Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి శ్రీనివాస్‌ కలిస్తే తప్పేంటి?

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైయస్సార్‌సీపీ ఆందోళన కార్యక్రమం వాయిదా
– జనవరి 3కు బదులుగా జనవరి 29న ఫీజు బకాయిలపై పోరుబాట
– విద్యార్థుల పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నాం
– ఎంపీడీఓ పై దాడి జరిగిందని పవన్‌ పరామర్శించారు
– అదే జిల్లాలో టీడీపీ నేతల దాడిలో వీఆర్వో తల పగిలింది
– ఆయన్ను కూడా పవన్‌ పరామర్శిస్తే బాగుండేది
– విశాఖపట్నం క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కలవడంపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను గతంలో లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు
ఈ వివాదాన్ని çసృష్టించిన వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ అనుకూల ఛానల్‌లో ఈ వార్త వచ్చిందన్న బొత్స.. మంత్రి శ్రీనివాస్‌ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైయస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిందన్న బొత్స… విద్యార్ధుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29 నాటికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే దాదాపు రూ.74 వేల కోట్లు అప్పు చేసిందన్న బొత్స.. అవీ కాకుండా మార్క్‌ ఫెడ్, సివిల్‌ సఫ్లైస్, ఏపీఎండీసి వంటి కార్పొరేషన్ల నుంచి కూడా అప్పులు చేస్తున్నారని వెల్లడించారు. వీటికి అదనంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15 వేల కోట్ల అప్పులు కలుపుకుంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆరోజు వైయస్సార్‌సీపీ అప్పులు చేసినా, అందులో కీలక భాగం ప్రజలకు పంచిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా ఆ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్‌ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోగా, యూనిట్‌ విద్యుత్‌కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్‌ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా గతంలో దశల వారీగా ఇచ్చే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల రిజిష్ట్రేషన్లు కూడా నిలిపివేశారని ఆక్షేపించారు.. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుందని నిలదీసిన బొత్స సత్యనారాయణ, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? అని ప్రశ్నించారు.

కనీసం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన డబ్బులైనా ప్రభుత్వం చెల్లించి ఉంటే.. సామాన్యులకు ట్రూఅప్‌ ఛార్జీల మోత తగ్గేదని చెప్పారు. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో వినియోగదారుడి మీద రూ.2 వేల నుంచి రూ.3 వేల భారం పడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడని నిలదీశారు.

ధాన్యం కొనుగోళ్లులోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని బొత్స గుర్తు చేశారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే.. తేమ శాతం ఎక్కువగా ఉందని.. 20 శాతం వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌ హల్చల్‌ చేయడంపై బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్‌కళ్యాణ్‌ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్‌గారి ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు.

డీజీపీ అన్నా, ఆ పదవి అన్నా తనకు చాలా గౌరవమన్న మాజీ మంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నారని, అందుకే తాము ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.

ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్‌ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు.

సినీ హీరోలను జగన్‌ నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమన్న మాజీ మంత్రి, తనను సీఎం వైయస్‌ జగన్, ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE