రాష్ట్ర బీజేపీ ఏం చేస్తున్నది?: కేసీఆర్

రాష్ట్రాన్ని కొత్తగ తెచ్చుకున్నం. ఎందుకులే కేంద్రంతో ఘర్షణ వాతావరణం అని పద్ధతిగా రాష్ర్టాన్ని సెటిల్‌ చేసుకుందామని ఉన్నం. సంయమనం, ఓపిక పట్టి కేంద్రం సహకరించకున్నా పని చేసుకుంటున్నం. కేంద్రం ఐదేండ్లు హైకోర్టును విభజన చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏం కారణం చేత చేయలేదు? మీది అసమర్థ ప్రభుత్వం కాదా? రాష్ట్రం వస్తది.. రాష్ట్రానికి నీళ్ల వాటా రావాలి అని మేం అడిగినం. సెక్షన్‌ 3 కింద ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేయండి, మాకు నీళ్ల వాటా తేల్చాలి అని చెప్పినం.
ఈ రోజుకూ తేల్చరు. ఏం కారణం మీ అసమర్థతనా, మీ అవివేకమా, మీ చేతగానితనమా? అది చేతగాదు మీకు. బీఆర్‌జీఎస్‌ కింద రూ.450 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాది లేదు. నవోదయ పాఠశాలల గురించి ప్రధానికి ఇప్పటి వరకు నేను 50 దరఖాస్తులు ఇచ్చిన. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరాలి అని చట్టం ఉన్నది.
చట్టప్రకారం మీరు కొత్త జిల్లాలకు ఇవ్వాలి.. అది ధర్మం అని చెప్పి అడిగిన. ఒక్కటి కూడా ఇవ్వలేదు. 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఎక్కడ పోయారు ఈ బీజేపీ నాయకులు? ఇక్కడి నుంచి ఉన్న కేంద్రమంత్రి ఏం చేస్తున్నడు? ఇక్కడ నుంచి ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నరు? వాట్‌ ఈజ్‌ యువర్‌ ఆన్సర్‌. మొదలు దీనికి సమాధానం చెప్పు.
కరీంనగర్‌లో గెలిచి ఒక్క రూపాయి పని చేసిండా!
ఒకటే మాట రైతాంగం అర్థం చేసుకోవాలె. ఏడేండ్లలో దేశంలోనే ఎక్కడా లేని సదుపాయాలు తెలంగాణలో ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? మిషన్‌ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నయి చెరువులు. పోయిన సంవత్సరం అన్ని వర్షాలు పడినా.. ఒక్క చెరువు తెగలేదు. ఈ సంవత్సరం కూడా అంతే. బోర్లన్నీ మోటర్లు పెట్టకుండానే పోస్తున్నయి కదా. ఊటలు పెట్టినయి కదా. ఇంత అద్భుతాన్ని సృష్టించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.
చిల్లర రాజకీయాల కోసం మీరు వడ్లు పండిస్తే, రోడ్లమీద కూర్చోబెట్టి ధర్నాలు చేయించాలనే పరిస్థితిలో వాళ్లు మాట్లాడుతున్నరు. ఈ అల్లాటప్పాగాళ్లు, పనికిమాలినోళ్లు, రాష్ర్టానికి ఒక్క పదిరూపాయల పని చేయనివాళ్లు వీళ్లు. కరీంనగర్‌ నుంచి గెలిచిన ఈ మనిషి ఒక్క రూపాయి పనిచేసిండా? ఒక్క మెడికల్‌ కాలేజీ తెచ్చిండా? ఆయనకు ఇంగ్లిష్‌, హిందీ వస్తదా? ఢిల్లీల ఏం మాట్లడతరో తెలుస్తదా? ప్రభుత్వ లెటర్లు అర్థమైతయా? దేశాన్ని పాలించే పార్టీ ప్రెసిడెంట్‌గా ఈ లెటర్లను ఎప్పుడన్న చూసినవా? ఈ దుర్మార్గుడు బాధ్యతారహితంగా తెలంగాణ ప్రాజక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లెటర్‌ రాసిండు. ప్రకాశ్‌ జవదేకర్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన లెటర్‌ ఇచ్చిండని ఆయనే నాకు చెప్పిండు.