జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపి న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తున్నారని, మొన్న దళితులు, నిన్న మహిళలు నేడు విద్యార్థుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్ను పడిందని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు.
అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ కళాశాల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద ఖాకీలను ఊసుగొల్పి రక్తం వచ్చేలా కొట్టించటం ఆక్షేపనీయమని, ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా నేరమా, ఇదెక్కడి నియంత పాలన అని ఆయన ప్రశ్నించారు. గాయపడిన విద్యార్థులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులను కఠినంగా శిక్షించాలని నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలను వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ,లేకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న భావన సామాన్య ప్రజలకు సైతం కలుగుతుందని, జీవితకాలం మీ ఆటలు సాగవని, ప్రజలు తగిన రీతీలో బుద్ధిచెప్పే రోజు అతి త్వరలో ఉందన్న విషయాన్నిరాష్ట్రప్రభుత్వం గ్రహిస్తే మంచిదని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నరేంద్ర కుమార్ హెచ్చరించారు.