వైకాపాకు 300కోట్ల ఎలక్టోలర్ బాండ్స్ ఇచ్చింది ఎవరు? మా పార్టీకి వచ్చిన 600 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ నిగ్గు తేల్చాలి
– జాతీయ పార్టీ కాంగ్రెస్ కు 10 కోట్ల రూపాయల ఎలక్టోలర్ బాండ్స్ ఇస్తే… వైకాపాకు 300 కోట్లా?… ప్రూడెన్షియల్ ఎలక్టోరల్ బాండ్స్ లో మా పార్టీ కి నిధులు ఇవ్వడానికి ఇన్వెస్ట్ చేసిన మహానుభావుడు ఎవరు?
తెదేపాకు వచ్చిన 27 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఇంత రాద్ధాంతమా?
బెయిల్ పిటిషన్ పై వారం రోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి… బెయిల్ ఇస్తారా?, కొట్టివేస్తారా?? అన్నది న్యాయమూర్తి విచక్షణాధికారం
వారం రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల ఖాయం
మూడు నెలల పాటు జైలులోనే ఉంటాడని పందెం కాస్తున్న ఒక సామాజిక వర్గానికి చెందిన కడప జిల్లా పందెం రాయుళ్లకు ఇదే నా సవాల్
ప్రభుత్వ సర్టిఫికెట్లపై నవరత్నాలతో పాటు ముద్రిస్తున్న ముఖ్యమంత్రి ఫొటోను తొలగించాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతాను
కొత్త ప్రభుత్వం ఏర్పడి సర్టిఫికెట్లు మంజూరు చేశాక… ఈ ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లను సామూహికంగా దహనం చేద్దాం
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పొడిగిస్తారా?, హైకోర్టులో అజయ్ కల్లం పిటిషన్ కొట్టి వేస్తే… దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది
వైఎస్ వివేక హత్య కేసులో ఇంకెవరు పాత్రధారులు… ఒంటరిగానా? జంటగానా? అన్నది చూడాలి
71 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తెదేపాకు వచ్చిన 27 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కాం ద్వారా వచ్చినవేనని సిఐడి తరఫున వాదనలను వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తున్న వాదన విచిత్రంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు.. 2017లో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధులలో పారదర్శకత ఉండాలని ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది.. 2000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వాలంటే ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారానే ఇవ్వాలని పార్లమెంట్లో ఆమోదించి చట్టం చేసింది.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 17 నుంచి 18 వేల కోట్ల రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా స్వీకరించాయని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెదేపా కు వచ్చిన 27 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి రాద్ధాంతం చేస్తున్న వారు, వైకాపాకు ఒకే సంవత్సరంలో ఒకసారి 20 కోట్లు, మరొకసారి వచ్చిన 300 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఎందుకు చర్చించడం లేదు.
వైకాపాకు మొత్తం 600 కోట్ల రూపాయల నిధులు ఎలక్టోరల్ బాండ్స్ రూపం లో నిధులు సమకూరాయి. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కు కేవలం 10 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరితే, ప్రాంతీయ పార్టీ అయినా వైకాపాకు 300 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. మా పార్టీకి నిధులు ఇవ్వడానికి ప్రూడెన్షియల్ ఎలక్టోరల్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టిన మహానుభావుడు ఎవరు?. ఆ మహానుభావుడికి 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా, వైకాపా ప్రభుత్వం చేకూర్చిన మేలు ఏమిటన్నది బహిర్గతం చేయాలి.
వైకాపాకు వచ్చిన 600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత భాజాపాకు 5000 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లభించగా, డీఎంకేకు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, బారాసాకు 400కు పైగా చిల్లర కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు లభించాయి. అలాగే బిజు జనతాదళ్ కు 400 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరాయి.
కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి ఎస్ ఆర్ ) కింద తమ కొచ్చిన లాభాలలో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం అన్నది అందరూ హర్షించేదే. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లడానికి రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాయనుకుందాం. అయితే, జాతీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కువ ఇవ్వడం అన్నది సర్వసాధారణ ప్రక్రియ.
కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిధులు సమకూరిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వివరాలు వెల్లడించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన కింద తేలిపోతుందని తెలిసి, ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు.
తెదేపా కు అందిన ఎలక్టోరల్ బాండ్స్ గురించి న్యాయస్థానంలో ప్రస్తావించి, మేము దొంగ నా… వారికి వారే ప్రకటించుకున్నట్లయింది. దీనితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఏ వేదికలో అడగాలో, ఆ వేదికల ద్వారా అడిగి వైకాపాకు అందిన 600 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్వివరాలను రాబడతానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
ప్రతివాదులు వాదన వినిపించిన తరువాత కూడా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది మళ్లీ వాదనలు వినిపించడం ఏమిటో?
ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది వాదనలను వినిపించిన తర్వాత, ప్రతి వాదుల తరఫున న్యాయవాదులు వాదన వినిపిస్తారు. ఆ తరువాత న్యాయమూర్తి కేసులో మెరిట్ ఆధారంగా తీర్పును ఇస్తారు. అయితే, ఏసీబీ న్యాయస్థానంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు పై తొలుత ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, ప్రతివాది తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన తర్వాత కూడా తిరిగి మళ్లీ తాను వాదనలు వినిపిస్తానని పేర్కొని వాదనలను వినిపించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఉద్దేశపూర్వకంగా కేసును పొడిగించడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. పోలీస్ కస్టడీ, బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల పదవ తేదీన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జ్యుడీషియల్ కస్టడీ విధించగా, 15వ తేదీన బెయిల్ పిటిషన్ వేశారు. గత 20 రోజులుగా బెయిల్ పిటిషన్ పై ఎటూ తేల్చకపోవడమన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారం రోజుల వ్యవధిలో బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. బెయిల్ మంజూరు చేయడమా?, లేకపోతే బెయిల్ పిటీషన్ ను కొట్టి వేయడమా ? అన్నది న్యాయమూర్తి విచక్షణాధికారం.
ఏదో ఒక వంక చూపెట్టి కేసు వాయిదా వేయించాలని ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కార్పొరేషన్ ఆడిటర్ ను 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారట. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్లు… ఎందుకు ఆరవ తేదీనే కోర్టుకు హాజరు కమ్మని ఆడిటర్ కు నోటీసులు జారీ చేయలేదు. పదవ తేదీన ఆడిటర్ ను ఏదో కుంటి సాకు చూపెట్టి సమయం కోరాలని చెబుతారు. ఇలా కేసును సాగదీసే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈరోజు కూడా న్యాయస్థానం తీర్పును వెల్లడించకపోతే, పిటీషన్ ను ఉపసంహరించుకొని, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం మంచిదని రఘురామ కృష్ణంరాజు సూచించారు. న్యాయస్థానంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సైకిక్ బిహేవియర్ తో, ప్రతివాది తరపు న్యాయవాదిని నువ్వెంత అన్నట్లు మాట్లాడడం దారుణం.. కేసును సాగదీసేందుకు ప్రయత్నించడం అన్యాయం.
దిక్కుమాలిన ప్రాసిక్యూషన్ వాదనలను విని, అక్రమ కేసులో నిస్వార్ధంగా నాలుగు దశాబ్దాలు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి నీ కేసులో ఇరికించి జైల్లో నిర్బంధించడం అన్నది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడుని మూడు నెలల పాటు జైలులోనే నిర్బంధించి బయటకు రాకుండా చేస్తామని కడప జిల్లాకు చెందిన ఒక సామాజిక వర్గం నాయకులు సవాళ్లు చేస్తూ పందాలు కాయడానికి సిద్ధమవుతున్నారట. మీరెన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ న్యాయవిద్యలను ప్రదర్శించిన మహా అయితే మరో నాలుగు రోజులపాటు చంద్రబాబు నాయుడు బయటకు రాకుండా నిలువరించగలరు.
