ్రామాల్లో పల్లె దవాఖానలు ప్రారంభించింది.

15వ ఆర్థిక సంఘం ప్రశంసలను సైతం మన బస్తీ దవాఖానలు అందుకున్నాయి. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. రోగనిర్ధారణ పరీక్షల భారం కూడా పేదలపై లేకుండా ఉండాలని టి డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి, 134 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు పేద ప్రజలకు అందించింది.

బీఆర్ఎస్ హయాంలో అద్భుతంగా పని చేసిన పల్లె, బస్తీ దవాఖానలు, టి డయాగ్నోస్టిక్ సెంటర్లు కాంగ్రెస్ హయాంలో ప్రజాదరణ కోల్పోతున్నాయి. 14 నెలలు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం, వైద్యాధికారుల అలసత్వం పేద ప్రజలకు శాపంగా మారుతున్నది.

దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తున్నది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాల్సిన బస్తీ దవాఖానలు మధ్యాహ్నం వరకే మూతబడుతున్నాయి. వైద్యులు సమయానికి రాకపోవడం వల్ల, బస్తీ దవాఖానకు వచ్చే రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు. వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి.

కొన్ని చోట్ల వారానికి ఒకసారే వైద్యుడు వస్తుండటంతో ఓపీ గణనీయంగా పడిపోయింది. ఆదివారం బస్తీ దవాఖానలు సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, వైద్య సిబ్బంది రావడం లేదు. దీంతో దవాఖానలు తాళం వేసి ఉంటున్నాయి. టి డయాగ్నోస్టిక్ ద్వారా బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు టెస్టులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

కొన్ని చోట్ల ల్యాబ్ టెక్నీషియన్ లేక, మరికొన్ని చోట్ల సర్వర్ సమస్యల వల్ల ఉచిత పరీక్షలు పేదలకు అందటం లేదు. బస్తీ దవాఖానల్లో మందులు కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ మెడిసిన్స్ సరఫరా జరగటం లేదు. సిబ్బంది కొరత వేదిస్తుండగా, వేతనాలు సకాలంలో అందక వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇలా సమస్యల వలయంలో బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కొట్టుమిట్టాడుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలకు వైద్య సేవలు అందించడం అనేది ఈ ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో లేకపోవడం శోచనీయం.

ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి ఇప్పటికైనా పల్లె, బస్తీ దవాఖాన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సమస్యలను పరిష్కరించి, పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE