– మరదలిపై వేధింపులు నిజమేనా?
– నారాయణపై కేసు పెట్టిన మరదలు కృష్ణప్రియ
– మరదలి వీడియోలకు బోలెడు సానుభూతి
– సోషల్‌మీడియాలో ధూమ్‌ధామ్
– వీడియోలో వినిపించని లైంగిక వేధింపుల మాట
– పిట్ట-డేగ పదాలకే పరిమితం
– పోలీసుల ఫిర్యాదులో మాత్రం లైంగికవేధింపు పదాలు
– ఇది నారాయణ ఇమేజీకి భారీ డ్యామేజీనే
– రచ్చ కెక్కిన కుటుంబ కలహాలతో అప్రతిష్ఠ
– మరదలికి మతిభ్రమణమా? లేక డిప్రెషనా?
– వైద్యపరంగా రెండింటికీ బోలెడు తేడా
– వేధిస్తే కోల్‌కతా బ్రాంచికి ఎండీని ఎలా చేస్తారు?
– మానసిక స్థితి బాగోలేని వ్యక్తికి ఎండీ పదవి ఎలా ఇస్తారు?
– ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బావపై కేసులా?
– ఇన్నేళ్ల మౌనం వెనుక మర్మమేమిటి?
– నారాయణ మీడియా ముందుకు రాకపోవడానికి కారణమేమిటి?
– ప్రియ కుటుంబసభ్యులు మీడియా ముందుకు రావడం లేదెందుకు?
– ఫిర్యాదు వెనుక రాజకీయ హస్తాలున్నాయా?
– నారాయణపై రాజకీయ యుద్ధం మొదలైందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
మాజీ మంత్రి నారాయణ హటాత్తుగా తనకు ఎదురైన ‘వ్యక్తిత్వ హననం’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కుటుంబ కలహాలు నారాయణ మాస్టారి ఇమేజీని భారీగా డ్యామేజీ చేస్తున్నాయి. మొన్నటివరకూ ధీమాగా తలెత్తుకుని తిరిగిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఇప్పుడు బయటకు వచ్చేందుకే ముఖం చెల్లని దుయనీయం. ఫోన్లు సిచ్చాఫ్ చేసిన దుస్థితి. ఆయన ‘వ్యక్తిగత వ్యవహారం’ బాగా తెలిసిన వారికి, తాజాగా మరదలి రూపంలో ఎదురయిన పోలీసు కేసు, షాక్ కలిగించకపోయినా.. బయటవారికి మాత్రం విస్మయం కలిగించింది. స్వయంగా తమ్ముడి భార్యనే.. తనపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ పెట్టిన పోలీసు కేసు, నారాయణను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేసేదే.
నెల్లూరు టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత.. తెరపైకొచ్చిన ఈ కొత్త కథ వెనుక, రాజకీయ ప్రత్యర్ధుల హస్తం ఉందా? ఇన్నేళ్లూ బావ వేధింపులపై పెదవి విప్పని మరదలు, ఇప్పుడే పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడం ఏమిటి? ఒక రాష్ట్రానికి నారాయణ సంస్థల ఎండీగా ఉన్నప్పుడు బయటకు రాని వేధింపులు,
ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చాయి? ‘నారాయణ బావ’, తనపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. తన తొలి రెండు వీడియోల్లో నేరుగా చెప్పని మరదలు, పోలీసుస్టేషన్‌లో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడం వెనుక మతలబేమిటి? పిట్ట,గద్ద కథలు చెప్పిన మరదలు.. పోలీసులకు మాత్రం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఫిర్యాదు చేయడం వెనుక లక్ష్యమేమిటి?
అసలు నారాయణ మరదలు కృష్ణప్రియ ఆయనపై చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అబద్ధమెంత? నారాయణ కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు ఆమెకు మతిభ్రమణమా? డిప్రెషనా? రెండూ వేర్వేరు కదా? ఇంత జరుగుతున్నా ప్రియ కుటుంబసభ్యులు మీడియా ముందుకు రాకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? నారాయణ విద్యాసంస్థల అధిపతి చుట్టూ అసలేం జరుగుతోంది? ఇదీ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్.