ఈనెల 9వ తేదీన సుప్రీంకోర్టులో రిమాండ్ రిపోర్ట్ పై దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ లో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన కింద కేసు కొట్టి వేయడం ఖాయం. ఆ కేసుతో పాటే ఐపిసి 409 సెక్షన్ కింద నమోదు చేసిన కేసు కూడా కొట్టివేయబడుతుంది. చంద్రబాబు నాయుడు ని మూడు నెలల పాటు జైల్లో పెట్టాలని వైకాపా నేతలు కంటున్న కలలు మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కళ్ళలు కానున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇదే విషయమై పందాలు కాసేందుకు సిద్ధమవుతున్న కడప జిల్లాకు చెందిన ఒక సామాజిక వర్గ నాయకులకు తాను బహిరంగంగా సవాల్ చేస్తున్నానని చెప్పారు.
సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణకు ఎన్నికల కమిషన్ ఎలా అంగీకరిస్తోంది?
జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఆస్తి హక్కు పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడానికి ఎన్నికల సంఘం ఎలా అంగీకరిస్తుందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి పనిచేశారని, ఇలా ఎవరు కూడా సర్టిఫికెట్లపై తమ ఫోటోలను ముద్రించుకోలేదు. ముఖ్యమంత్రి పదవి అనేది శాశ్వతమైనదికాదు. ఇలా ఫోటోలను ముద్రించుకోవడం నార్సి సిజం అనే మానసిక వ్యాధి.
ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ల పై ముఖ్యమంత్రి ఫోటోలను ముద్రించడానికి ఏ నిబంధనలు అంగీకరించవు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫోటోలను ముద్రించడం మెజారిటీ ప్రజలకు ఇష్టం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి ఫోటోలను చూసి అసహ్యించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మారడం ఖాయం. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెదేపా జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ సర్టిఫికెట్లను రద్దు చేసి నూతన సర్టిఫికెట్లను మంజూరు చేయాలని కోరుతున్నాను. నూతన సర్టిఫికెట్లు మంజూరు చేయగానే, ఈ సర్టిఫికెట్లను సామూహికంగా దహనం చేద్దామని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అజయ్ కల్లం పిటిషన్ కొట్టి వేసే ఛాన్స్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఇచ్చిన 161 స్టేట్మెంట్ రద్దు చేయాలని వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టి వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన వారు, రెండు వారాలు వాయిదా కోరడం విడ్డూరం. అజయ్ కల్లం 161 స్టేట్మెంట్ ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నట్లు సిబిఐ పేర్కొనడంతో పిటిషన్ రద్దు చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.
హైకోర్టు పిటిషన్ రద్దు చేస్తే దాని ప్రభావం సుప్రీంకోర్టులో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారన్నది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఉన్నవారు ఒంటరిగానా?, జంటగానా అన్నది చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఏసీబీ కోర్టులో A9 గా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి బెయిలు పొడిగింపు పిటిషన్ విచారణకు రానుంది. రెండు వారాల ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన ఏసీబీ కో ర్టు, రెండు నెలల పొడిగింపు కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై రెండు నెలలు కాకపోతే మూడు నెలలు తీసుకోమంటుందా?, బయటకు పొమ్మని కొట్టి వేస్తుందా? చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
50 శాతం ఉద్యోగులకు ఇంకా జీతాలే ఇవ్వలేదట…
71 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికీ, ఇంకా 50 శాతం మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలే ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆర్బిఐ నుంచి 44 వేల కోట్ల రూపాయలు, ఇతర చిల్లర అప్పులు, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులతో మొదలుకొని 71 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు.
ఢిల్లీ వీధుల్లో ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు అప్పుల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఐఏఎస్ ల కోసం జీతాలు ఇవ్వడానికి ఏర్పాటుచేసిన కనసా లిటెడ్ పండ్ కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఐఏఎస్ ల కూడా జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.