– మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు, గట్టు రామచంద్రరావు, తీగల కృష్ణారెడ్డికి చాన్స్?
– గుత్తాకు రెన్యువల్ ?
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని వర్గాలతో సత్సంబంధాలున్న మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావుకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం లభించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ ఆయనకు ఎలాంటి పదవి లభించకపోయినా, పార్టీ అప్పగించిన అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారు. టీడీపీ హయాంలో కరీంనగర్ జిల్లాలో కీలకనేతగా ఉన్న ఆయనకు, అజాత శత్రువుగా అన్ని వర్గాల మద్దతు ఉండటం విశేషం.
అదే విధంగా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీసీ నేత గట్టు రామచందర్‌రావుకూ ఎమ్మెల్సీ అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మీడియా చర్చలతోపాటు, ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సమన్వయ కర్తగా వ్యవహరించిన ఆయనకు వివిధ అంశాలపై గట్టి పట్టుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గట్టుకు కేసీఆర్‌కు విధేయుడు.
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆయన సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోగా, ఆమె టీఆర్‌ఎస్‌లో చేరడంతో తీగల కృష్ణారెడ్డి మాజీగానే మిగిలిపోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు దశాబ్దాల నుంచి సన్నిహితంగా ఉన్న తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఎమ్మెల్సీ పదవికి వినిపిస్తోంది.
తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు… చట్టసభలో ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉండొచ్చు. అయితే పదవీయోగం కలిగిన ఆ ఆరుగురు టీఆర్‌ఎస్‌లో ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగిసి..తాజా మాజీలుగా మారిన వారిలో మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యసాగర్‌రావులు ఉన్నారు. పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితలు సైతం మాజీలయ్యారు. ఈ ఆరుగురిలో రెన్యువల్ ఎంతమందికి అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఒకరిఇద్దరికి మరోసారి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. పేర్లు బయటకు రావడం లేదు. ఆ ఇద్దరి పేర్లు చర్చల్లో బలంగా వినిపిస్తున్నా.. చివరి వరకు సస్పెన్సే. గుత్తా పేరు మాత్రం రేస్‌లో ముందుంది.
ఎమ్మెల్యే కోటాలోని ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎప్పుడో నోటిఫికేషన్ రావాలి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈసీ ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో.. గులాబీ దళపతి నుంచి ఎమ్మెల్సీ హామీ పొందిన వారు ఆశగా ప్రగతిభవన్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పార్టీలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన వారిలో పనితీరు.. సామాజిక సమీకరణాలు.. జిల్లాలను దృష్టిలో పెట్టుకుని పిలుస్తారని అనుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వడపోతలు ఉంటాయని సమాచారం.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. చాలా మందికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వారంతా ఇదిగో అదిగో అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఖాళీ సీట్లు ఆరు ఉంటే.. అంతకు మూడు నాలుగింతలు మంది క్యూలో ఉన్నారు. ఈ దఫా తప్పక ఎమ్మెల్సీని చేస్తారని పార్టీ నేతలు ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి లేదు. పిలుపు వచ్చే వరకు ఉత్కంఠే. అందుకే పార్టీలో పెద్దలకు సన్నిహితంగా ఉండే నాయకుల దగ్గర ఆరా తీస్తున్నారట ఆశావహులు.