‘‘ నారాయణ స్త్రీలోలుడు. నారాయణ కాలేజీలో పనిచేసే మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. 29 ఏళ్లుగా నన్ను నా భర్త సుబ్రమణ్యం, ఆయన అన్న నారాయణ లైంగిక వేధింపులకు పాల్పడేవారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను నా అనుభవాలు పోస్టు చేస్తే, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మూసేశారు. నారాయణ నన్ను 29 ఏళ్ల నుంచి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను ప్రతిఘటించడంతో నన్ను అనేక సార్లు కొట్టాడు. నాకు మానసిక సమస్య ఉన్నట్లు నా భర్త చెప్పడం బాధించింది. నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్ శేషమ్మ నుంచి, మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడం పెద్ద సమస్యకాదు. నారాయణ పిల్లలకు మానసిక సమస్యలున్నాయి. నేను మానసిక సమస్యలతోనే నిద్రమాత్రలు వేసుకుంటున్నా. నా భర్త-నారాయణకు రక్తసంబంధం ఉంది కాబట్టే, ఆయనకు నా భర్త పెట్‌గా మారాడు’’
– ఇది హైదరాబాద్ రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో.. నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు సారాంశం.
‘‘నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాలపై మాట్లాడతా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కులేకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నాకు డబ్బులివ్వరు. నా ట్రీట్‌మెంట్‌కు నా ఆస్తులు ఆమ్ముకుంటా. చచ్చేలోపు నిజాలు చెబుతా’’
– ఇవి ఒక వీడియోలో కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు.
వరస వెంట వెంట కృష్ణప్రియ విడుదల చేస్తున్న వీడియోలు.. సహజంగానే రాజకీయ, సామాజికవర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. క్యాన్సర్ పేషెంట్ అయిన కృష్ణప్రియ చెప్పిన మాటల్లో నిజమెంత?
అబద్ధమెంత అన్నది పక్కనపెడితే.. నెటిజన్లు మాత్రం ఆమెకు సానుభూతి ప్రకటిస్తుండటం ప్రస్తావనార్హం.
మేమంతా దన్నుగా ఉన్నామంటూ, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రియకు బాసటగా నిలవడం మరో విశేషం. ఈ మొత్తం వ్యవహారంలో.. నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ ఇప్పటిదాకా కష్టపడి సాధించుకున్న పరువు.. మూడు వీడియోలతో ఒక్కసారిగా కొండెక్కినట్లు స్పష్టమవుతోంది.
దీనితో కృష్ణప్రియ భర్త సుబ్రమణ్యం తెరపైకి వచ్చి చేసిన ప్రకటన, ఈ ఎపిసోడ్‌ను కొత్త మలుపు తిప్పింది. ‘‘నా భార్య ప్రియ మానసిక పరిస్థితి బాగోలేదు. అందుకే అలా మాట్లాడుతోంది. మీరు వాటిని పట్టించుకోకండి’’ అంటూ డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లు చూపిస్తూ, వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. స్వయంగా భర్త .. తన భార్య మానసిక పరిస్థితి గురించి వివరించడంతో, అప్పటివరకూ కృష్ణప్రియను సమర్ధించిన వారిలో సహజంగా సందిగ్థం మొదలయింది. కృష్ణప్రియ విడుదల చేసిన వీడియోలలో విశ్వసనీయత లేదన్న అనుమానం భర్త విడుదల చేసిన వీడియో రేకెత్తించింది.
అయితే ఆయన చూపించిన ప్రిస్కిప్షన్‌లో. డిప్రెషన్ అని స్పష్టంగా కనిపించడంతో , ఆయన మాటలపై కూడా సహజంగా సందేహాలు రేగాయి. మతిస్థిమితం లేకపోవడానికి, ఒత్తిళ్లకు తేడా ఉందని వైద్యులు చెబుతుంటారు. ఇది ఆమె భర్తను, అనుమానితుడిగా చూడటానికి ఒక కారణంగా కనిపిస్తోంది.
ఫలితంగా అనేక సందేహాలు తెరపైకి వచ్చాయి. కృష్ణప్రియ తన బావ నారాయణ, భర్త సుబ్రమణ్యంపై ఆరోపణలు చేస్తూ, వీడియోలు విడుదల చేసి, మీడియాతో మాట్లాడారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమె కుటుంబసభ్యులెవరూ.. ఇప్పటిదాకా బయటకు వచ్చి, వాస్తవాలేమిటో చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక కోల్‌కత్తా నారాయణ బ్రాంచికి ఎండీగా ఉన్న ప్రియ.. ఆ సమయంలో తనపై వేధింపుల గురించి ఎందుకు బయటపెట్టలేదు? నారాయణ అంతగా ఆమెను హింసిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడితే, అంత కీలకమైన పదవి ఆమెకు ఎందుకు ఇస్తారు?
ప్రియ భర్త మణి చెప్పినట్లు.. ఆమె మానసిక పరిస్థితి 2017 నుంచి బాగలేకపోతే, పశ్చిమబెంగాల్ విభాగానికి ఆమెను ఎండిగా ఎందుకు నియమించారన్నది మరో ప్రశ్న. మానసిక రోగి, అంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్ధను ఎలా నిర్వహిస్తారన్నది ఇంకో ప్రశ్న. ప్రియ మొదటి వీడియో పెట్టినప్పుడు నారాయణ కుటుంబసభ్యులు ఎందుకు స్పందించలేదు? 2016లో ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. తాజా వీడియో వైరల్ తర్వాత మాత్రమే, దానిని ఎందుకు ప్రైవేట్ చేశారన్నది ఇంకో ప్రశ్న.
వీడియోలలో మాట్లాడిన ప్రియ.. తనపై జరిగిన చిత్రహింసలు గురించి నవ్వుతూనే చెప్పడం, మరో గందరగోళానికి కారణం. బాధితులెవరైనా ఆ విధంగా నవ్వుతూ, తమ బాధలు చెప్పరన్నది ఆమె మాటలు
నమ్మని వారి వాదన. బహుశా అందుకే ఆమె.. ఇకపై తాను ఏడుస్తూ వీడియోలో మాట్లాడతానని చెప్పడం చూస్తే, ఆమె మానసిక పరిస్థితిపై అనుమానాలు కలగడం సహజం.
తనపై సొంత మరదలు చేసిన ఆరోపణలపై, నారాయణ కూడా ఇప్పటిదాకా నేరుగా స్పందించకపోవడం మరో ఆశ్చర్యం. మరదలు తన క్యారక్టర్‌పై ప్రపంచానికి తెలిసేలా బురద చల్లితే.. అవి తప్పని ఇప్పటివరకూ నారాయణ మీడియా ముందుకు రాకుండా, ఫోన్ స్విచ్చాఫ్ చేయడం ఆశ్చర్యం. తన మౌనం.. తన పార్టీకీ నష్టం కలిగిస్తుందన్న ముందుచూపు కూడా లేకపోవడం ఆశ్చర్యం. నారాయణ మౌనం, మరిన్ని అనుమానాలు, విమర్శలకు కారణమవుతోంది.
ఈలోగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి, నారాయణపై ట్వీట్ల మీద ట్వీట్లు సంధించడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ‘‘ పిచ్చితనానికి, డిప్రెషన్‌కు తేడా ఉంటుంది. ప్రియ భర్త చూపిన వీడియోలో ప్రిస్కిప్షన్‌లో డిప్రెషన్ అని ఉంటే, దానిని మ్యాడ్‌నెస్ అని చెబుతున్నారు. ఆ మహిళపై అన్న చేస్తున్న అకృత్యాన్ని, తమ్ముడు సమర్థిస్తున్నాడంటే పతనం ప్రారంభమైనట్లే’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయినా ఇప్పటివరకూ విజయసాయిరెడ్డి ఆరోపణలను నారాయణ ఖండించకపోవడం ఆశ్చర్యం.
ఈవిధంగా నారాయణ మరదలు కృష్ణప్రియ, ఆయనపై చేసిన ఆరోపణల్లో కొన్ని హేతుబద్ధంగా.. మరికొన్ని అసంబద్ధంగా, అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కృష్ణప్రియ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మీడియా ముందుకొస్తుంటే.. నారాయణ, ఆయన తమ్ముడు మణి మాత్రం ఇప్పటిదాకా మీడియా ముందుకురాకపోవడమే ఆశ్చర్యం. అయితే ఇప్పటిదాకా కృష్ణప్రియ ఫిర్యాదుపై, రాయదుర్గం పోలీసులు ఇంకా కేసు నమోదు చేయకపోవడం ప్రస్తావనార్హం.